సమ్మెలో వర్కర్లు..  వంట పనుల్లో టీచర్లు, స్టూడెంట్లు

సమ్మెలో వర్కర్లు..  వంట పనుల్లో టీచర్లు, స్టూడెంట్లు

మహదేవపూర్, వెలుగు : 8 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతోఆగ్రహించిన వర్కర్లు సమ్మెలోకి వెళ్లగా, హాస్టల్ స్టూడెంట్స్ ను పస్తులుంచలేక టీచర్లు వండిపెట్టారు. స్టూడెంట్లు హెల్పర్లుగా మారి వంట వండేందుకు సాయం చేశారు.  జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని 8 ట్రైబల్ ​వెల్ఫేర్​ గురుకులాల్లో ఈ పరిస్థితి వచ్చింది.  తెలంగాణ రాష్ట్ర గిరిజన, సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న డెయిలీ వేజ్​ వర్కర్లకు 8 నెలలుగా జీతాలు రావడం లేదు. దీంతో మహదేవపూర్ సబ్ డివిజన్ పరిధిలోని 8 హాస్టల్స్ లో పనిచేస్తున్న వర్కర్స్​20 రోజులుగా వంట చేస్తూ ఖాళీ సమయాల్లో నిరసన తెలుపుతున్నారు. కానీ అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోవడం లేదు.

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో గురువారం నుంచి సమ్మెలోకి వెళ్లామని డెయిలీ వేజ్​ వర్కర్ల భూపాలపల్లి జిల్లా వైస్ ప్రెసిడెంట్ భూక్య శ్రీనివాస్ చెప్పారు. వర్కర్లు డ్యూటీకి రాకపోవడంతో పిల్లలను పస్తులుంచలేక అన్ని చోట్ల టీచర్లే గరిట తిప్పారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం కూడా స్టూడెంట్లు , టీచర్లే వండుకున్నారు. స్టూడెంట్లు బియ్యం కడిగి, కూరగాయలు కోసి ఇచ్చి సాయపడ్డారు. ప్రతి రోజూ ఇలా వండడం సాధ్యం కాదని, తమ చదువులు దెబ్బతింటాయని, వెంటనే వర్కర్ల సమస్యలు పరిష్కరించి పనిలోకి వచ్చేలా చూడాలని స్టూడెంట్స్​, టీచర్లు సర్కారుకు విజ్ఞప్తి చేశారు.