కొత్త రూల్... 1 నుంచి 7వ క్లాస్ వరకు.. నాలుగేండ్లు ఏడ చదివితే అదే లోకల్

కొత్త రూల్... 1 నుంచి 7వ క్లాస్ వరకు.. నాలుగేండ్లు  ఏడ చదివితే అదే లోకల్

హైదరాబాద్, వెలుగు: టీచర్ పోస్టుల భర్తీ నేపథ్యంలో లోకల్ ఏరియాపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొన్నది. దీనిపై స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు క్లారిటీ ఇచ్చారు. కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం వివిధ రకాల పోస్టులు జిల్లా, జోన్, మల్టీజోన్ పరిధిలోకి మారిపోయాయి. ఆయా పోస్టులకు పోటీ పడే అభ్యర్థుల స్థానికతను నిర్ణయించేందుకు1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ చదివారన్నదే పరిగణనలోకి తీసుకోనున్నారు. ఏడు తరగతుల్లో ఏదైనా జిల్లాలో వరుసగా నాలుగు క్లాసులు చదివితే, ఆ జిల్లాలోనే లోకల్ గా పరిగణిస్తారు. ప్రస్తుతం మొదలైన డీఎస్సీ పోస్టుల అప్లికేషన్లలోనూ ఇదే విధానాన్ని ఆటోమెటిక్​గా అప్​డేట్ అయ్యేలా అధికారులు సాఫ్ట్ వేర్ తయారు చేయించారు. ఒక జిల్లాలోని పోస్టుకు అప్లై చేస్తే.. అభ్యర్థుల చదువును బట్టి లోకల్/నాన్ లోకల్ గా అక్కడే తేలిపోతుంది.  

స్థానికత నిర్ణయించేది ఇలా.. 

  •   ఒక జిల్లాలో 1–4 క్లాసులు చదివి, రెండో జిల్లాలో 5,6,7 క్లాసులు చదివితే.. వరుసగా నాలుగు క్లాసులు చదివిన మొదటి జిల్లా లోకల్ ఏరియాగా చూస్తారు.  
  •   ఒక జిల్లాలో ఫస్ట్ క్లాస్ నుంచి మూడో క్లాస్ వరకూ, రెండో జిల్లాలో 4,5  క్లాసులు, మూడో జిల్లాలో 6,7 క్లాసులు చదివితే.. ఒకటో తరగతి నుంచి మూడో తరగతి     వరకూ చదివిన జిల్లాను లోకల్​గా పరిగణిస్తారు. 
  •  ఒక జిల్లాలో ఫస్ట్ క్లాస్ నుంచి మూడో తరగతి వరకూ, రెండో జిల్లాలో 4,5,6 క్లాసులు చదివి, మూడో జిల్లాలో ఏడో తరగతి చదివితే.. 4–6 క్లాసులు చదివిన రెండో     జిల్లాను లోకల్ గా చూస్తారు. 
  •  మొదటి జిల్లాలో 1,4,5  క్లాసులు, రెండో జిల్లాలో 2,3,6 క్లాసులు, మూడో జిల్లాలో ఏడో తరగతి చదివితే.. 2,3,6 క్లాసులు చదివిన రెండో జిల్లాను స్థానికతగా పరిగణిస్తారు. 
  •  ఒక జిల్లాలో 1,2  క్లాసులు, రెండో జిల్లాలో 3,4 క్లాసులు, మూడో జిల్లాలో 5,6 క్లాసులు, నాల్గో జిల్లాలో ఏడో తరగతి చదివితే.. చివరి పెద్ద క్లాసులు చదివిన మూడో జిల్లాను లోకల్ గా నిర్ణయిస్తారు.