తెలంగాణ జాబ్ స్పెషల్ .. కేంద్రపాలిత ప్రాంతాలు

తెలంగాణ జాబ్ స్పెషల్ .. కేంద్రపాలిత ప్రాంతాలు

ఆంగ్లేయుల పాలనలో భాగంగా భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను 1874లో షెడ్యూల్డ్​ జిల్లాలుగా ప్రకటించడమైంది. ఆ తర్వాతి కాలంలో చీఫ్​ కమిషనర్​ ప్రావిన్సెస్​గా పిలువబడ్డాయి. వీటికి అధికారిగా చీఫ్​ కమిషనర్​ ఉండి రిపోర్టును గవర్నర్​ జనరల్​కు గాని వైస్రాయ్​కు కాని పంపేవాడు.  భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలను పార్ట్​–సిలో రాష్ట్రాలుగా ఉంచడమైంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్​ 1956లో ఏర్పాటైన తర్వాత ఈ కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక గుర్తింపును పొందాయి. 1956లో చేసిన ఏడో రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం అధికారికంగా కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు.రాజ్యాంగంలోని 8వ భాగంలో ఆర్టికల్​ 239 నుంచి 241 వరకు కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన, అధికార విధుల ప్రస్తావన ఉంది. ఆర్టికల్​ 242 (కూర్గు ప్రాంతం) కూడా 8వ భాగంలోనే ఉండేది. కాని దానిని తొలగించడమైంది. ప్రస్తుతం భారతదేశంలో 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. 

కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన

ఆర్టికల్​ 239(1): ప్రతి కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్రపతి నియమించిన లెఫ్టినెంట్​ గవర్నర్​ లేదా అడ్మినిస్ట్రేటర్​ ఉంటారు. వీరు రాష్ట్రపతి ఆదేశాల మేరకు పనిచేస్తారు.
ఆర్టికల్​ 239(2): కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పక్క రాష్ట్రానికి చెందిన గవర్నర్​ను కేంద్రపాలిత ప్రాంతం లెఫ్టినెంట్​ గవర్నర్​ లేదా అడ్మినిస్ట్రేటర్​గా నియమించవచ్చు. 

కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు


ప్రస్తుతం ఇండియాలోని 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో 5 ప్రాంతాలకు (ఢిల్లీ, పుదుచ్చేరి, అండమాన్​ నికోబార్​, జమ్ముకశ్మీర్​, లఢఖ్​) లెఫ్టినెంట్​ గవర్నర్​లు ఉండగా, మూడు ప్రాంతాలకు (చంఢీగర్​, లక్షద్వీప్​, డామన్​ డయ్యూ, దాద్రానగర్​ హవేలి) అడ్మినిస్ట్రేటర్స్​ ఉన్నారు.  వీరికి ఈ హోదాను భారత రాష్ట్రపతి కల్పిస్తారు. వీరి జీతభత్యాలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 2016కు ముందు వీరి జీతం 80,000, భత్యాలు ఉండేవి. కాని క్యాబినెట్​ 2016, జనవరి 1 నుంచి వీరి జీతాన్ని 2,25,000(అలవెన్స్​)కి పెంచింది. 

శాసనసభ(ఆర్టికల్​ 239ఏ): మొత్తం ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడింటికి శాసనసభలు, మంత్రిమండలి ఉన్నాయి. అవి.. 

1. పుదుచ్చేరి. దీని శాసనసభను 1963లో ఏర్పాటు చేశారు. 
2. ఢిల్లీ  దీని శాసనసభను 1992లో ఏర్పాటు చేశారు.
3. జమ్ముకశ్మీర్​ – దీని శాసనసభను 1957లో ఏర్పాటు చేశారు.
కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన శాసనాలను పార్లమెంట్​ రూపొందిస్తుంది. అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు (3) రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలోని అంశాలపై పరిమితులతో కూడిన చట్టాలను రూపొందించును. 

ఢిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తి 

ప్రకరణ 239ఏఏ కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి గల ప్రత్యేక ప్రతిపత్తిని తెలియజేస్తుంది. 239ఏఏ(1) ప్రకారం 69వ రాజ్యాంగ సవరణ (1991) అమలులోనికి వచ్చినప్పటి నుంచి ఢిల్లీను ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంగా పిలుస్తున్నారు. ఈ సవరణ ద్వారా భారత రాజ్యాంగానికి 239ఏఏ, 239ఏబీలను చేర్చారు. ఇది 1992, ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. ఢిల్లీ కార్యనిర్వాహక అధికారిని లెఫ్టినెంట్​ గవర్నర్​ అంటారు. ఇతనిని కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తాడు. వీరు రాష్ట్రపతి విశ్వాసం మేరకు పదవిలో కొనసాగుతారు. ఆర్టికల్​ 324–327, 329లు ఢిల్లీకి వర్తిస్తాయి. 

    239ఏఏ(2)(ఎ) ప్రకారం ఢిల్లీకి ఒక శాసనసభ ఉంటుంది. వీరి మొత్తం సంఖ్య 70. శాసనసభ సభ్యులంతా ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి ప్రత్యక్ష ఎన్నిక పద్ధతి ద్వారా ఎన్నుకోబడుతారు.
    239ఏఏ(4) ప్రకారం శాసనసభ్యుల సంఖ్యలో 10శాతం మించకుండా మంత్రిమండలిని ఏర్పాటు చేయాలి. అంటే ముఖ్యమంత్రి, ఆరుగురు మంత్రులుండాలి. మంత్రులందరు వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహించగా, సంయుక్తంగా విధానసభకు బాధ్యత వహించును. 
    మంత్రిమండలికి ముఖ్యమంత్రి నాయకుడు. శాసనసభ పరిధిలోని అంశాలపై లెఫ్టినెంట్​ గవర్నర్​కు సలహాలు ఇవ్వడం ముఖ్యమంత్రి బాధ్యత.
    ఏదైనా అంశంపై మంత్రిమండలికి, లెఫ్టినెంట్​ గవర్నర్​కు అభిప్రాయ భేదం వచ్చినట్లయితే గవర్నర్​ ఆ విషయాన్ని రాష్ట్రపతికి తెలియజేసి రాష్ట్రపతి ఆదేశం మేరకు నడుచుకోవాలి. రాష్ట్రపతి ఆదేశం అందేలోగా ఏవైనా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లెఫ్టినెంట్​ గవర్నర్​ భావించినట్లయితే అలాంటి చర్యలు తీసుకునే అధికారం లెఫ్టినెంట్​ గవర్నర్​కు ఉంటుంది. 
ఆర్టికల్​ 239ఏఏ(5) ప్రకారం ముఖ్యమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. రాష్ట్రపతి ఇష్టం మేరకు మంత్రులు తమ పదవుల్లో కొనసాగుతారు.
ఆర్టికల్​ 239ఏబీ(బి) ప్రకారం జాతీయ రాజధాని ప్రాంతం సక్రమ పరిపాలనకు, జాతీయ రాజధాని భూభాగాన్ని పాలించడానికి అవసరమైన, ఉపయోగకరమైన చర్యలను రాష్ట్రపతి చేపట్టవచ్చును.

లెఫ్టినెంట్​ గవర్నర్​ వివాదం


ఢిల్లీలో ఉన్నతాధికారుల నియామకాల విషయంలో లెఫ్టినెంట్​ గవర్నర్​కు పూర్తిస్థాయి అధికారాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2015లో నోటిఫికేషన్​ జారీ చేసింది. దీన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ ఢిల్లీ హైకోర్టులో సవాల్​ చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో పాలనాధిపతి లెఫ్టినెంట్​ గవర్నరే అని ఢిల్లీ హైకోర్టు 2016న తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పును కేజ్రీవాల్​ సుప్రీంకోర్టులో సవాల్​ చేశారు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లెఫ్టినెంట్​ గవర్నర్​కు లేదు. మంత్రిమండలి సలహా మేరకు ఆయన నడుచుకోవాలని సుప్రీంకోర్టు 2018, జులైలో తీర్పు చెప్పింది. 69వ రాజ్యాంగ సవరణ (1991) ద్వారా ఢిల్లీని, ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంగా మార్చారు.