తెలంగాణ జాబ్స్ స్పెషల్ : ఎవర్​గ్రీన్​ రెవల్యూషన్​ 

తెలంగాణ జాబ్స్ స్పెషల్ : ఎవర్​గ్రీన్​ రెవల్యూషన్​ 

స్వాతంత్ర్యం వచ్చిన ప్రారంభంలో ఆహార ధాన్యాల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వచ్చేది. అమెరికా నుంచి పీఎల్​–480 కింద ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఇతర వ్యవసాయ ఉత్పాదకాలను ఉపయోగించి హరిత విప్లవం సాధించింది. ఎప్పటికప్పుడు జాతీయ వ్యవసాయ విధానాలను ప్రవేశపెట్టి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా మిగులు సైతం సాధించింది. 

దేశంలో మొదటి జాతీయ వ్యవసాయ విధానాన్ని 1993లో ప్రకటించారు. వ్యవసాయ ఉత్పత్తి వార్షిక వృద్ధిరేటు 2.6శాతం నుంచి 3.5శాతానికి పెంచాలనేది దీని ప్రధానోద్దేశం.  2000, జులై 28న రెండో జాతీయ వ్యవసాయ విధానాన్ని ప్రకటించారు. ఇది డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణంగా ఉంది.  రెండు దశాబ్దాల్లో 4శాతం ఆపైన వృద్ధి సాధించడం, ఒకే గొడుగు కింద బీమా అమలు పరచడం, ప్రైవేటు పెట్టుబడులు ప్రోత్సహించడం, నూతన వంగడాలు సృష్టికి ప్రాధాన్యత ఇచ్చారు.

జాతీయ రైతు కమిషన్​ -2004 

రైతులకు వ్యవసాయ రంగానికి తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఎంఎస్​ స్వామినాథన్​ అధ్యక్షతన 2004లో జాతీయ రైతు కమిషన్​ నియమించారు. వ్యవసాయ పునరుద్ధరణ కార్యాచరణ ప్రణాళిను ఐదు అంశాల్లో ప్రకటించారు. అవి.. 1. భూసారం పెంపొందించడం 2. నీటి సంరక్షణ 3. పరపతి, బీమా సదుపాయాలు కల్పించడం 4. ఉత్పత్తి, ఉత్పత్తి అనంతర కార్యకలాపాలు అనుసంధానం చేయడం 5. ఉత్పత్తిదారుడు పొందే ధరకు, వినియోగదారుడు చెల్లించే ధరకు మధ్య అంతరాన్ని తగ్గించాలి. స్వామినాథన్​ సిఫారసులకు అనుగుణంగా ప్రభుత్వం 2006 జూన్​ 1న 2006–07 సంవత్సరాన్ని వ్యవసాయ పునరుద్ధరణ సంవత్సరంగా ప్రకటించారు.

రెండో హరిత విప్లవం-2006 

2006లో ప్రధాని మన్మోహన్​ సింగ్​ రెండో హరిత విప్లవానికి పిలుపునిచ్చారు. స్వామినాథన్​ కమిషన్​ సూచించిన ఐదు సిఫారసులకు అదనంగా మరో రెండింటిని సూచించారు. 1. విత్తనాల వృద్ధికి విజ్ఞాన శాస్త్రం, బయోటెక్నాలజీని ఉపయోగించడం 2. పశుగణాల ఉత్పాదకత పెంచడానికి విజ్ఞానశాస్త్రం ఉపయోగించడం. మొదటి హరిత విప్లవం భూస్వాములకు, పెద్ద రైతులకు ప్రయోజనం చేకూర్చింది. మెట్ట ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే రెండో హరిత విప్లవం ఉపాంత రైతులకు, చిన్న రైతులకు లబ్ధి చేకూర్చాలి, రసాయానిక ఎరువుల స్థానంలో జీవ సంబంధ ఎరువులు, క్రిమిసంహారక మందుల స్థానంలో బయో పెస్టిసైడ్స్​ను ఉపయోగించాలని ఇందులో సూచించారు.  తూర్పు భారతదేశంలో పంటల ఉత్పాదకతను పెంచడానికి ప్రాధాన్యతను ఇస్తూ రాష్ట్రీయ కృషి వికాస్​ యోజనలో భాగంగా 2010–11లో బ్రింగ్గింగ్​ గ్రీన్​ రెవల్యూషన్​ ఇన్​ ఈస్టర్న్​ ఇండియాను ప్రారంభించారు. 

జాతీయ వ్యవసాయ విధానం - 2007 

రైతులపై నియమించిన జాతీయ వ్యవసాయ కమిషన్​ సిఫారసులను, రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపులను దృష్టిలో పెటుకుని 2007లో రైతులపై జాతీయ విధానాన్ని ప్రకటించారు. పంట ఉత్పత్తి, ఉత్పాదకాలతోపాటు రైతుల ఆర్థిక సంక్షేమంపై దృష్టి పెట్టాలి, రైతులు బీటీ, ఐటీని ఉపయోగించుకోవడంపై దృష్టి పెట్టాలి, రైతులకు నాణ్యమైన విత్తనాలను, పరపతి, బీమాను అందించాలని నిర్ణయించారు. 

ఎవర్​ గ్రీన్​ రెవల్యూషన్


దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని 210 మిలియన్​ టన్నుల నుంచి 420 మిలియన్​ టన్నుల స్థాయికి పెంచడానికి ఎవర్​గ్రీన్​ రెవల్యూషన్​కు శ్రీకారం చుట్టాలని జాతీయ వ్యవసాయ కమిషన్​ అధ్యక్షుడు స్వామినాథన్​ పిలుపునిచ్చారు. శాస్త్రీయ సాంకేతిక పద్ధతులతోపాటు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు. 

ట్రై కలర్​ రెవల్యూషన్​ 

ప్రధాని నరేంద్ర మోడీ 2014లో త్రివర్ణ విప్లవానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఇందులో ప్రోటీన్లు అధికంగా ఉన్న  పప్పు ధాన్యాలు, పశుసంపద, సంక్షేమం, సౌరశక్తి, వినియోగంతోపాటు పరిశుభ్రమైన నీరు, మత్స్యకారుల సంక్షేమాలకు ప్రాధాన్యత ఇచ్చారు. 

శ్వేత విప్లవం

1970వ దశకంలో నేషనల్​ డెయిరీ డెవలప్మెంట్​ బోర్డు దీన్ని చేపట్టింది. వర్గీ కురియన్ ఆధ్వర్యంలో శ్వేత విప్లవం విజయవంతమైంది. 1964–65లో ఇంటెన్సివ్​ క్యాటల్​ డెవలప్​మెంట్​ ప్రోగ్రాంలో భాగంగా మేలైన పశువులను అందించడంతో పాల ఉత్పత్తి పెరిగింది. 1950–51లో 17 మిలియన్​ టన్నులు ఉత్పత్తి చేయగా 2019–20 నాటికి 198.4 మిలియన్​ టన్నులకు చేరింది. ప్రపంచంలో భారత్​ అతిపెద్ద పాల ఉత్పత్తిదారు. 2019–20లో తలసరి పాల లభ్యత 407 గ్రాములు. 

ఎల్లో రెవల్యూషన్​ 

నూనె గింజల ఉత్పత్తిలో స్వయం పోషకత్వాన్ని సాధించేందుకు ఇది ఉద్దేశించడమైంది. 1985–86లో నేషనల్​ ఆయిలైజ్డ్​ డెవలప్​మెంట్​ ప్రాజెక్ట్​ ప్రారంభమైంది. 1986లో టెక్నాలజీ మిషన్​ ఆన్​ ఆయిలైజ్డ్​ అనేది నూనె గింజల ఉత్పత్తిలో ప్రాసెసింగ్​కి ప్రారంభించబడింది. రాజీవ్​గాంధీ శాస్త్రీయ సలహాదారు శ్యామ్​ పిట్రోడా ఆధ్వర్యంలో ప్రారంభమైంది. 

హరిత విప్లవం

మెక్సికోలో 1960 తొలి దశకంలో హరిత విప్లవం ప్రారంభమైంది. అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్​ బోర్లాగ్​ రాక్​ ఫెల్లర్​ ఫౌండేషన్​ స్కాలర్​షిప్​ సహకారంతో మెక్సికోలో గోధుమ వంగడాలపై పరిశోధనలు చేశారు. ఫలితంగా అధిక దిగుబడినిచ్చే గోధుమ వంగడాలు రూపొందించారు. అందుకే నార్మన్​ బోర్లాగ్​ను ప్రపంచ హరిత విప్లవ పితామహునిగా పిలుస్తారు. ఇలాంటి కృషి భారతదేశంలో ఎం. ఎస్​. స్వామినాథన్ ఆధ్వర్యంలో జరగడం వల్ల ఆయన్ని భారతదేశ హరిత విప్లవ పితామహునిగా పిలుస్తారు. 1968 జర్మనీలో అంతర్జాతీయ అభివృద్ధి సమావేశంలో వ్యవసాయ ఉత్పత్తిలో వచ్చిన ఈ ఆకస్మిక పెరుగుదలను సూచిస్తూ విలింగ్​ ఎస్​.గాండ్​ హరిత విప్లవం అనే పదాన్ని ఉపయోగించారు. 

వ్యవసాయ రంగంలో​ ఉత్పత్తిని పెంచేందుకు అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఇతర వ్యవసాయ ఉత్పాదకాలను ఉపయోగించి రైతుల్లో నవచైనత్యం కల్పించి  జీవనాధార వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చే మార్పుల సమాహారమే హరిత విప్లవం. ఈ నూతన వ్యవసాయ వ్యూహం ఒక ఉత్పాదకాన్ని వాడటం ద్వారా కాకుండా అనేక ఉత్పాదకాలను కలిపి ఉపయోగించడం వల్ల ప్యాకేజీ ప్రోగ్రామ్​గా పిలువబడుతున్నది. 

ప్రభావం 

1966 సంవత్సరం తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తి ముఖ్యంగా గోధుమల ఉత్పత్తి భారీగా పెరిగింది.  అందుకే దేశంలో హరిత విప్లవాన్ని గోధుమ విప్లవమని, సంకర జాతి విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల విప్లవం అని కూడా పిలుస్తారు. లస్టర్​ బ్రౌన్​ దీనిని వ్యవసాయ విప్లవం అని పిలిచారు. వీటిలో అత్యధిక పెరుగుదల గోధుమలో కనిపించింది. వరి ఉత్పత్తి హరిత విప్లవం ప్రారంభంలో నెమ్మదిగా పెరిగినప్పటికీ తర్వాత పుంజుకుంది. మూడో ప్రణాళికలో సగటు వరి ఉత్పత్తి 35 మిలియన్​ టన్నులు, 11వ ప్రణాళిక నాటికి 106 మిలియన్​ టన్నులకు చేరింది. ఇదేకాలంలో గోధుమ 11 నుంచి 93 మిలియన్​ టన్నులకు పెరిగింది. వరిలో గోధుమ శాతాన్ని పరిశీలిస్తే రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. జొన్న, బాజ్రా, మొక్కజొన్న వంటి ముతక ధాన్యాలు ఉత్పత్తి నెమ్మదిగా పెరిగింది. పప్పు ధాన్యాల  ఉత్పత్తి ఇంచుమించు స్థిరంగా ఉంది.