తెలంగాణ జాబ్​ స్సెషల్​..నిక్షేపిత మైదానాలు

తెలంగాణ జాబ్​ స్సెషల్​..నిక్షేపిత మైదానాలు

సముద్ర మట్టానికి సమతలంగా గాని, కొద్దిగా ఎత్తుగా అంటే 150 మీటర్లు ఉన్న విశాలమైన పల్లపు ప్రాంతాలను మైదానాలు అంటారు. వీటిని నాగరికత ఊయలలుగా పిలుస్తారు. మైదానాల్లో నదులు నెమ్మదిగా ప్రవహించడం వల్ల జల రవాణా సాధ్యమవుతుంది. ఇక్కడి ప్రజలు వ్యవసాయం, పశుపోషణ, పారిశ్రామిక, వ్యాపార వృత్తులను అవలంబిస్తారు. నదీ తీరాల్లో పెద్ద పెద్ద పట్టణాలు వృద్ధి చెందుతాయి. నదులు సముద్రాన్ని కలిసే చోట రేవు పట్టణాలు ఏర్పడుతాయి. 

మైదానాలు మూడు రకాలు. అవి.. తీర మైదానాలు, క్రమక్షయ మైదానాలు/ కోత మైదానాలు, నిక్షేపిత మైదానాలు.

తీర మైదానాలు :  సముద్రాల్లో మునిగి ఉన్న ఖండాల చివరి భాగం ఊర్ధ్వ బలాల వల్ల పైకి లేవడం మూలంగా తీర ప్రాంతంలో ఏర్పడిన మైదానాలను తీర మైదానాలు అంటారు. 

ఉదా :  బెల్జియంలోని తీర మైదానం, భారత్​లోని తూర్పు, పశ్చిమ తీర మైదానాలు.

క్రమక్షయ మైదానాలు :  బాహ్యశక్తుల కోత కారణంగా ఎత్తయిన ప్రాంతాలు శిథిలమై విశాలమైన మైదానాలుగా ఏర్పడుతాయి. వీటినే క్రమక్ష మైదానాలు అంటారు. ఇవి ఆరు రకాలు. అవి. 1. పెనీ ప్లెయిన్​, 2. పెడీ ప్లెయిన్​, 3. స్ట్రాంట్​ ఫ్లాంట్​, 4. పీడ్​ మౌంట్, 5. బహిక్షాళిత మైదానాలు, 6. కరస్ట్​ మైదానాలు. 

పెనీ ప్లెయిన్ :  పీఠభూములు మొదలైన ఎత్తయిన ప్రాంతాలు నదుల కోతకు గురయి కాలక్రమంలో విశాల మైదానాలుగా ఏర్పడతాయి. వీటినే పెనీ ప్లెయిన్​ అంటారు. 

ఉదా :  కెనడాలోని హడ్సన్​ అఖాతం చుట్టూ ఉన్న మైదానం.

పెడీ ప్లెయిన్ ​:  ఎడారి రకపు శీతోష్ణస్థితి ఉన్న కొండ ప్రాంతాల్లో పవన క్రమక్షయం వల్ల ఏర్పడిన మైదానాలను పెడీప్లెయిన్​ అంటారు. 

ఉదా :  నైరుతి ఆఫ్రికాలో ఏర్పడిన మైదానాలు. ఎడారి ప్రాంతంలో పవన క్రమక్షయం వల్ల ఏర్పడే రాతి మైదానాలను హమడాన్​ లేదా రెగ్​ అంటారు. ఎడారుల్లోన ఇసుక మైదానాలను ఎర్గ్​ అంటారు. 

స్ట్రాండ్​ ప్లాంట్ :  సముద్ర తరంగ క్రమక్షయం వల్ల తీర ప్రాంతాల్లో ఏర్పడే మైదానాలను స్ట్రాంట్​ ఫ్లాంట్ అంటారు. 

ఉదా :  నార్వేలోని పశ్చిమ, వాయవ్య తీరంలో ఏర్పడిన మైదానాలు.

పీడ్​మౌంట్ ​:  నదులు పర్వత ప్రాంతాన్ని వదిలి మైదానంలోకి ప్రవేశించేటప్పుడు ఏర్పరిచే మైదానాలను పీడ్​మౌంట్​ మైదానాలు అంటారు. ఇవి విసనకర్ర ఆకారంలో ఉండటం వల్ల వీటిని ఒండలి నీవెనలు అంటారు. 

బహిళాక్షిత మైదానాలు :  హిమానీనదం హిమరేఖ దాటి ఆకస్మాత్తుగా నీరుగా ఏర్పరిచే మైదానాలను క్రమక్షయ మైదానాలను బహిక్షాళిత మైదానాలు అంటారు. 

ఉదా :  భారత్​లోని లడఖ్​ మైదానం. కెనడా, ఫిన్​లాండ్​ మైదానం.

కరస్ట్ మైదానాలు : అంతర్ భౌమజాలం వల్ల ఏర్పడే క్రమక్షయ మైదానాలను కరస్ట్​ మైదానాలు అంటారు. 

ఉదా : యుగోస్లోవియాలోని కరస్ట్​ ప్రాంతం. 

నిక్షేపిత మైదానాలు :  బాహ్యశక్తుల నిక్షేపితం వల్ల ఏర్పడిన మైదానాలను నిక్షేపిత మైదానాలు అంటారు. ఇవి మూడు రకాలు. అవి. నదీ నిక్షేపిత మైదానాలు, పవన నిక్షేపిత మైదానాలు, హిమానీనద నిక్షేపిత మైదానాలు. 

డెల్టా మైదానం :  నదీ ముఖద్వారాల ప్రాంతాల్లో నది నుంచి కొట్టుకొని వచ్చిన మట్టితో నిక్షేపించబడిన మైదానాలను డెల్టా ఆకారపు ఒండలి నేలలు అంటారు. 

ఉదా :  కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా.

సరోవరీయ మైదానాలు :  నదులు తీసుకువచ్చిన నిక్షేపాలతో సరస్సులు కూడికొని పోయి తర్వాత ఏర్పడిన మైదానాలను సరోవరీయ మైదానాలు అంటారు. 

ఉదా :  కశ్మీర్​ లోయ లోని మైదానాలు

పవన నిక్షేపిత మైదానాలు :  పవన నిక్షేపిత మైదానాల్లో  లోయస్​ మైదానం ముఖ్యమైంది. పవన నిక్షేపణ చర్య వల్ల ఏర్పడిన పసుపు వర్ణపు మైదానాలను లోయస్​ మైదానాలు అంటారు. 

హిమనీనద నిక్షేపిత మైదానాలు :  ఉన్నత అక్షాంశ ప్రాంతాలు, ఎత్తయిన భూభాగాల్లో హిమానీనద నిక్షేపాల వల్ల ఏర్పడిన మైదానాలను డ్రిప్ట్​ మైదానాలు/ టిల్​ మైదానం అంటారు. 

ఉదా :  ఫిన్లాండ్​, ఐస్​లాండ్, స్కాండినేవియా మైదానాలు.

వరద మైదానాలు :  నదులకు వరదలు వచ్చినప్పుడు నీరు గట్లను దాటి ఇరువైపులా ఉన్న పల్లపు ప్రాంతంలోకి ప్రవహిస్తుంది. ఇదే ప్రక్రియ కొన్ని  వేల సార్లు జరిగిన తర్వాత గట్లకు ఇరువైపుల ఉన్న పల్లపు ప్రాంతాలు విశాలమైన మైదానాలుగా ఏర్పడతాయి. వీటినే వరద మైదానాలు అంటారు. ఇవి నాలుగు రకాలు. అవి. బాబర్​, భంగర్​, ఖాదర్​, టెరాయి. 

బాబర్ ​:  పర్వతపాదాల వద్ద గులకరాళ్లతో ఏర్పడిన సచ్చిద్ర మండలాన్ని బాబర్ అంటారు.

ఉదా :  శివాలిక్​ పాదాల వెంట ఉన్న నేలలు

భంగర్ :  నదులు తీసుకొని వచ్చిన ఒండ్రుమట్టి వల్ల ఏర్పడిన పురాతన మైదానాలను భంగర్​ అంటారు.

ఖాదర్​ :  నదులు తీసుకొని వచ్చిన ఒండ్రుమట్టి వల్ల ఏర్పడిన నవీన మైదానాలను ఖాదర్​ అంటారు.

టెరాయి :  బాబర్​ ప్రాంతంలో భూమిలోకి పోయిన నీరు కొన్ని కిలోమీటర్ల తర్వాత మళ్లీ  పైకి వచ్చి ఏర్పరిచిన చిత్తడి ప్రాంతాన్ని టెరాయి అంటారు. 

ఇతర నిక్షేపిత మైదానాలు : 

    అంతర్​ భౌమ జలం వల్ల ఏర్పడే నిక్షేపిత మైదానాన్ని టెర్రరోసా మైదానం అంటారు.

ఉదా : యుగోస్లోవియా.

  •     సముద్ర తరంగాల వల్ల ఏర్పడే నిక్షేపిత మైదానాన్ని  బీచ్​ అంటారు.
  •     సముద్రాలు, నదులు ఇసుక, బురద నిక్షేపాలతో ఏర్పరిచే మైదానాలను సమతల మైదానం అంటారు. 
  •     భూ అంతర్భాగంలోని మట్టి కొన్ని సందర్భాల్లో పైకి వచ్చి డైక్​ ఆకారంలో నిర్మాణాలు ఏర్పరిచిన మైదానాలను పోల్డర్ మైదానం అంటారు. 

ఉదా : నెదర్లాండ్​

  •     ఇటలీలోని పో  నది వద్ద గల మైదానాన్ని లోంబార్ట్​ మైదానం అంటారు.