- అమెరికా పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికాలోని యూటా స్టేట్ పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందని తెలిపారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్–యూటా ఎండీ, సీవోవో డేవిడ్ కార్లెబాగ్ నేతృత్వంలోని యూటా స్టేట్ పారిశ్రామికవేత్తల బృందం శుక్రవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. టెక్నాలజీ, ఇన్నొవేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, లైఫ్ సైన్సెస్, ఏఐ ఆధారిత హెల్త్ కేర్, క్లీన్ ఎనర్జీ, ఎడ్యుకేషన్, స్కిల్స్ తదితర రంగాల్లో ‘యూటా–తెలంగాణ’ మధ్య ద్వైపాక్షిక సహకారం, నైపుణ్య మార్పిడికి అవకాశాలపై చర్చించారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సంస్కరణలు, పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. టీ-హబ్, టీ- వర్క్స్, వీ హబ్ లను వరల్డ్ ట్రేడ్ సెంటర్, సిలికాన్ స్లోప్స్, యూటా టెక్ స్టార్టప్‌లతో అనుసంధానించేలా చొరవ చూపాలని కోరారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ తదితర టెక్నాలజీల్లో యూనివర్సిటీ ఆఫ్ యూటా, బీవైయూ, న్యూమాంట్ యూనివర్సిటీలతో కలిసి రాష్ట్రంలోని ప్రముఖ విద్యా సంస్థలు ఉమ్మడి అకడమిక్, రీసెర్చ్ ప్రోగ్రామ్ లను చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, తెలంగాణ లాంటి ఫాస్ట్- గ్రోయింగ్, డైనమిక్, ప్రో-యాక్టివ్ రాష్ట్రంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీవోవో డేవిడ్ కార్లెబాగ్ చెప్పారు.
కార్యక్రమంలో యూటా స్టేట్ ప్రతినిధుల సభ సభ్యులు జేసన్ థాంప్సన్, మాట్ మాక్‌ఫెర్సన్, నికోల్ మాక్‌ఫెర్సన్, లైఫ్ టైం ప్రెసిడెంట్ బీజే హాకే, జేకేడీ ప్రెసిడెంట్ మైక్ నెల్సన్, మోనెరె ఏఐ సీఈవో, కో-ఫౌండర్ మౌ నంది, భారత్ వ్యాలీ అడ్వైజర్లు స్టీవ్ వుడ్, సున్‌హాష్ లోడే, ఎక్విప్ సోషల్ ఇంపాక్ట్ టెక్నాలజీస్ ఫౌండర్ లక్ష్మినారాయణ, ఐఐఆర్ఎఫ్ గురు సౌలే తదితరులు పాల్గొన్నారు.
