ఓవర్ స్పీడ్ తో 17,386 యాక్సిడెంట్లు.. 6,368 డెత్స్

ఓవర్ స్పీడ్ తో 17,386 యాక్సిడెంట్లు.. 6,368 డెత్స్
  • రాష్ట్రంలో 2021లో 21,315 రోడ్డు ప్రమాదాలు.. 7,557 మంది మృతి
  • ఓవర్ స్పీడ్ ప్రమాదాలు, మరణాల్లో ఆరో స్థానంలో తెలంగాణ
  • కేంద్ర ప్రభుత్వం రిపోర్టులో వెల్లడి
  • ఆ ఏడాది దేశవ్యాప్తంగా 4.12 లక్షల యాక్సిడెంట్లు.. 1.54 లక్షల డెత్స్

హైదరాబాద్, వెలుగు: ఓవర్ స్పీడ్ ప్రాణాలు తీస్తోంది. ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు, మరణాలకు అతి వేగమే కారణమవుతోంది. మన రాష్ట్రంలో 2021లో మొత్తం 21,315 రోడ్​ యాక్సిడెంట్లు జరగ్గా, వాటిలో ఓవర్​స్పీడ్ ​కారణంగా జరిగినవే 17,386 ఉన్నాయి. అంటే ప్రమాదాల్లో 81 శాతం ఓవర్ స్పీడ్ వల్లనే జరిగాయి. ఆ ఏడాది జరిగిన ప్రమాదాల్లో మొత్తం 7,557 మంది చనిపోగా, వారిలో 6,638 మంది ఓవర్ స్పీడ్ వల్లనే ప్రాణాలు కోల్పోయారు. అంటే 88 శాతం మరణాలకు అతి వేగమే కారణం. ఓవర్ స్పీడ్ వల్ల జరిగిన యాక్సిడెంట్లు, డెత్స్ లో రాష్ట్రం దేశంలో ఆరో స్థానంలో ఉంది. పది లక్షలకు పైగా జనాభా ఉన్న సిటీల్లో జరిగిన ప్రమాదాల జాబితాలో హైదరాబాద్​ 8వ స్థానంలో ఉంది. సిటీలో 2,273 ప్రమాదాలు జరగ్గా, 297 మంది ప్రాణాలు కోల్పోయారు. 2021లో జరిగిన రోడ్డు ప్రమాదాలు, మరణాలపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆ ఏడాది రాష్ట్రంలో చనిపోయినోళ్లలో 6,612 మంది మగవాళ్లు, 945 మంది ఆడవాళ్లు ఉన్నారు. డ్రంకెన్ డ్రైవ్ వల్ల 339 మంది, రాంగ్​రూ ట్ డ్రైవింగ్ కారణంగా 68 మంది చనిపోయారు. 

మృతుల్లో 1,310 మంది వాకర్స్

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే వాళ్లకు సేఫ్టీ లేకుండా పోయింది. ప్రమాదాల్లో చనిపోయినోళ్లలో 1,310 మంది వాకర్స్ ఉన్నారు. రోడ్డు దాటుతుంటేనో,  రోడ్డు పక్కన నిలబడి ఉంటేనో వాహనాలు అతి వేగంతో వచ్చి ఢీకొడుతున్నాయి. సిటీలో ఫుట్​పాత్​లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తుండడంతో రోడ్లపైనే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొన్ని చోట్ల బైకర్లు ఫుట్​పాత్​ల మీది నుంచే బైకులను నడుపుతూ ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. ఇక బైకులు నడిపేటోళ్లు చాలా వరకు హెల్మెట్​పెట్టుకోవడం లేదు. దీని కారణంగా ప్రమాదాల్లో చనిపోయినోళ్ల సంఖ్య 2,351. ఈ జాబితాలోనూ మన రాష్ట్రం ఆరో స్థానంలో ఉంది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల మరో 244 మంది మృతి చెందారు.  

డెత్స్ ఇండియాలోనే ఎక్కువ.. 

వరల్డ్​రోడ్​స్టాటిస్టిక్స్​ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో మన దేశం రెండో స్థానంలో ఉండగా, డెత్స్ లో మాత్రం మొదటి స్థానంలో ఉందని కేంద్రం రిపోర్ట్​లో పేర్కొంది. రోడ్డు ప్రమాదాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అక్కడ 19,27,654 యాక్సిడెంట్లు జరగ్గా.. 36,560 మంది చనిపోయారు. ఈ లెక్కన చూస్తే ప్రమాదాలు, మరణాల రేషియో తక్కువగా ఉంది. మన విషయానికొస్తే అది చాలా ఎక్కువగా నమోదవుతోంది. 

యాక్సిడెంట్లు: తమిళనాడు (55,682), మధ్యప్రదేశ్​(48,877), ఉత్తరప్రదేశ్​(37,729), కర్నాటక (34,647), కేరళ (33,296), మహారాష్ట్ర (29,477), ఆంధ్రప్రదేశ్​ (21,556), తెలంగాణ (21,315), రాజస్థాన్​(20,951), గుజరాత్​(15,186). 

డెత్స్: ఉత్తరప్రదేశ్​ (21,227), తమిళనాడు (15,384), మహారాష్ట్ర (13,528), మధ్యప్రదేశ్​(12,057), రాజస్థాన్​(10,043), కర్నాటక (10,038), ఆంధ్రప్రదేశ్​(8,186), బీహార్​(7,660), తెలంగాణ (7,557), గుజరాత్​(7,452).

సగానికిపైగా యువతే

రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినోళ్లలో సగానికిపైగా యువతే ఉన్నారు. 18- నుంచి 45 ఏండ్లోళ్లు 5,415 మంది చనిపోయారు. 18 ఏండ్ల లోపున్నోళ్లు 293 మంది, 18 నుంచి 25 ఏండ్లోళ్లు 1,292 మంది, 25 నుంచి 35 ఏండ్ల వాళ్లు 2,224 మంది, 35 నుంచి 45 మధ్య ఉన్నోళ్లు 1,899 మంది, 45 నుంచి 60 ఏండ్ల వాళ్లు 1,374 మంది, 60 ఏండ్లుపైబడినోళ్లు 465 మంది ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా యాక్సిడెంట్లకు ప్రధాన కారణమైన 485 బ్లాక్ స్పాట్ లను కేంద్రం నివేదికలో పేర్కొంది. వాటిలో ఎస్ఆర్ఎం స్కూల్​(కోదాడ), నందికంది శివారు (సదాశివపేట), మల్కాపూర్​క్రాస్​రోడ్​(కొండాపూర్)​, ముత్తంగి లిమిట్స్​(పటాన్​చెరు), అవుషాపూర్​(ఘట్కేసర్), ఇస్నాపూర్​క్రాస్​రోడ్​(పటాన్​చెరు), మేళ్లచెర్వు ఫ్లైఓవర్​ (కోదాడ), టిప్పూఖాన్​బ్రిడ్జి (హైదరాబాద్), నాయుడు పెట్రోల్​పంప్​క్రాస్​(మన్నూర్​, వరంగల్), టెక్రియల్​క్రాస్​రోడ్ (దేవన్​పల్లి, కామారెడ్డి)​ టాప్​టెన్​బ్లాక్​స్పాట్స్ అని తెలిపింది. 

దేశంలో పెరిగిన ప్రమాదాలు, మరణాలు

2021లో దేశ వ్యాప్తంగా 4,12,432 యాక్సిడెంట్లు జరిగితే.. 1,53,972 మంది చనిపోగా 3,84,448 మంది గాయపడ్డారని కేంద్రం నివేదికలో వెల్లడించింది. అంటే గంటకు 47 ప్రమాదాల్లో 18 మంది చనిపోతున్నారు. 2020తో పోలిస్తే ప్రమాదాలు 12.6 శాతం, మరణాలు 16.9 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి 2010 నుంచి చూస్తే రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గినా ఏటికేడు మరణాలు మాత్రం పెరిగాయి. కరోనా ప్రభావంతో ఒక్క 2020 మినహా ఏ ఏడాది చూసినా మరణాలు ఎక్కువగానే నమోదయ్యాయి. మొత్తం ప్రమాదాల్లో 2,95,522 ప్రమాదాలు అతివేగం వల్లనే జరిగాయి. దానివల్ల 1,07,236 మంది ప్రాణాలు కోల్పోయారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల 9,150 ప్రమాదాలు జరిగి 3,314 మంది మరణించారు. రాంగ్​రూట్​లో ప్రయాణాల వల్ల 21,491 యాక్సిడెంట్లు అయితే 8,122 మంది మృతి చెందారు. కాగా, రెసిడెన్షియల్​ ప్రాంతాల్లోనూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. 2021లో 76,791 ప్రమాదాలు రెసిడెన్షియల్ ఏరియాల్లోనే జరగ్గా 26,921 మంది చనిపోయారు.