
- 64 చోట్ల కాంగ్రెస్, మరో చోట మిత్రపక్షం సీపీఐ విజయం
- సౌత్ తెలంగాణలో జోరు.. నార్త్‌లోనూ అదే హోరు
- 39 సీట్ల దగ్గర్నే కారుకు బ్రేక్.. ఆరుగురు మంత్రులకు షాక్
- బీజేపీకి 8 సీట్లు.. 2018తో పోలిస్తే ఏడు సీట్లు అదనం
- కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌పై వెంకటరమణారెడ్డి విక్టరీ
- ఏడు సీట్లను కాపాడుకున్న ఎంఐఎం.. ఖాతా తెరువని బీఎస్పీ
- ఊసులో లేని జనసేన.. డిపాజిట్లు కోల్పోయిన సీపీఎం
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ప్రజలు మార్పుకే ఓటేశారు. కాంగ్రెస్ పార్టీకి జైకొట్టి.. ఘన విజయం అందించారు. హ్యాట్రిక్‌పై ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ను ఓడగొట్టారు. మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో అత్యధికంగా 64 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. దాని మిత్రపక్షం సీపీఐ ఒక్క సీటులో పోటీ చేసి ఆ ఒక్కసీటునూ కైవసం చేసుకుంది. ఇన్నాళ్లూ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కేవలం 39 సీట్లకు పరిమితమైంది. సౌత్ తెలంగాణలో దాదాపు ఏకపక్షంగా జనం కాంగ్రెస్‌కు సీట్లు అప్పగించారు. నార్త్ తెలంగాణలోనూ కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించింది. బీజేపీ8, ఎంఐఎం 7 సీట్లను గెలుచుకున్నాయి. మ్యాజిక్ ఫిగర్‌ను దాటి మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టనుంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల హామీలతో పాటు రాష్ట్రంలో మార్పు కావాలనే నినాదానికి తెలంగాణ ఓటర్లు మొగ్గు చూపారు. 2018 ఎన్నికలతో పోలిస్తే ప్రధాన పార్టీల సీట్లు, ఓట్ల బలం ఈసారి తారుమారైంది. అప్పటి ఎన్నికల్లో టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) 88 సీట్లు, కాంగ్రెస్ 19, ఎంఐఎం 7, బీజేపీ ఒకటి, ఇతర పార్టీలు 4 సీట్లను గెలుచుకున్నాయి. ఆ తర్వాత ఫిరాయింపులు, ఉప ఎన్నికలతో కలిపి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీట్ల సంఖ్య 104కు చేరింది. ఇప్పుడు అది 39కి పడిపోయింది. ఆ గెలిచినవాళ్లలో 23 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు.
కామారెడ్డిలో సంచలనం
రెండు చోట్ల పోటీ చేసిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తన సిట్టింగ్ సీటు గజ్వేల్ నియోజకవర్గం నుంచి మరోసారి గెలుపొందారు. కొత్తగా పోటీ చేసిన కామారెడ్డిలో పరాజయం చెందారు. అటు కొడంగల్‌తో పాటు ఇటు కేసీఆర్‌పై కామారెడ్డిలో పోటీ చేసిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. కొడంగల్‌లో విజయం సాధించారు. కామారెడ్డిలో ఆయన కూడా ఓడిపోయారు. కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలుపొంది సంచలనం సృష్టించారు. ఈ స్థానంలో కేసీఆర్ రెండో ప్లేస్‌కు, రేవంత్ మూడో ప్లేస్‌కు పరిమితమయ్యారు. బీఆర్ఎస్ కేబినెట్లోని మంత్రుల్లో ఆరుగురు ఓటమి పాలయ్యారు.
బీజేపీలో ఏడుగురు కొత్తోళ్లు
గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీ మంచి ఫలితాలను రాబట్టుకుంది. 2018 ఎన్నికల్లో గోషామహల్ సీటుకే పరిమితమైన ఆ పార్టీ.. ఆ తర్వాత ఉప ఎన్నికలతో మరో రెండు సీట్లు (దుబ్బాక, హుజూ రాబాద్) గెలుచుకుంది. అయితే.. ఊహించని రీతిలో ఈసారి ఎనిమిది స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. గోషామహల్‌తోపాటు కొత్తగా మరో ఏడు సెగ్మెంట్లలో గెలుపొందింది. అసెంబ్లీలో తమ బలాన్ని అంతకంతకు పెంచుకుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ ఎంపీలు ముగ్గురికీ చేదు అనుభవమే ఎదురైంది. కరీంనగర్లో బండి సంజయ్, కోరుట్లలో ధర్మపురి అర్వింద్, బోథ్‌లో సోయం బాపూరావు ఓడిపోయారు. ఆ పార్టీ ముఖ్య నేత ఈటల రాజేందర్ తాను పోటీ చేసిన రెండు సీట్లలో పరాజయం పాలయ్యారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై, తన సొంత నియోజకవర్గం హుజురాబాద్‌లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌రెడ్డిపై ఈటల ఓడిపోయారు.
- బీజేపీతో పొత్తులో 8 చోట్ల పోటీ చేసిన జనసేన పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.
- 107 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ ఖాతా తెరవలేదు. సిర్పూర్లో ఆ పార్టీ స్టేట్ చీఫ్, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్ విజయం సాధించారు. కాంగ్రెస్‌తో పొత్తులో ఒక్క సీటులో పోటీ చేసిన సీపీఐ కొత్తగూడెంలో గెలుపొందింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అక్కడ గెలుపొందారు.
- గ్రెస్‌తో పొత్తులు కుదరక 19 చోట్ల ఒంటరిగా పోటీ చేసిన సీపీఎం అన్ని చోట్ల ఓటమిపాలైంది. పాలేరు నుంచి పోటీకి దిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అక్కడ డిపాజిట్ కోల్పోయారు.
- గత ఎన్నికల్లో ఏడు సీట్లు గెలుచుకున్న ఎంఐఎం ఈసారి కూడా తమ ఏడు సీట్లను కాపాడుకుంది. వీరిలో నలుగురు సిట్టింగ్‌లు, ముగ్గురు కొత్తవారు ఉన్నారు.
అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అధికారానికి దూరంగా ఉంది. ఈ సారి అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా అధికారాన్ని చేపట్టేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సీట్లను దాటేసింది. పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి గెలిచి రికార్డు సృష్టించారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమ సొంత నియోజకవర్గాల్లో భారీ ఆధిక్యంతో గెలిచారు.