రోడ్ల నాణ్యతపై విదేశాల్లో అధ్యయనం చేయండి : ఎర్రబెల్లి

రోడ్ల నాణ్యతపై విదేశాల్లో అధ్యయనం చేయండి : ఎర్రబెల్లి

దేశానికి రోల్ మోడల్ గా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు రోడ్ల మీద ఎలాంటి ఇబ్బందులు పడకూడదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అందుకు రోడ్ల మరమ్మత్తులు, నిర్వహణ ఎప్పటికప్పుడు చేపడుతూ వాటిని అద్దంలా ఉంచాలని ఆయన ఉన్నతాధికారులకు సూచించారు. రాష్ట్రంలోని రోడ్లపై ఎక్కడా గుంతలు ఉండకూడదని, రవాణాలో ప్రజలకు అసౌకర్యం కలగకూడదన్నారు. దీని కోసం వెంటనే రోడ్ల మరమ్మత్తులు, నిర్వహణపై చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో.. మంత్రి ఎర్రబెల్లి పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో వర్క్ షాప్ నిర్వహించి దిశానిర్ధేశనం చేశారు.

రోడ్లు అందంగా, అద్దంలా ఉండేందుకు పంచాయతీ రాజ్ శాఖను పునర్వవస్థీకరిస్తూ బలోపేతం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 67 వేల కిలోమీటర్ల పి.ఆర్ రోడ్లు ఉన్నాయని, ఇందులో ప్రతి రోడ్డుని అద్దంగా ఉంచాలన్నారు. ఇందుకోసం పనిని విభజించి అన్ని స్థాయిల ఇంజనీర్లకు బాధ్యతలు అప్పగించాలన్నారు, శాఖ పునర్వవస్థీకరణకు అవసరం అయితే  మరో వంద కోట్ల రూపాయలు పెంచాలన్నది సీఎం కేసిఆర్ ఆలోచనగా ఉందని, దీనికి వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేయాలని మంత్రి చెప్పారు.

రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులు, నిర్వహణపై సీఎం సీరియస్ గా ఉన్నారని మంత్రి తెలిపారు. డిసెంబర్ 6 వ తేదీ నాటికి కొత్త ఎస్. ఈ ఆఫీస్ లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రోడ్ల మరమ్మత్తులు, నిర్వహణ ప్రతిపాదనలు డిసెంబర్ 15వ తేదీలోపు పూర్తి చేయాల్సిందేనన్నారు. ఈ ఏడాది 1500 కోట్ల రూపాయల బడ్జెట్ ఉందని, దీనికి రెట్టింపుగా 3000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రోడ్ల నిర్మాణంలో నూతన ఆధునిక విధానాలు అమలు చేయాలని, దీనివల్ల రోడ్ల నాణ్యత..వాటి జీవితకాలం బాగా పెరుగుతుందని మంత్రి చెప్పారు. ఇందుకోసం విదేశాల్లో పర్యటించి అక్కడి రోడ్ల నిర్మాణ విధానాలను అధ్యయనం చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు.