
- ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలను జాతీయ విపత్తుగా పరిగణించండి
- కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు డిప్యూటి సీఎం భట్టి, మంత్రి తుమ్మల విజ్ఞప్తి
- రూ.5,018.72 కోట్ల నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా
- గత, ప్రస్తుత సాయం కింద తక్షణమే నిధులు రిలీజ్ చేయాలని రిక్వెస్ట్
- త్వరలోనే కేంద్ర బృందాలను రాష్ట్రానికి పంపుతామని అమిత్ షా హామీ
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని.. దీనిని జాతీయ విపత్తుగా పరిగణించి ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ప్రాథమిక అంచనా ప్రకారం.. రూ.5,018 కోట్లు నష్టం వాటిల్లిందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. గత విపత్తు, ఇప్పటి ప్రకృతి విలయాన్ని పరిగణనలోకి తీసుకొని మొత్తం రూ.16,732 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భట్టి భేటీ అయ్యారు. షా నివాసంలో దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ) అరవింద్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ ఉన్నారు. ఈ సందర్భంగా వరద నష్టంగాపై ప్రాథమిక అంచన నివేదిక, వినతిపత్రం అందజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తెలంగాణలో పంట, ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని వివరించారు. కేంద్రం తక్షణమే సాయం అందించాలని కోరారు. ఆగస్టు 25 నుంచి 28వ తేదీల మధ్య తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయని వివరించారు. ప్రధానంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వరదలు సంభవించి భారీ నష్టం జరిగిందన్నారు. ఈ జిల్లాల్లో మౌలిక సదుపాయాలకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని, రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే 25 శాతం అధికంగా ఉందని షా దృష్టికి తీసుకెళ్లారు. ఎనిమిది జిల్లాల్లో 65 నుంచి 95 శాతం అదనపు వర్షపాతం నమోదైందని వివరించారు. వర్షాలు కొనసాగుతూనే ఉండటంతో మనుషులతో పాటు మూగ జీవులు, పశువులు ప్రాణాలు కోల్పోయాయన్నారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు, పంట పొలాలకు నష్టం వాటిల్లిందన్నారు.
గతంలోనూ నిధులివ్వలే
గతంలోనూ రాష్ట్రంలో భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు కేంద్రం సహకరించలేదని గుర్తు చేశారు. గతేడాది ఖమ్మం, పరిసర జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా భారీ నష్టం జరిగిందన్నారు. వరద నష్టం కింద రాష్ట్రానికి రూ.11,713 కోట్ల ఆర్థికసహాయం కోరినప్పటికీ.. కేంద్రం నుంచి నిధులేమీ ఇవ్వలేదని తెలిపారు. ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుండా.. కేవలం సాధారణ నిధులే విడుదలయ్యాయని గుర్తుచేశారు. దీంతో పరిస్థితులు చక్క దిద్దడంలో, పునర్నిర్మాణంలో ఇబ్బందులు తలెత్తాయని అమిత్ షాకు వివరించారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని గతంలో కోరిన రూ.11,713 కోట్లతోపాటు తాజాగా ప్రాథమిక అంచనా ప్రకారం... రూ.5,018 కోట్లు మొత్తం కలిపి రూ.16,732 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం నేతృత్వంలోని బృందం షా కు విజ్ఞప్తి చేసింది.
కేంద్ర బృందాలను పంపండి
72 గంటలపాటు కురిసిన వర్షాల తీవ్రతతో రోడ్లు, రైల్వే ట్రాక్‌లు, కల్వర్టులు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు వంటి మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కేంద్ర మంత్రి అమిత్ షాకు డిప్యూటీ సీఎం భట్టి వివరించారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ జీవన విధానానికి అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ఈ పరిస్థితిని జాతీయ విపత్తుగా పరిగణించాలని కేంద్ర హోంమంత్రిని కోరారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రంలో 22 మంది మృతిచెందారని, పాడి పశువుల మరణించాయని, గృహ, పంట నష్టాల గణన కొనసాగుతోందని తెలిపారు. కావున, తక్షణమే.. తెలంగాణకు కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విజ్ఞప్తిపై షా సానుకూలంగా స్పందించిట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందాన్ని తెలంగాణకు పంపి.. నష్టాన్ని అంచనా వేయిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్టు వెల్లడించారు.
రూరల్ రోడ్డు కనెక్టివిటీ ప్రోగ్రాం కింద 110 కోట్లు ఇవ్వండి: తుమ్మల
రూరల్ రోడ్డు కనెక్టివిటీ ప్రోగ్రాం కింద ఖమ్మంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.110 కోట్లు ఇవ్వాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం కేంద్ర మంత్రితో ఆయన భేటీ అయ్యారు. ఇందులో భాగంగా, ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి గురించి చర్చించారు. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో గిరిజనులు నివసిస్తున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ ప్రాంత పరిధిలో సిమెంట్ కాంక్రీట్ డ్రైనేజింగ్ నెట్‌వర్క్ నిర్మాణానికి ఖమ్మం పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం ప్రతిపాదనలు రూపొందించిందని వివరించారు. ఈ ప్రతిపాదనల్లో భాగంగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలో రూరల్ రోడ్డు కనెక్టివిటీ ప్రోగ్రాం కింద ఆర్థిక సాయం అందించాలని కోరారు. నిధుల విడుదలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మీడియాకు తుమ్మల వెల్లడించారు.
అమిత్ షాకు అందజేసిన ప్రాథమిక అంచనా రిపోర్ట్ మౌలిక సదుపాయాల నష్టాలు
(ప్రాథమిక అంచనాల ప్రకారం):
- అత్యవసర మరమ్మతులకు తక్షణ నిధుల అవసరం రూ.1,500 కోట్లు
- మున్సిపల్ పరిపాలన రూ.1,025 కోట్లు
- రోడ్లు (ఆర్ అండ్ బీ) రూ.785.59 కోట్లు
- నీటిపారుదల రూ.655.70 కోట్లు
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రూ.377.43 కోట్లు
- ఇతర శాఖలు / ప్రభుత్వ ఆస్తులు రూ.300 కోట్లు
- పంట నష్టం రూ.236 కోట్లు
- ఇంధన శాఖ (విద్యుత్) రూ.40.73 కోట్లు.
- గృహనిర్మాణ శాఖ రూ.25 కోట్లు
- మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం రూ.23.43 కోట్లు.
- వైద్య , ఆరోగ్య శాఖ రూ.14.84 కోట్లు
- పశుసంవర్ధక శాఖ రూ.10 కోట్లు
- మొత్తం (ప్రాథమిక అంచనాలు): రూ.5018.72 కోట్లు