జనవరి 26 వేడుకల్లో..తెలంగాణ శకటం

జనవరి 26 వేడుకల్లో..తెలంగాణ శకటం
  •    ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’ థీమ్​తో ప్రదర్శన
  •     శకటంపై కొమురం భీం,రాంజీ గోండు విగ్రహాలు
  •     తెలంగాణ సాయుధ పోరాటం తెలియజేసేలా రూపకల్పన
  •     సీఎం రేవంత్ చొరవతో చివరి నిమిషంలో దక్కిన చాన్స్

న్యూఢిల్లీ, వెలుగు :  ఢిల్లీలోని కర్తవ్యపథ్​లో నిర్వహించే రిపబ్లిక్ డే వేడుకల్లో మన రాష్ట్రం శకటాన్ని ప్రదర్శించనుంది. మూడేండ్ల తర్వాత తెలంగాణకు ఈ అవకాశం దక్కింది. ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’ థీమ్​తో శకటం రూపొందుతున్నది. ప్రజల హక్కులు, ప్రజాస్వామ్య విలువలు కాపాడే దిశగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ఈ పోరాటం.. దేశ ప్రజాస్వామ పరిరక్షణలో భాగమనే చరిత్రను శకటం ద్వారా ప్రదర్శించబోతున్నది. ఎవరు సాయుధ పోరాటం చేసినా... అంతిమంగా అది హక్కుల కోసమే అనే భావనతో తెలంగాణ శకటం సిద్ధమవుతున్నది.

 ఉద్యమ నేపథ్యం నుంచి అభివృద్ధి వైపు రాష్ట్రం ఎలా అడుగులు వేస్తున్నదో కూడా చూపించేందుకు రెడీ అవుతున్నది. ఆ నాటి నిరంకుశ పాలన, తెలంగాణ ఆడ బిడ్డలకు జరిగిన అవమానాల గాథల నుంచి స్వరాష్ట్రం కోసం పుట్టిన ఉద్యమ తీరును దేశ ప్రజల కండ్లకు కట్టేలా శకటాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన ఆదిలాబాద్ గోండు వీరుడు కొమురం భీం, బ్రిటీష్ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొన్న రాంజీ గోండు, వీర వనిత చాకలి ఐలమ్మ విగ్రహాలను శకటంపై ప్రదర్శించబోతున్నారు. మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన ఎందరో అమరుల త్యాగాలు స్మరించేలా తెలంగాణ సర్కార్ శకటాన్ని రూపొందిస్తున్నది.

సీఎం రేవంత్ రెడ్డి చొరవతో...

కర్తవ్యపథ్ లో తెలంగాణ శకటం ప్రదర్శించడంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పోరాట పటిమ, చరిత్రను చాటేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. వాస్తవానికి ప్రతియేటా సెప్టెంబర్ లో రక్షణ శాఖ శకటాల ప్రదర్శనపై రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం ఇస్తుంది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం కోరిన థీమ్ లో తమ శకటాల నమూనాలను పంపిస్తారు. ఈ శకటాల ప్రదర్శనకు సంబంధించిన సెర్మోనియల్ కమిటీ వివిధ దశల్లో అన్నీ అంశాలను పరిశీలించి.. డిసెంబర్ లో ఫైనల్ చేస్తుంది. 

కానీ.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో స్టేట్ థీమ్ పంపేందుకు అవకాశం దక్కలేదు. తెలంగాణ శకటాన్ని ప్రదర్శించేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర రక్షణ శాఖకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సెర్మోనియల్ కమిటీ.. రాష్ట్ర శకట నమూనాను పరిశీలించింది. అయితే... థీం, సౌండ్ ఎఫెక్ట్, నమూనా ఇలా అన్ని దశల్లో కమిటీ పెట్టిన కండీషన్లను రాష్ట్ర శకటం ఫుల్ ఫిల్ చేయడంతో ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక రాష్ట్ర సమాచార శాఖ అధికారులు కూడా తెలంగాణ శకటం ఆమోదం పొందేందుకు తీవ్రంగా కృషి చేశారు. 

గత ప్రభుత్వం రాజకీయాల్లో బిజీ

పదేండ్ల పాలనలో ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ శకటంపై ఆసక్తి చూపించలేదని గత రికార్డులు చెప్తున్నాయి. ఉదమ్య పార్టీగా అధికారంలోకి వచ్చినా.. ఆ తర్వాత జాతీయ పార్టీ వైపు అడుగులు వేసింది తప్ప.. నేషనల్ లెవల్​లో తెలంగాణ ఖ్యాతిని చూపడంలో విఫలమైంది. దీంతో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేవలం రెండు సార్లు మాత్రమే ఢిల్లీలో రాష్ట్ర శకటాన్ని ప్రదర్శించే అవకాశం దక్కింది. తొలిసారి 2015లో ‘బోనాలు’ థీమ్​తో రాష్ట్ర శకటం కర్తవ్యపథ్ (ఇప్పటి రాజ్ పథ్)పై మెరిసింది. 

తర్వాత సరిగ్గా ఐదేండ్లకు (2020)లో మరోసారి బతుకమ్మ, వేయి స్తంభాల గుడి, మేడారం సమక్క-సారక్క జాతర రూపకంతో శకటం ప్రదర్శించారు. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్న ప్రభుత్వం.. గత మూడేండ్లుగా అసలు డిజైన్లు కూడా పంపలేదని తెలిసింది. గతేడాది ఈ శకటాల ప్రదర్శనకు కూడా రామని రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాసింది. కాగా, 2016, 2017, 2018, 2019లో డిజైన్లు పంపినా... అవి మొక్కుబడిగా ఉండడంతో తొలిదశలోనే రిజెక్ట్ అయినట్టు అధికారులు చెప్తున్నారు.

ఈసారి 16 శకటాలు

ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో మొత్తం 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శకటాలను ప్రదర్శించేందుకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే, కేంద్ర శాఖలు, రక్షణ విభాగానికి చెందిన మరిన్ని శకటాలు ప్రదర్శించబోతున్నట్టు తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌‌‌‌గఢ్, హర్యానా, లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, ఒరిస్సా ఉన్నాయి. కాగా, ఈ సారి కూడా ‘నారీ శక్తి’ని ప్రోత్సహించడానికి కవాతులో మెజారిటీ మహిళలు పాల్గొంటారని అధికారులు తెలిపారు. సైన్యంలో తక్కువ మంది మహిళా సిబ్బంది ఉన్నప్పటికీ, గణతంత్ర దినోత్సవ పరేడ్‌‌‌‌ కవాతులో 75 శాతం మంది మహిళలే పాల్గొంటారని తెలిపారు.