నమ్మబలికి.. నట్టేట  ముంచిండు..ఉద్యమ ఆకాంక్షలకు కేసీఆర్ పాతర

నమ్మబలికి.. నట్టేట  ముంచిండు..ఉద్యమ ఆకాంక్షలకు కేసీఆర్ పాతర

దశాబ్దాల పాటు ఆంధ్ర పాలకులు అన్ని రంగాల్లో మోసం చేశారని... సాగునీళ్లు, ఉద్యోగాలు.. నిధుల కేటాయింపులో ఇకెన్నాళ్లు ఈ వివక్ష అని తెలంగాణ ప్రజానీకం ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించింది. రాష్ట్రం సాధించుకుంటే మన నీళ్లు, నిధులు, ఉద్యోగాలు మనకే దక్కుతాయని.. ఇంటికొక ఉద్యోగం వస్తుందని ప్రజలు ఆకాంక్షించారు. పొట్టచేతపట్టుకొని బొంబాయికి, దుబాయికి వలసలు పోయే బాధలు తప్పుతాయని భావించారు. మూతపడ్డ ఫ్యాక్టరీలు, మిల్లులు తెరుచుకుంటే తెలంగాణ సుసంపన్నం అవుతుందని ఆశపడ్డారు. ప్రతిరంగంలో ఎలా మోసపోతున్నామో మేధావులు చెప్పిన మాటలు, కవులు, కళాకారుల ఆటపాటలు సబ్బండవర్గాల్లో ప్రత్యేక రాష్ట్ర కాంక్షలు రగిల్చాయి. దాదాపు 1200 మంది తెలంగాణ బిడ్డల బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఉద్యమం కాలంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేరుతానని నమ్మబలికిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వాటన్నింటికి పాతరేశారు. తన అధికారం, కుటుంబం కోసమే పనిచేస్తున్నారు.

పెరిగిన వలసలు 

గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం మందికి పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు ఏటికేడు పెరుగుతుండడంతో చిన్న, సన్న కారు, రైతులు అప్పుల పాలైతున్నారు. ఉన్న కొద్దిపాటి భూములు అమ్ముకొని ముంబై, సూరత్, బెంగళూరు తదితర నగరాలకు వలస పోతున్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో నాటి నుండి నేటి వరకు వలసలు ఆగింది లేదు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఈ వలసలు ఏమాత్రం తగ్గకపోగా మరికొంత పెరిగాయి. మంత్రి నిరంజన్ రెడ్డి 2018 ఎన్నికల సమయంలో ముంబైలోని తెలంగాణ ప్రజలు ఉండే ప్రాంతానికి వెళ్లిఎన్నికల ప్రచారం చేశాడంటే వలసల తీవ్రత అర్థమవుతుంది. మరోవైపు అరబ్ దేశాలకు రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. మోసపూరిత ట్రావెల్ ఏజెంట్లు ఒక్కొక్కరి వద్ద లక్షల రూపాయలు తీసుకుంటూ వర్క్ వీసా అని చెప్పి టూరిస్ట్ వీసాపై పంపి మోసం చేస్తున్నారు. గత ఆరేండ్లలో విదేశీ వ్యవహారాల శాఖకు ఇలాంటి మోసాలపై 35 వేల ఫిర్యాదులు వచ్చాయంటే వలసలు ఎంత పెద్ద ఎత్తున్న ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అరబ్​దేశాల్లో ఉన్న తెలంగాణ వారి రక్షణ కొరకు 2018 ఎన్నిల ముందు కేసీఆర్​ పలు హామీలు ఇచ్చారు. గల్ఫ్​ కార్మికుల కోసం కేరళ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు.  గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు రూ.100 కోట్లు కేటాయించినా.. ఇప్పటివరకు వాటి నుంచి ఒక్క పైసా ఖర్చు చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం కార్మికులు, కూలీలు, యువతలో నైపుణ్యాలు పెంచి ఉపాధి చూపించడంలో విఫలమైంది. వలసలు తగ్గాలంటే స్వరాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచాల్సిన అవసరం ఉంది.

నిరుద్యోగభృతి ఏమైంది?

తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగం వస్తుందని కేసీఆర్ చేసిన ప్రకటనలు నీటిపై రాతలుగా మారాయి. 2023 మే నెల వరకు రాష్ట్రంలో 37 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లుగా అధికార లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఈ తొమ్మిదేండ్ల కాలంలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. కానీ వాస్తవానికి అందులో సగానికి మించి  ఉద్యోగాలు ఇవ్వలేదని గణంకాలు చెబుతున్నాయి. 2014 నుంచి నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. నోటిఫికేష్లు రావేమో అనే నిరాశతో దాదాపు 100 మందికి పైగా ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. 2018 ఎన్నికల సందర్భంగా ప్రకటించిన నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి కూడా కేసీఆర్ మరిచిపోయారు. ఇన్ని రకాలుగా మోసపోయిన నిరుద్యోగులు దశాబ్ద ఉత్సవాల్లో ఏమని పాల్గొంటారు.

చేయాల్సినవి ఎన్నో..

పేదలకు డబుల్​ బెడ్రూల్​ ఇండ్లు ఇవ్వడం లేదు. కనీసం ఇంటి జాగాలు కూడా ఇవ్వడం లేదు. నిలువ నీడ లేని వారు ఎక్కడైనా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటే పోలీసు నిర్బంధాల మధ్య బుల్​డోజర్లు పెట్టి మరీ కూల్చేస్తున్నారు. పోడు పట్టాలపై గిరిజనులను ఏండ్లుగా మోసం చేస్తున్నారు. సగం భూములకు మాత్రమే పోడు పట్టాలు ఇస్తామంటున్నారు. అర్హులైన అందరికీ పోడు పట్టాలు ఇవ్వాలె. అలాగే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలె.. తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రులను బాగు చేసి వైద్య సౌకర్యాలను మెరుగుపరచాలె. రైతుబంధను ఐదు ఎకరాలకే పరిమితం చేయాలె. రైతులకు అన్ని రకాల విత్తనాలను రైతులకు ఉచితంగా లేదంటే సబ్సిడీపై ఇవ్వాలి. ఎరువులు, పురుగుమందులు కూడా 40  శాతం సబ్సిడీపై అందజేయాలి. గ్రామ పంచాయతీ లకు పెండింగ్ పెట్టిన నిధులు వెంటనే రిలీజ్ చేయాలి. అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్​లు బిల్లు రాకా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది సర్పంచ్​లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. తెలంగాణకు దళితుడే మొదటి ముఖ్యమంత్రిగా ఉంటాడని ప్రకటించి.. దాన్ని మరుగుపరచడానికి దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని ఆర్భాటంగా ప్రకటించారు. ఆ హామీని అమలు చేయకుండా దళితుల్ని మోసం చేశారు. రైతుబంధు, ఆసరా పెన్షన్లు. రైతు బీమా తదితర సంక్షేమ పథకాలకు రూ.25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న అని గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే రాష్ట్ర బడ్జెట్ లో చూపిన ఆదాయంలో 20 శాతం మద్యం ద్వారానే వస్తున్నది. పేదల సంసారాలను నాశనం చేసి తద్వారా వచ్చిన డబ్బులనే సంక్షేమ పథకాలు ఖర్చు పెడుతున్నారు. ఇది నేటి తెలంగాణ స్థితి.

ఉద్యమద్రోహులకు అందలం

ఉద్యమాన్ని అణిచివేయాలనుకున్న వారు, ఉద్యమకారులపై దాడులకు పాల్పడ్డ వారు రాష్ట్రం వచ్చాక పదవులు పొందరారు. రాష్ట్ర సాధన కొరకు అమరులైన కుటుంబాలు నిరాదరణకు గురయ్యాయి. లాఠీ దెబ్బలు తిన్నవారు తెలంగాణ దశాబ్ద ఉత్సవాల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టబెడుతున్నారు. ఆంధ్రా కార్పొరేట్​విద్యాసంస్థలు ఇష్టారీతిని దోచుకుంటున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవు. ఉద్యమ సమయంలో చెప్పిన మాటలకు పూర్తి వ్యతిరేకంగా పాలన సాగుతున్నది.
- వి. ప్రభాకర్
తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం