
- సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ తో పోలిస్తే అధికం
- లీటర్ పెట్రోల్ పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూ.19.90.. స్టేట్ వ్యాట్ రూ.27.63
హైదరాబాద్, వెలుగు : పెట్రోల్, డీజిల్ రేట్లలో కేంద్రం వసూలు చేస్తున్న ఎక్సైజ్ డ్యూటీ కన్నా రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న వ్యాట్ ఎక్కువని తేలింది. ఎక్సైజ్ సుంకంతో పోలిస్తే పెట్రోల్‌పై రూ.7.5, డీజిల్‌పై రూ.4.50 అధికంగా వ్యాట్‌ను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ రేట్లకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆర్టీఐ ద్వారా చేసుకున్న దరఖాస్తుకు.. రెండ్రోజుల కింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిప్లై ఇచ్చింది. దాని ప్రకారం.. లీటర్ పెట్రోల్ బేస్ ప్రైస్ రూ.58.58 కాగా, కేంద్రం వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకం రూ.19.90గా ఉంది. ఎక్సైజ్ డ్యూటీతో కలిపి పెట్రోల్ధర రూ.78.48 కాగా, దానిపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ రూ.27.63గా ఉంది.
దీనికి తోడు డీలర్ కమీషన్ రూ.3.55 కాగా.. మొత్తంగా లీటర్ పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. ఇక లీటర్ డీజిల్ బేస్ ప్రైస్ రూ.59.45 కాగా.. ఎక్సైజ్ డ్యూటీ రూ.15.8గా ఉంది. ఎక్సైజ్ డ్యూటీతో కలిపి డీజిల్ ధర రూ.75.25గా ఉండగా, దానిపై రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న వ్యాట్‌రూ.20.32గా ఉంది. డీలర్ కమీషన్ రూ.2.25 కలిపి.. లీటర్ డీజిల్ రూ.97.81కి లభ్యమవుతున్నది.
అన్ని రాష్ట్రాలూ తగ్గించినా..
గతంలో పెట్రోల్ ధరలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. పెట్రోల్‌పై రూ.13, డీజిల్‌పై రూ.16 వరకు తగ్గించింది. రాష్ట్రాలూ తగ్గించుకోవాలని కేంద్రం సూచించింది. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు రూ.5 నుంచి రూ.10 వరకు వ్యాట్‌ను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాయి. మన రాష్ట్రంలో మాత్రం తగ్గించలేదు.
ఇటు ఏపీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ ధరలు తగ్గలేదు. దీంతో తెలంగాణ సహా వ్యాట్‌ను తగ్గించుకోని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్రేట్లు ఎక్కువగా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. ఆ తర్వాత రెండో స్థానంలో తెలంగాణ ఉండడం గమనార్హం.