రాష్ట్ర సర్కారు నిర్ణయం..ఇక అన్ని ఫ్యాక్టరీల్లో తనిఖీలు

రాష్ట్ర సర్కారు నిర్ణయం..ఇక అన్ని ఫ్యాక్టరీల్లో తనిఖీలు
  • రాష్ట్ర సర్కారు నిర్ణయం.. రెండు నెలలకోసారి చేసేలా యాక్షన్ ప్లాన్
  • జాగ్రత్తలు, నిబంధనలపై కఠినంగా వ్యవహరించాలని డిసైడ్​

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో ఇటీవలి కాలంలో జరుగుతున్న పారిశ్రామిక ప్రమాదాలు, ముఖ్యంగా ఫ్యాక్టరీల్లో పేలుళ్లు సంభవించిన నేపథ్యంలో ఇండస్ట్రియల్​సేఫ్టీపై రాష్ట్ర సర్కారు సీరియస్‌గా దృష్టి సారించింది. పదుల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోతుండటంతో.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగ కుండా అడ్డుకట్ట వేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. 

ఇందులో భాగంగా ఇకపై అన్ని పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో తప్పనిసరిగా సాంకేతిక తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రమాదాలను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా నిబంధనలపై  ఎలాంటి రాజీ పడకూడదని ప్రభుత్వం భావిస్తున్నది. భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. 

ప్రతి ఘటనపై సమగ్ర దర్యాప్తు

రాష్ట్రంలో గత కొన్నేండ్లుగా పారిశ్రామిక ప్రమాదాలు ఆందోళనకరంగా పెరిగాయి. ముఖ్యంగా రియాక్టర్ పేలుళ్లు, రసాయన లీకేజీలు, షార్ట్ సర్క్యూట్లు  తరచుగా సంభవిస్తున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌లో సంభవించిన భారీ పేలుడులో 36 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం అలర్ట్​ అయింది. అంతకు ముందు బొల్లారం, జీడిమెట్ల, పటాన్‌‌‌‌చెరు వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా అనేక ప్రమాదాలు జరిగాయి. ఈ వరుస ఘటనలు పారిశ్రామిక భద్రతకు సంబంధించిన లోపాలను స్పష్టం చేశాయి.  

గత 30 నెలల్లో కనీసం 10 ప్రధాన పారిశ్రామిక ప్రమాదాలు (రియాక్టర్ డ్రైయర్ పేలుళ్లతో సహా) జరగగా,  వీటిలో సుమారు 25 మంది మరణించారు. 70 మందికి పైగా గాయపడ్డారు. ప్రభుత్వం సిగాచీ ఫ్యాక్టరీ పేలుడుతోపాటు ఈ ప్రమాదాలను సీరియస్‌‌‌‌గా పరిగణించి, ప్రతి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించింది.

ప్రమాదాలకు గల కారణాలను గుర్తించి, మళ్లీ పునరావృతం కాకుండా దీర్ఘకాలిక చర్యలను సూచించేందుకు నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. కార్మికులకు మెరుగైన భద్రతా శిక్షణ, ఆధునిక భద్రతా పరికరాల వాడకం,  ప్రమాదాల సమాచారం త్వరగా సంబంధిత అధికారులకు చేరేలా ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

కఠినమైన యాక్షన్​ప్లాన్​

ఫ్యాక్టరీలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తుంటే.. లైసెన్సుల రద్దు, జరిమానాలు విధించడం,  బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం వంటి కఠిన చర్యలకు వెనకాడొద్దని  ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రంలోని అన్ని పారిశ్రామిక యూనిట్లలో, ముఖ్యంగా హై-రిస్క్ కేటగిరీ కిందకు వచ్చే ఫార్మాస్యూటికల్స్, కెమికల్ ఫ్యాక్టరీల్లో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షిం చడానికి ఒక కఠినమైన యాక్షన్ ప్లాన్‌‌‌‌ను ప్రభుత్వం రూపొందిస్తున్నది. 

దీని ప్రకారం.. ప్రతి రెండు నెలలకోసారి పారిశ్రామిక యూనిట్లలో సమగ్ర సాంకేతిక తనిఖీలు నిర్వహిస్తారు. ఈ తనిఖీలను ఫ్యాక్టరీల డైరెక్టరేట్, కాలుష్య నియంత్రణ మండలి  ఇతర సంబంధిత విభాగాల సమన్వయంతో నిర్వహించాలని నిర్ణయించారు.