తెలంగాణ అప్పులు 6 లక్షల 71 వేల కోట్లు.. ఒక్కొక్కరిపై 2 లక్షలు బాకీ

తెలంగాణ అప్పులు  6 లక్షల 71 వేల కోట్లు.. ఒక్కొక్కరిపై 2 లక్షలు బాకీ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన బీఆర్ఎస్.. ప్రజలపై భారీగా అప్పుల భారం మోపిందని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ ఏర్పడే నాటికి రూ.72,658 కోట్ల అప్పు ఉంటే.. ఇప్పుడది రూ.6,71,757 కోట్లకు చేరిందని వెల్లడించింది. అంటే రాష్ట్రంలో ఒక్కొక్కరిపై దాదాపు రూ.1.91 లక్షల అప్పు భారం పడుతోందని పేర్కొంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం బుధవారం వైట్ పేపర్ రిలీజ్ చేసింది. దీన్ని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 42 పేజీలున్న ఈ రిపోర్టులో రాష్ట్ర అప్పులు, లోన్ల రీపేమెంట్స్, వడ్డీలు, బకాయిలు తదితర వివరాలను పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారం తెలంగాణ ఏర్పడే నాటికి బడ్జెట్‌‌, బడ్జెటేతర (కార్పొరేషన్ల) అప్పులన్నీ కలిపి రూ.72,658 కోట్లు ఉంటే, ఇప్పుడది దాదాపు పది రెట్లు పెరిగింది. ఇందులో ఎఫ్ఆర్​బీఎం పరిధిలో తీసుకున్నవి రూ.3లక్షల 89వేల 673కోట్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీలు, నాన్​గ్యారంటీలతో తీసుకున్న అప్పులు కూడా దాదాపు అంతే మొత్తంలో ఉన్నాయి. గ్యారంటీలతో వివిధ కార్పొరేషన్లు, ఇనిస్టిట్యూషన్ల (స్పెషల్​పర్పస్​వెహికల్) కింద రూ.2లక్షల 22వేల 670 కోట్లు.. నాన్​గ్యారంటీ కింద రూ.59వేల 414 కోట్ల అప్పులను గత ప్రభుత్వం చేసింది.  

ప్రాజెక్టుల పూర్తికి 97 వేల కోట్లు కావాలె.. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో 24 డిపార్ట్​మెంట్లకు సంబంధించి వివిధ పనులకు అగ్రిమెంట్లు చేసుకున్నది. వీటి మొత్తం విలువ రూ.3.49 లక్షల కోట్లు కాగా, ఇందులో ఈ నెల మొదటి వారం వరకు లక్షా 89 వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ పనులన్నీ ఇప్పుడు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవన్నీ పూర్తి కావాలంటే ఇంకా లక్షా 59 వేల 940 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. క్యాపిటల్ ఎక్స్​పెండిచర్​తో పాటు ఇతర పనులు ఇందులో ఉన్నట్టు వైట్ పేపర్ లో వెల్లడించారు. కొంత అప్పు తీసుకుని, మరికొంత బడ్జెట్​లో కేటాయించి పెండింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించే రూ.97,562 కోట్లు, పంచాయతీరాజ్​ అండ్​ రూరల్​ డెవలప్​మెంట్​ కింద చేపట్టిన వివిధ పనులకు రూ.36,208 కోట్లు ఇవ్వాల్సి ఉందని వెల్లడించారు.  

గత బీఆర్ఎస్ ​ప్రభుత్వం కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు పెండింగ్​లో పెట్టిందని వైట్ పేపర్ లో పేర్కొన్నారు. కాంట్రాక్టర్లతో పాటు ఉద్యోగులు, ఇతరులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా భారీగా పేరుకుపోయాయి. ఈ నెల 19 నాటికి 4,78,168 బిల్లులకు సంబంధించి రూ.40,154 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ కొన్నేండ్లుగా పెండింగ్​బిల్లుల కింద మూలుగుతున్నాయి.

అధిక వడ్డీలకు అప్పులు.. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్యారంటీ కింద 95 శాతం అప్పులు తీసుకున్న కార్పొరేషన్లు ఐదు ఉన్నాయి. ఈ అప్పులకు చెల్లిస్తున్న వడ్డీ తడిసిమోపెడు అవుతున్నది. బహిరంగ మార్కెట్​లో తీసుకునే అప్పుకు యావరేజ్​వడ్డీ రేటు 5.63 శాతం ఉంటే, ఈ కార్పొరేషన్ల కింద తీసుకున్న అప్పులకు చెల్లించే వడ్డీ 8.93 శాతం నుంచి 10.49 శాతం వరకు ఉన్నది. ఈ ఐదింటిలో కాళేశ్వరం ఇరిగేషన్​ప్రాజెక్ట్​కార్పొరేషన్, తెలంగాణ డ్రింకింగ్​వాటర్​సప్లై కార్పొరేషన్, తెలంగాణ స్టేట్​వాటర్​రీసోర్సెస్​ఇన్​ఫ్రాస్ట్రక్చర్​డెవలప్​మెంట్​కార్పొరేషన్, తెలంగాణ స్టేట్​ హౌసింగ్ కార్పొరేషన్, తెలంగాణ స్టేట్​రోడ్​డెవలప్​మెంట్​కార్పొరేషన్ ఉన్నాయి. 

మిగిలింది 31 శాతం నిధులే.. 

అప్పులు, ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం ఖర్చు చేయడానికి కేవలం 31శాతం నిధులే ఉన్నాయని తేలింది. మొత్తం ఆర్థిక వనరుల్లో 34శాతం మేర పాత అప్పుల రీపేమెంట్, వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని.. మరో 35శాతం మేర ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పింఛన్లకు చెల్లించాల్సి వస్తున్నదని ప్రభుత్వం వైట్ పేపర్ లో వెల్లడించింది. ఈ రెండూ ప్రతినెలా ‘తప్పనిసరి’ జాబితాలో ఉన్నందున నివారించడానికే వీల్లేదని పేర్కొంది. ఇక మిగిలిన 31శాతం నిధుల్లో నుంచే వెల్ఫేర్ స్కీమ్స్ అమలు, రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉందని తెలిపింది.  

కేటాయింపులు, ఖర్చులకు మధ్య భారీ తేడా.. 

రాష్ట్రంలో గత పదేండ్లుగా పెట్టిన బడ్జెట్​కు, చేసిన ఖర్చుకు మధ్య సగటున 20 శాతం తేడా ఉంది. ఇతర రాష్ట్రాలతో చూసినా, ఉమ్మడి ఏపీ నాటి ఖర్చులను పరిగణనలోకి తీసుకున్నా ఇది చాలా ఎక్కువని వైట్ పేపర్ లో ప్రభుత్వం పేర్కొంది. దీని ఫలితంగానే వేలాది కోట్లలో బిల్లులు పేరుకుపోయాయని తెలిపింది. దళితబంధుతో పాటు ఇతర ప్రధాన సంక్షేమ పథకాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ఉద్దేశించిన బడ్జెట్​అంచనాలకు చేసిన ఖర్చుకు భారీ వ్యత్యాసం ఉందని వైట్ పేపర్ లో తేలింది. ఈ పదేండ్లలో రూ.17 లక్షల 78 వేల 230 కోట్ల బడ్జెట్​కేటాయింపులు చేస్తే... ఇందులో రూ.13 లక్షల 72 వేల 985 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే ఈ రెండింటి మధ్య రూ.4.05 లక్షల కోట్ల వ్యత్యాసం ఉంది.

మాజీ సభ్యుల మృతికి అసెంబ్లీ సంతాపం

ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు రామన్నగారి శ్రీనివాస్​రెడ్డి (రామాయంపేట), కొప్పుల హరీశ్వర్​రెడ్డి (పరిగి), కుంజ సత్యవతి (భద్రాచలం)లకు అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. బుధవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్​స్పీకర్​ చైర్​నుంచి వారి మృతికి సంతాపం తెలిపారు.  ఆ తర్వాత అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభ పక్షనేతగా అక్బరుద్దీన్, సీపీఐ పక్షనేతగా కూనంనేని సాంబశివరావును గుర్తిస్తున్నట్టు స్పీకర్​గడ్డం ప్రసాద్ ​కుమార్​ ప్రకటించారు.

జీఎస్​డీపీలో36.9 శాతం అప్పులే.. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అప్పులతో రాష్ట్ర ప్రజలపై తలసరి అప్పు భారం పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,50,03,674 కాగా... రాష్ట్ర అప్పులు రూ.6.71 లక్షల కోట్లు. అంటే రాష్ట్రంలో ఒక్కొక్కరిపై ఉన్న అప్పు రూ.1.91 లక్షలకు చేరుకుంది. రాష్ట్ర అప్పులు జీఎస్‌‌‌‌డీపీలో 36.9 శాతానికి చేరుకున్నాయని వైట్ పేపర్ లో పేర్కొన్నారు. బడ్జెట్‌‌‌‌లో పేర్కొన్న అప్పుల భారం రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో 15.7 శాతం ఉంటే, ఎనిమిదేండ్ల తర్వాత 27.8 శాతానికి చేరుకున్నది. ఎఫ్ఆర్‌‌‌‌బీఎం నిబంధనల ప్రకారం అది 25శాతం దాటకూడదు. బడ్జెట్‌‌‌‌తో సంబంధం లేకుండా కార్పొరేషన్ల (స్పెషల్ పర్పస్ వెహికల్) పేరుతో తీసుకున్న అప్పులను కూడా కలిపితే ఇది 36.9 శాతానికి చేరుకున్నది.

విద్య, వైద్యాన్ని పట్టించుకోలే..  

పదేండ్లలో విద్య, వైద్యారోగ్య రంగాలకు గత ప్రభుత్వం చేసిన బడ్జెట్ ​కేటాయింపులు అధ్వానంగా ఉన్నాయని వైట్ పేపర్ లో వెల్లడైంది. వివిధ రాష్ట్రాలు తమ బడ్జెట్ లో కనీసం 14.7% విద్యా రంగానికి ఖర్చు చేయాలని 2023–24 ఆర్థిక సంవత్సరంలో అంచనా వేస్తే, తెలంగాణ మాత్రం 7.6 % మాత్రమే ఖర్చు చేసింది. జాతీయ సగటుతో చూస్తే ఇది సగం మాత్రమే. ఈ విషయంలో రాష్ట్రం అట్టడుగున ఉన్నది. వైద్యారోగ్య రంగానికి చేస్తున్న ఖర్చులోనూ తెలంగాణ చివరి నుంచి నాలుగో స్థానంలో ఉంది. మొత్తం బడ్జెట్​లో కేవలం 5% మాత్రమే వైద్యారోగ్యానికి ఖర్చు చేయాలని బడ్జెట్ లో పెట్టారు. ఇది జాతీయ స్థాయి సగటుతో చూస్తే 1.2 శాతం తక్కువ.