
- కమిషన్ పై ఒత్తిడి పెరగడంతో మళ్లీ స్కూల్ ఎడ్యుకేషన్కే బాధ్యతలు
- త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వచ్చే చాన్స్
- త్వరలోనే 9,370 పోస్టులకు ఫైనాన్స్ క్లియరెన్స్
హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను మళ్లీ పాత విధానంలోనే భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో టీఎస్పీఎస్సీ ద్వారా ఆ పోస్టులను నింపగా, ఈసారి తిరిగి స్కూల్ ఎడ్యుకేషన్ కే ఆ బాధ్యతలు అప్పగించాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే ఫైనాన్స్డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వనుందని, ఆ తర్వాత దీనిపై స్పష్టత రానున్నదని అధికారులు చెప్తున్నారు. గతంలో టీచర్ పోస్టులను డిస్ర్టిక్ట్ సెలెక్షన్ కమిటీ(డీఎస్సీ) ద్వారా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చి, రిక్రూట్మెంట్ చేసేవారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత 2017లో టీచర్ పోస్టులను డీఎస్సీ స్థానంలో టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టారు. అప్పట్లో 8,792 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా, ఇప్పటికీ ఆ పోస్టులు పూర్తిస్థాయిలో భర్తీ కాలేదు. టీఎస్పీఎస్సీ ప్రస్తుతం గ్రూప్స్ తోపాటు పలు పోస్టులను భర్తీ చేసే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికే పలు పరీక్షలు నిర్వహించింది. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 తో పాటు పలు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టడం టీఎస్పీఎస్సీకి భారంగా మారే అవకాశముంది. దీనికితోడు కమిషన్లోనూ సరిపడ సిబ్బంది లేకపోవడంతో టీఎస్పీఎస్సీ కూడా వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. దీంతో ఈసారి స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారానే సర్కారు స్కూళ్లతో పాటు మోడల్ స్కూళ్లలోని ఖాళీ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
9,370 పోస్టుల భర్తీకి చర్యలు
33 జిల్లాల పరిధిలో మొత్తం 9,370 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని సర్కారు భావిస్తోంది. దీంట్లో ఎస్జీటీ పోస్టులు 6,360 ఉండగా, ఎస్ఏ 2,179, పండిట్ పోస్టులు 669, పీఈటీ పోస్టులు162 ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో ఎక్కువగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. టీచర్ పోస్టుల భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వగానే, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కొత్త జిల్లాల వారిగా పోస్టుల రోస్టర్ డీటెయిల్స్ సేకరించనున్నారు. ఆ తర్వాత సర్కారు అనుమతితో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. మోడల్ స్కూళ్లలోనూ 1000 వరకూ టీజీటీ, పీజీటీ పోస్టులను భర్తీ చేసే చాన్స్ ఉంది. చాలా జిల్లాల్లో క్వాలిఫైడ్ డీఈవోలు లేరు. దీంతో టీచర్ పోస్టులను ఎలా భర్తీ చేయాలనే దానిపై స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల్లోనూ ఆందోళన నెలకొన్నది.