తెలంగాణ జాబ్స్ స్పెషల్

తెలంగాణ జాబ్స్ స్పెషల్

తెలంగాణలో జరుగుతున్న పోటీ పరీక్షల సిలబస్​లో రాష్ట్ర అంశాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ అంశంలో పట్టు సాధించడం ద్వారా అత్యధిక మార్కులు పొందవచ్చు. నిజాం కాలం నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు కృషి చేసిన వైతాళికుల గురించి తెలుసుకుందాం.

రాజా బహద్దూర్​ వెంకటరామిరెడ్డి
ఈయన బహుభాషా కోవిదుడు. 1886లో ముదిగల్​ ఠాణాలో అమీన్​(ఎస్​ఐ)గా ఉద్యోగాన్ని పొందాడు. నిజాం ప్రభువు వెంకటరామిరెడ్డిని కొత్వాల్​గా నియమించింది.  1921లో వెంకటరామిరెడ్డికి రాజా బహద్దూర్​ అనే గౌరవ బిరుదును నిజాం తన జన్మదినం సందర్భంగా బహూకరించాడు. 1931లో వెంకటరామిరెడ్డికి ఆర్డర్​ ఆఫ్​ ది బ్రిటిష్​ ఎంపైర్​ అనే గౌరవ అవార్డును బ్రిటిష్​ ప్రభుత్వం అందజేసింది. ఈయన రెడ్డి హాస్టల్​ను హైదరాబాద్​లో స్థాపించి గౌరవ కార్యదర్శిగా పనిచేశారు. గోల్కొండ పత్రిక స్థాపనకు ముఖ్య కారకుడు వెంకటరామిరెడ్డి. 

మీర్​ నవాబ్​ అలీ నవాజ్​ జంగ్​ 
ఈయన 1896లో ఇంగ్లండ్​లోని ప్రముఖ కూపర్స్​హిల్​ కాలేజీలో నిజాం ప్రభుత్వ స్కాలర్​షిప్​తో ఇంజనీరింగ్​ను పూర్తిచేశారు. ఆ తర్వాత పబ్లిక్​ వర్క్స్ డిపార్ట్​మెంట్​లో అసిస్టెంట్​ ఇంజనీర్​గా పనిచేశారు. 1913లో పీడబ్ల్యూడీ, టెలిఫోన్​ డిపార్ట్​మెంట్లకు కార్యదర్శిగా పనిచేశారు. 1918 నాటికి ఈయన చీఫ్​ ఇంజనీర్​, సెక్రటరీ స్థాయికి ఎదిగాడు. నవాజ్​ జంగ్​ ఆధ్వర్యంలో  ఉస్మాన్​ సాగర్​, హిమాయత్​ సాగర్​, నిజాం సాగర్​, ఫతే సాగర్​, పాలేరు, వైరా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయింది. ఉస్మానియా ఆర్ట్స్​ కాలేజ్​, ఉస్మానియా జనరల్​ హాస్పిటల్​, ఢిల్లీలో హైదరాబాద్​ హౌస్​ భవనాలను ​ నిర్మించారు. నిజామాబాద్​లోని ఆనకట్టకు ఇతని పేరు మీదుగా అలీసాగర్​గా నామకరణం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నవాజ్​ జంగ్​ జన్మదినమైన జులై 11న తెలంగాణ ఇంజనీర్స్​ డేగా ప్రకటించింది. 

మాడపాటి హన్మంతరావు 
ఆంధ్రాలో పుట్టినప్పటికి మాడపాటి హన్మంతరావు జీవితం మొత్తం తెలంగాణ సేవకే అంకితమిచ్చారు. ఈయన తెలంగాణ సాంస్కృతిక వికాసానికి ఆద్యులు. 1923లో నిజాం రాష్ట్రాంధ్ర జన కేంద్ర సంఘాన్ని హన్మకొండలో స్థాపించి  దాని ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. హన్మంతరావు గ్రంథాలయోద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఈయన ఆంధ్రమహాసభను రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక ఉద్యమంగా నడిపించడానికి కృషి చేశారు. ఆంధ్ర మహిళా సభను స్థాపించి మహిళల్లో చైతన్య భావాలను పెంపొందించాడు. 1951–54 మధ్య హైదరాబాద్​ నగర ప్రథమ మేయర్​గా పనిచేశాడు. మాతృభాషలో బాలికలకు విద్య నేర్పించడానికి నారాయణగూడలో మాడపాటి హన్మంతరావు బాలికల పాఠశాలను స్థాపించారు. ఆయన రచనలు హృదయ శల్యము, వెట్టిచాకిరి, గ్రంథాలయాలు, నిజాం రాష్ట్రంలో రాజ్యాంగ సంస్కరణలు.

సరోజిని నాయుడు 
ఈమెను భారత కోకిల అని పిలిచేవారు. సరోజిని నాయుడును ఎడ్వర్డ్​ గొస్సె, ఆర్ధర్​ సైమన్​, తోరుదత్​ వంటి కవియిత్రులతో పోల్చారు. 1898లో ఇంగ్లండ్​ నుంచి హైదరాబాద్​ రాగానే గోవిందరాజుల నాయుడును వివాహం చేసుకున్నారు. 1916లో లక్నోలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యారు. 1918లో కంజీవరంలో జరిగిన రాష్ట్ర కాంగ్రెస్​ సమావేశానికి అధ్యక్షత వహించారు. 1919లో హోంరూల్​ రాయబారిగా ఇంగ్లండ్​కు వెళ్లారు. 1925లో కాన్పూర్​లో జరిగిన సమావేశంలో జాతీయ కాంగ్రెస్​ అధ్యక్షురాలిగా వ్యవహరించి తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలిగా గుర్తింపు పొందారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని దర్శనకొటారులపై దాడి చేశారు. 1931లో లండన్​లో జరిగిన రెండో రౌండ్​ టేబుల్​ సమావేశంలో మహిళా ప్రతినిధిగా పాల్గొని ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటును వ్యతిరేకించారు. ఈమె రచనలు సరస్సు సుందరి, ది గోల్డెన్​ త్రిషోల్డ్​, ది బ్రోకెన్​ వింగ్​, ది బర్డ్​ ఆఫ్​ టైమ్​. 

కొండా వెంకట రంగారెడ్డి 
ఈయన మొదట విశాలాంధ్రకు అనుకూలంగా పనిచేసినా ఆ తర్వాత కాలంలో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేశారు. ఈయన 1923లో నాంపల్లిలో వేమనాంధ్ర భాషా నిలయాన్ని తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేశాడు. నిజాం రాష్ట్ర జనసంఘం ప్రథమ సమావేశానికి అధ్యక్షత వహించారు. 1936లో షాద్​నగర్​లో జరిగిన ఐదో ఆంధ్రమహాసభకు 1943లో హైదరాబాద్​లో జరిగిన ఏడో మహాసభకు అధ్యక్షత వహించారు. ఈయన 1952–56 వరకు బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. 1959లో నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూమంత్రిగా ఆ తర్వాత దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

బూర్గుల రామకృష్ణారావు
ఈయన ఇంటిపేరు పుల్లమరాజు. రామకృష్ణారావు స్వగ్రామమైన  బూర్గుల పేరుమీదుగా బూర్గుల రామకృష్ణారావుగా పేరుగాంచారు. 1931లో దేవరకొండలో జరిగిన నిజామాంధ్ర  మహాసభకు అధ్యక్షత వహించారు. హైదరాబాద్​ స్టేట్​ కాంగ్రెస్​ సభ్యుల్లో ఒకరు. 1942 క్విట్​ ఇండియా, గ్రంథాలయ ఉద్యమాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్​ రాష్ట్రాన్ని  భారత యూనియన్​లో కలపాడానికి చేపట్టిన జాయిన్​ ఇండియా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. 1948లో హైదరాబాద్​ భారత్​లో విలీనమైన తర్వాత వచ్చిన వెల్లోడి ప్రభుత్వంలో రెవెన్యూ, విద్యా మంత్రిగా పనిచేశారు. 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో షాద్​నగర్​ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1952–56 మధ్య హైదరాబాద్​ రాష్ట్ర తొలి, చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు.  

సురవరం ప్రతాపరెడ్డి 
తెలంగాణ తొలితరం వైతాళికులు, బహుముఖ ప్రజ్ఞాశాలుల్లో అగ్రగణ్యుడు సురవరం ప్రతాపరెడ్డి. ఈయన సంస్కృతాంధ్ర భాషలో ప్రావీణ్యం పొందాడు. దేశ సేవ, ప్రజల సర్వతోముఖాభివృద్ధి, సంఘ సంస్కరణ, మాతృభాషా వికాసం అనే ఉన్నత లక్ష్యాలతో 1926 మే 10న గోల్కొండ పత్రికను స్థాపించారు. ఈయన గ్రంథాలయోద్యమానికి చేయూతనిచ్చాడు. ఈయన ప్రోత్సాహంతో క్యాతూరు, సూర్యాపేట, జన్​గాంల్లో గ్రంథాలయ సభలు జరిగాయి. 1942లో ఆంధ్ర గ్రంథాలయ మహాసభ, 1943లో ఖమ్మంలో జరిగిన గ్రంథాలయ మహాసభకు అధ్యక్షత వహించాడు. తెలంగాణలో కవులు పూజ్యం అని ఆంధ్ర పండితుడు ముడుంబయి వెంకటరాఘవాచార్యులు ఎగతాళి చేస్తే దానికి దీటుగా 300 మంది కవుల రచనలతో గోల్కొండ కవుల సంచిక పేరుతో ప్రచురించి తెలంగాణలో కవులు పూజ్యం కాదని పూజ్యులని పేర్కొన్నాడు. 1930 మెదక్​ జిల్లా జోగిపేటలో జరిగిన నిజాం ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించి సభ తెలుగులోనే జరగాలని తీర్మానం చేశారు. 1951లో ప్రజావాణి పత్రికను ప్రారంభించాడు. 1952లో వనపర్తి నుంచి కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యాడు. వివేక వర్ధిని పరిషత్​ను ఏర్పాటు చేసి తెలుగు భాషా సాహిత్యానికి ఎనలేని కృషిచేశాడు. రచనలు: ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హైందవ ధర్మవీరులు, హిందువుల పండుగలు, భక్త తుకారం, గ్రంథాలయోద్యమం. 

మందముల నర్సింగరావు
ఈయన 1927లో రయ్యత్​ పత్రికను స్థాపించారు. ఇది ఉర్దూ వార్తా పత్రిక. 1941లో రయ్యత్​ దిన పత్రికగా మారింది. ఈ పత్రిక నిజాంకు వ్యతిరేక వార్తలు రాయడంతో నిజాం ప్రభుత్వం రయ్యత్​ పత్రికను నిషేధించింది. 1937లో నిజామాబాద్​లో జరిగిన ఆరో నిజాం ఆంధ్రమహాసభకు నరసింగరావు అధ్యక్షత వహించాడు. 1938–42 మధ్యకాలంలో నిజాం లెజిస్లేటివ్​ కౌన్సిల్​ సభ్యుడిగా పనిచేశారు. 1952లో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ పార్టీ తరఫున హైదరాబాద్​ శాసనసభకు ఎన్నికయ్యారు. హైదరాబాద్​ రాష్ట్ర రచయితల సంఘం మొదటి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇతని స్వీయచరిత్ర 50 ఇయర్స్​ ఆఫ్​ హైదరాబాద్.