Telangana Tour : పాలరావుగుట్ట.. రాబందుల అడ్డా.. దేశంలోనే ఇప్పుడు ఇక్కడే ఎక్కువ..!

Telangana Tour : పాలరావుగుట్ట.. రాబందుల అడ్డా.. దేశంలోనే ఇప్పుడు ఇక్కడే ఎక్కువ..!

రాబందుల గురించి చెప్పుకొని ఎంత కాలమైంది? ఇవ్వాళ ఏ కథల్లోనో, సినిమా డైలాగుల్లోనో రాబందులు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. భూమ్మీద రోజురోజుకీ వీటి సంఖ్య తగ్గిపోతోంది. ఈ ఒక్క ఊళ్లో మాత్రం రాబందులు స్పెషల్. ఇక్కడికెళ్తే బోలెడన్ని కనిపిస్తయ్!

ఒకప్పుడు ఊరు చివర గుంపులు గుంపులుగా ఎగిరే రాబందులు ఇప్పుడు కనిపించడం లేదు. ప్రపంచంలో అంతరించిపోతున్న జీవజాతులలో ఇవి కూడా ఉన్నాయి. అయితే, ఈ అరుదైన రాబందుల ఉనికి మన రాష్ట్రంలో ఉంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పాలరాపు గుట్ట వీటికి కేంద్రంగా ఉంది. అంతేకాదు, ఈ ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం'గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. 'జటాయు' పేరుతో ఇక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది.

జిల్లాలోని కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని పెంచికల్పేట్ మండలం నందిగామ గ్రామ సమీపంలో పాలరావు గుట్ట ఉంది. ఈ గుట్టపై రాబందుల ఉనికి ఉన్నట్లు నాలుగేళ్ల క్రితం అటవీ అధికారులు గుర్తించారు. మరోవైపు అంతరించిపోతున్న అరుదైన రాబందులు ఇక్కడ కనిపించడంతో పర్యావరణవేత్తలు సంతోషపడ్డారు. పర్యావరణ పరిరక్షణలో కీలకంగా వ్యవహరించే రాబందుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రాబందుల సంరక్షణ కోసం కొన్ని నిధులను కేటాయించి, సిబ్బందిని నియమించారు అధికారులు. గుట్టపై ఐదు ఎకరాలలో ఫెన్సింగ్ వేసి.. బేస్ క్యాంప్ ఏర్పాటుచేశారు. రాబందులు ఆహారం కోసం మేకలు, ఇతర జంతువులను పెంచుతున్నారు. ఇక్కడుండే సిబ్బంది.. ప్రతిరోజు రాబందుల కదలికలను ఎప్పటికప్పుడు కెమెరాలో రికార్డు చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ప్రాణహిత, పెద్దవాగుల ప్రవాహంతో పాలరావు గుట్ట ఆకట్టుకుంటుంది. 

నివాసానికి అనువుగా గుట్ట 

పాలరావు గుట్ట ప్రాంతంలో దట్టమైన అడవిలోని నందిగామ గ్రామం వద్ద ప్రాణహిత, పెద్దవాగు నదులు కలుస్తాయి. పెద్దవాగును ఆనుకొని... మూడు వందల మీటర్లకు పైగా ఎత్తులో ఏటవాలుగా ఈ గుట్ట ఉంది. గుట్టకు చిన్న చిన్న రంధ్రాలు ఉండటంతో అరుదైన 'లాంగ్ బిల్డ్ వల్చర్' జాతి రాబందులు ఇక్కడ ఆవాసాలు ఏర్పాటుచేసుకున్నాయి. - అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో నాలుగేళ్ల క్రితం పది రాబందులు ఉండగా... ప్రస్తుతం 33 ఉన్నట్టు సర్వేలో తేలింది. ఈ గుట్టపై వందకు పైగా రాబందులు నివసించేలా సౌకర్యాలు ఉన్నాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. బయాలజిస్ట్ రవికాంత్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ రేంజ్ అధికారులు వీటి పర్యవేక్షణ చేపట్టారు. అంతేకాదు గతంలో జరిగిన రాష్ట్ర వన్యప్రాణి మండలి సర్వసభ్య సమావేశంలో పాలరావు గుట్టలోని రాబందుల అభయారణ్యం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు కూడా.


శీతాకాలంలో హిమాలయాల నుంచి...

పాలరావు గుట్టల్లోకి రెండు గ్రిఫెన్ రాబందులు గతంలో వలస వచ్చాయి. ఇక్కడున్న పొడుగు ముక్కు రాబందులు సంరక్షణ కేంద్రంలో భిన్నంగా ఉన్న వీటిని సిబ్బంది. గుర్తించి... ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వాటిని హిమాలయ పర్వతశ్రేణుల్లోని నివాసముండే 'హిమాలయన్ గ్రిఫెన్ రాబందులు"గా అధికారులు గుర్తించారు. ఇవి 'ఓల్డ్ వరల్డ్ వల్చర్ (పురాతన పక్షి జాతి)కి చెందినవిగా నిర్ధారించారు. 'ఏటా శీతాకాలంలో ఆహారం కోసం హిమాలయాల నుంచి దక్షిణ భారతదేశంలోని కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాలకు రాబందులు వలస వస్తుంటాయి" అని అధికారులు చెప్పారు. అయితే, తొలిసారిగా రాష్ట్రంలోని పాలరాపు గుట్ట వద్ద ఇవి స్థావరం ఏర్పరుచుకున్నాయన్నారు. నలభై ఏళ్ల క్రితం కోట్లలో.. సుమారు నాలుగు దశాబ్దాల కిందట దేశంలో కోట్లలో ఉన్న రాబందుల సంఖ్య.. పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం వేలల్లో కూడా లేవని గణాంకాలు చెప్తున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో ప్రవహిస్తున్న ప్రాణహిత, పెద్దవాగు నదులు కలిసే చోట.. పెంచికలపేట మండలం మురళీగూడ బీట్, కంపార్ట్ నెంబర్ 270లో ఉన్న నందిగాం అటవీ ప్రాంతంలోని పాలరావు గుట్టపై ప్రస్తుతం రాబందుర్రం ఏర్పాటు చేసుకున్నాయి.

2013లో గుర్తింపు

2013 మార్చిలో ఈ రాబందులను జిల్లా అటవీ శాఖ అధికారులు గుర్తించి.. వీటి సంరక్షణ పై ప్రత్యేక దృష్టిపెట్టారు. వాటి సంరక్షణకు, సంతతి పెరుగుదల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర సర్కారు అటవీశాఖ ఆధ్వర్యంలో రాబందుల స్థావరం ఏర్పాటుకు ఐదు లక్షలు మంజూరు చేసింది. అంతేకాకుండా రాబందుల స్థావరాన్ని 'పొడుగు ముక్కు రాబందుల సంరక్షణ కేంద్రం'గా పేరు పెట్టింది. పక్షుల సంరక్షణ కోసం 2015లో రాబందుల పరిశోధకుడు రవికాంత్ తో పాటు ఐదుగురు గార్డులను ప్రభుత్వం నియమించింది. వీళ్లంతా పక్షుల ఆవాసానికి వందమీటర్ల పరిధిలో పెదవాగు వద్ద షెడ్డు వేసుకుని రాబందుల ఆహారపు అలవాట్లను పరిశీలిస్తున్నారు.

అంతరించిపోవడానికి కారణం

పశువులకు ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు డైక్లోఫెనాక్ లాంటి ఇంజెక్షన్లు వాడతారు. వీటిని ఉపయోగించిన పశువులు కళేబరాలను తినడం వల్లే రాబందులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పశువులు చనిపోయిన తర్వాత వాటి శరీరంలో ఉండే ఈ ఔషధం రాబందుల విసర్జక వ్యవస్థను దెబ్బతీయడంతో అవి చనిపోతున్నాయి. దీంతో డైక్లోఫెనాక్ మందులను పశువులకు ఉపయోగించకుండా అధికారులు నిషేధించారు. ఈ విషయమై ప్రజలకు, వైద్యులకు ఉన్నతాధికారులు అవగాహన కల్పించారు కూడా.