
- అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చేలా టూరిజం శాఖ ప్రణాళికలు
- మేడారం, బతుకమ్మ, బోనాల పండుగలు జరిపేలా ఏర్పాట్లు
- కైట్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించాలని యోచన
- దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యం
హైదరాబాద్, వెలుగు: ప్రపంచ వేదికలపై మన పండుగలు, జాతరలను ప్రమోట్ చేసేందుకు రాష్ట్ర టూరిజం శాఖ ప్రణాలికలు రూపొందిస్తున్నది. టూరిజం పాలసీలో భాగంగా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర పర్యాటక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి లభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇతర దేశాల్లో మేడారం సమ్మక్క– సారక్క, నాగోబా జాతర, బతుకమ్మ, బోనాలు, దసరా, సంక్రాంతి వంటి సంప్రదాయ పండుగల తోపాటు కైట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. అంతర్జాతీయ స్థాయిలో జరిగే కార్నివాల్స్, వాటర్ కార్నివాల్స్, రివర్ ఫెస్టివల్స్ వంటి వాటిని తెలంగాణలోనూ నిర్వహించేలా ప్లాన్ రెడీ చేసింది. రియో కార్నివాల్ తరహాలో ఈవెంట్స్ చేపట్టనున్నది. దీనిద్వారా దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడంతోపాటు ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని యోచిస్తున్నది. ఈ కార్యక్రమాల ద్వారా సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంతోపాటు మార్కెట్లను, హస్తకళలను ప్రోత్సహించి టూరిజం రంగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించింది.
విదేశాల్లో టూరిజం ప్రమోషన్స్
రాష్ట్ర ప్రభుత్వం సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా కైట్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. దీనిద్వారా వివిధ దేశాల్లో టూరిజం ప్రమోషన్ చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటైన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడానికి టూరిజం శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో జరిగే నాగోబా జాతర గోండు, గిరిజన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది.
ఆదాయ వనరుల పెంపుపై ఫోకస్
పర్యాటకాన్ని ప్రమోట్ చేసేలా టూరిజం శాఖ ప్లాన్ చేస్తున్నది. పర్యాటకులను ఆకర్షించడం ద్వారా వ్యాపారాలు, హస్తకళలు, హోటళ్లు, రవాణా వ్యవస్థలు బలోపేతం కావడంతోపాటు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తద్వారా ఆదాయం సమకూరనున్నది. అంతేకాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం సేవల కోసం ప్రత్యేక ‘టూరిజం పోర్టల్’ను రూపొందించారు. అన్ని సేవలు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తున్నారు.
టూరిజం ప్రాంతాల్లో కళా ప్రదర్శనలు..
సోమశిల, రామప్ప, లక్నవరం, నాగార్జునసాగర్ లోని బుద్ధవనం ఇతర పర్యాటక ప్రాంతాల్లో వీకెండ్లో పర్యాటకుల సందడి అధికంగా ఉంటుంది. అయితే వీరికి కనువిందు చేయడానికి కళా ప్రదర్శనలు నిర్వహించేలా టూరిజం శాఖ ప్లాన్ చేస్తున్నది. సంప్రదాయ నృత్యాలు (కూచిపూడి, భరతనాట్యం), సంగీత కచేరీలు లేదా స్థానిక జానపద కళలు (బుర్రకథ, హరికథ), తెలంగాణ సాంస్కృతిక కళాకారులతో ప్రదర్శనలు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించారు.