- ఆర్టీఈ చట్టాన్ని సవరించాలని ప్రధానికి యూటీఎఫ్ లేఖలు
హైదరాబాద్, వెలుగు: విద్యాహక్కు చట్టం అమలుకు, ఎన్సీటీఈ నోటిఫికేషన్‌కు ముందు నియమితులైన టీచర్లందరికీ టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) కేంద్రాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం ప్రధాని కార్యాలయానికి గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ. వెంకట్ మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టెట్ నిబంధనతో దేశవ్యాప్తంగా 25 లక్షల మంది, రాష్ట్రంలో 45 వేల మంది సీనియర్ టీచర్లు ఆందోళన చెందుతున్నారని పేర్కొంటూ, వెంటనే వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ అవసరం లేదని ప్రకటించినందునే 15 ఏండ్లుగా టీచర్లు పరీక్ష రాయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు హఠాత్తుగా రెండేండ్లలో పాస్ కాకపోతే ఉద్యోగాలకు ఉద్వాసన పలుకుతామనడం సమంజసం కాదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి రెండు నెలలైనా రివ్యూ పిటిషన్ వేయకపోవడం సరికాదన్నారు. డిసెంబర్ 1 నుంచి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చట్టాన్ని సవరించి సీనియర్ టీచర్లకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సింహాచలం, రాష్ట్ర నేతలు మాణిక్ రెడ్డి, జయసింహారెడ్డి, మదన్ రెడ్డి, నీరజ తదితరులు పాల్గొన్నారు.
