డిసెంబర్​ 26న ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్​.. ప్రధాని మోదీతో భేటి

డిసెంబర్​ 26న ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్​.. ప్రధాని మోదీతో భేటి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ( డిసెంబర్​ 26)  ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీని కలిసేందుకు ఆయన ఢిల్లీకి వెళుతున్నారు. మంగళవారం ( డిసెంబర్​ 26) సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఖరారయింది. మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. దీంతో పాటు పార్టీ హైకమాండ్ తో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. పార్లమెంటు ఎన్నికలపై ఆయన చర్చించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఎల్లుండి నాగపూర్ లో జరగనున్న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొననున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

 నామినేటెడ్ పదవులు...

 దీంతో పాటు నామినేటెడ్ పదవులతో పాటు ఆరుగురిని మంత్రివర్గంలో తీసుకనే విషయంపైనా రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో చర్చించనున్నారని చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ మంత్రి వర్గంలో ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే వీటిని భర్తీ చేయాలంటే ముందుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఆరు ఎమ్మెల్సీ పోస్టులకు కూడా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. వీటన్నింటిపై రేపటి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఒక క్లారిటీ వచ్చే అవకాశముంది.