టెలికాం బిల్లు : కొత్త సిమ్ కార్డు కావాలంటే.. ఆధార్ థంబ్ మస్ట్

టెలికాం బిల్లు : కొత్త సిమ్ కార్డు కావాలంటే.. ఆధార్ థంబ్ మస్ట్

టెలికాం చట్టంలో కొత్త సవరణలు చేసింది కేంద్రం ప్రభుత్వం. మారుతున్న కాలానికి అనుగుణంగా చేర్పులు, మార్పులతో.. కొత్త నిబంధనలు తీసుకొచ్చింది కేంద్రం. ఈ క్రమంలో ఈ బిల్లుకు సంబంధించిన విషయాలు, నియమాలను తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ బిల్లుకు రాష్ట్రపతి అనుమతి లభించి కొత్త చట్టం అమలులోకి వస్తే మొబైల్ కొత్త సిమ్ కార్డు కనెక్షన్ సంబంధించి కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి. ఇదే గనక జరిగితే కొత్త మొబైల్ సిమ్ కార్డు తీసుకోవాలంటే ఆధార్ కార్డు బయోమెట్రిక్ ధ్రువీకరణ (వేలిముద్ర వేయడం) తప్పనిసరి అవుతుంది. అంటే ఎవరైతే సిమ్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారో వారి థంబ్ ఇంప్రెషన్ ఉంటేనే సిమ్ జారీ చేస్తారన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే అక్రమంగా లేదా ఇష్టానుసారంగా సిమ్ కార్డుల కొనుగోలుకు పాల్పడే వారికి ఇది చెక్ పెట్టనుంది.

ప్రస్తుతం సిమ్ కార్డు తీసుకోవాలంటే నో యువర్ కస్టమర్ (కేవైసీ) కోసం ఆధార్ నంబర్ మాత్రమే తీసుకుంటున్నారు. ఒక్క రిలయన్స్ జియో మాత్రమే కొత్త కనెక్షన్ ఇచ్చేందుకు ముందు నుంచీ బయోమెట్రిక్ పద్ధతిని అవలంబిస్తోంది. ఇప్పుడు ఈ కొత్త టెలికాం బిల్లు అమల్లోకి వస్తే మిగతా కంపెనీలు కూడా ఈ నియమాలకు లోబడి ఉండాల్సిందే. అలాగే ఇప్పటికే మొబైల్ కనెక్షన్లు ఉన్న వారు తమ నెట్‌వర్క్ ద్వారా బయోమెట్రిక్ ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే నకిలీ సిమ్ కార్డులను తొలగించడం, నివారించడం సులభమవుతుందని కేంద్రం భావిస్తోంది.

ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌, 1885, సంబంధిత చట్టాల స్థానంలో ఈ కొత్త టెలికా చట్టం రానుంది. ఇండియన్‌ వైర్‌లెస్‌ టెలిగ్రఫీ యాక్ట్‌ 1933, టెలిగ్రాఫ్‌ వైర్స్‌(అన్‌లాఫుల్‌ పొసెసన్‌) యాక్ట్‌-1950లనూ ఈ టెలికాం బిల్లు భర్తీ చేయనుంది. ఈ బిల్లు డిసెంబర్ 20న పార్లమెంట్ లో ఆమోదం పొంది రాష్ట్రపతి అనుమతి కోసం వెళ్లింది. రాష్ట్రపతి ఆమోదం లభిస్తే ఇది చట్ట రూపం దాలుస్తుంది. ఆ తర్వాత నుంచే ఈ కొత్త నిబంధనలు, నియమాలు అమలులోకి రానున్నాయి.