కార్మికుల వేతనాల పెంపుపై భగ్గుమన్న చిన్న నిర్మాతలు.. తెలంగాణ ఫెడరేషన్‌తో కలుస్తామని హెచ్చరిక

 కార్మికుల వేతనాల పెంపుపై భగ్గుమన్న చిన్న నిర్మాతలు..  తెలంగాణ ఫెడరేషన్‌తో కలుస్తామని హెచ్చరిక

తెలుగు సినీ పరిశ్రమలో సంక్షోభం కొనసాగుతోంది. 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికుల చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరింది.  నిర్మాతల మండలి,  ఎంప్లాయిస్ ఫెడరేషన్ మధ్య పలుమార్లు చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు.  24 క్రాఫ్ట్స్ చెందిన కార్మికులు ఈ బంద్‌లో పాల్గొన్నాయి. దీంతో నిర్మాణంలో ఉన్న అనేక పెద్ద, చిత్రాలపై పడింది.  సినిమా షూటింగ్ లు బంద్ అయ్యాయి. 

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చిన్న చిత్రాల నిర్మాతల సంఘంతో ఒక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రస్తుతం సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు,  చిన్న చిత్రాల నిర్మాతలు పడుతున్న ఇబ్బందులపై చర్చించారు. ఒకప్పుడు తెలుగు సినిమా మార్కెట్ చాలా బలంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సినిమా మార్కెటింగ్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా, థియేటర్లలో టికెట్లు అమ్ముడుపోవడం లేదు. దీంతో చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నామని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు చెప్పారు.

ఈ సమావేశం అనంతరం ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ..  ఏడాదికి సుమారు 300 సినిమాలు విడుదలవుతుంటే, అందులో 230-240 సినిమాలు చిన్న సినిమాలే ఉన్నాయి. ఈ చిన్న సినిమాలే చిత్ర పరిశ్రమలోని కార్మికుల మనుగడకు ప్రధాన ఆధారం . తమ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని  ఇప్పటికే ఇస్తున్న  వేతనాలపై25 శాతం తగ్గించాలని చిన్న నిర్మాతలు కోరారని ఆయన తెలిపారు. ఒకవేళ వేతనాలు తగ్గించడం సాధ్యం కాకపోతే, వేతనాలు పెంచేది కూడా కుదరదు అని చిన్న నిర్మాతలు స్పష్టం చేశారు. ఒకవేళ వేతనాలను పెంచినా, దానికి చిన్న నిర్మాతలు బాధ్యత వహించరని అగ్రిమెంట్లో రాయాలని డిమాండ్ చేసినట్లు  కళ్యాణ్ వెల్లడించారు.

ALSO READ : Mayasabha X Review : 'మయసభ' రివ్యూ: చంద్రబాబు-YSR రాజకీయ శత్రువులుగా ఎలా మారారంటే?

అలాగే కార్డ్ లు , యూనియన్ తో సంబంధం లేకుండా కార్మికులతో వర్క్ చేయించుకుంటామని చిన్న నిర్మాతలు తేల్చి చెప్పారు. ఒక వేళ కార్మికుల వేతనాలు పెంపు చిన్న నిర్మాతలకు వర్తించేలా చేస్తే తాము ధర్నా చేస్తామని చిన్న నిర్మాతలు హెచ్చరించినట్లు కళ్యాణ్ చెప్పారు. చిన్న సినిమాలంటే సుమారు రూ. 10 కోట్లు లోపు. పనిచేయడానికి చాలా మంది ఉన్నారు. వారితో పని చేయించుకుంటామని తెలిపారు . తెలంగాన ఫెడరేషన్ వాళ్లతో కలిసి పోతాము. వాళ్లు తమకు అండగా ఉంటమని హామీ ఇచ్చారని చిన్ననిర్మాతలు చెప్పినట్లు సి. కళ్యాణ్ మీడియాకు వివరించారు. 

కార్మికుల సమ్మెతో  తెలుగు సినీ పరిశ్రమలో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. రోజువారీ కూలీల జీవితాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే ఇరు వర్గాలు ఒకే వేదికపైకి వచ్చి చర్చలు జరపడం తప్ప మరో మార్గం లేదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.