ఇద్దరు సీఎంలు కాంట్రాక్టులు చేస్తూ కమీషన్లు తింటున్నరు: బండి సంజయ్

ఇద్దరు సీఎంలు కాంట్రాక్టులు చేస్తూ కమీషన్లు తింటున్నరు: బండి సంజయ్
  • రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నడు
  • ఉగ్రవాద సంస్థ పీఎఫ్ఐకి కేసీఆర్ పార్టీ ఫండ్
  • లిక్కర్ స్కామ్​లో బిడ్డ ప్రమేయం లేదని కేసీఆర్ ప్రమాణం చేయాలె: బండి సంజయ్

జగిత్యాల, వెలుగు: లిక్కర్ ​స్కామ్ ​నుంచి బిడ్డను కాపాడుకొనేందుకు సీఎం కేసీఆర్​ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, మళ్లీ సెంటిమెంట్​ను వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్​ అయ్యారు. ఏపీ, తెలంగాణ సీఎంలు కలిసి కాంట్రాక్టులు చేస్తూ కమీషన్లు తింటూ రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు. 
సెంటిమెంట్​తో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో యాగం చేసే ముందు లిక్కర్ స్కామ్ తో తన బిడ్డ కవితకు సంబంధం లేదని ప్రమాణం చేయాలని సంజయ్ సవాల్ విసిరారు. సోమవారం జగిత్యాల జిల్లా రూరల్ మండలం చల్​గల్​లో పాదయాత్ర శిబిరం వద్ద ఆయన మీడియాతో, జగిత్యాల కొత్త బస్టాండ్ దగ్గర జరిగిన సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణ వచ్చినా రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదన్నారు. ఢిల్లీలో రాజశ్యామల యాగం చేస్తానంటున్న కేసీఆర్ తాను ఇచ్చిన హామీ గురించి ముందు ప్రజలకు చెప్పాలని, అప్పుడే యాగానికి సార్థకత ఉంటుందన్నారు. ఒక్క మోడీని అడ్డుకొనేందుకు గుంటనక్కలన్నీ కలిసి వస్తున్నాయని..  మోడీ సింహంలా సింగిల్ గా వస్తారని అన్నారు. 

పీఎఫ్ఐకి టీఆర్ఎస్ ​ఫండింగ్ నిజం కాదా?​

నిషేధిత పీఎఫ్ఐ సంస్థకు టీఆర్ఎస్​ ఫండింగ్ చేయడం నిజం కాదా? అని సంజయ్ ​నిలదీశారు. సంఘ విద్రోహ శక్తులకు జగిత్యాల అడ్డాగా మారిందన్నారు. పాకిస్తాన్ జిందాబాద్ అన్నవాళ్లను బట్టలు ఊడదీసి కొడతామని హెచ్చరించారు.  ఢిల్లీ నుంచి ఎన్ఐఏ వచ్చి పీఎఫ్ఐకి చెందిన వ్యక్తులను అరెస్ట్ చేసే వరకు స్టేట్​ఇంటెలిజెన్స్ ఏం  చేస్తోందని ప్రశ్నించారు. పచ్చ జెండా లీడర్లు అపవిత్రం చేసిన జగిత్యాల గడ్డను ఏబీవీపీ తమ్ముళ్లు యాత్రచేసి పవిత్రం చేశారన్నారు.

పదో తరగతి పిల్లగాండ్లు కూడా కుటుంబ పోషణకు ఇక్కడి నుంచి దుబాయ్ కి వలసపోతున్నారని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.  ముంబై బస్సు ఎక్కి వలస వెళ్తున్నవారితో ఆయన మాట్లాడారు.  నేటికీ వేల మంది వలస కార్మికులు విదేశీ జైళ్లలో మగ్గుతున్నారన్నారు. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు రూ.500 కోట్ల సంక్షేమ నిధి ఏడ పోయిందని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఫసల్ బీమా యోజన  అమలు చేసి, రైతులను ఆదుకుంటామన్నారు. అధికారం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్​తోనే  అభివృద్ధి సాధ్యమన్నారు. 

కవిత భూములు కొన్నందుకే కొండగట్టుకు నిధులు

వేములవాడ ఆలయాన్ని 'ప్రసాదం స్కీమ్' కింద అభివృద్ధి చేద్దామంటే కేసీఆర్ సహకరించలేదని సంజయ్​ చెప్పారు. ధర్మపురికి రూ.500 కోట్లు, వేములవాడకు   రూ.100 కోట్లు,  బాసరకు  రూ.120 కోట్లు ప్రకటించిన కేసీఆర్.. ఇప్పటివరకు  ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.  కవిత కొండగట్టులో భూములు కొన్నందుకే    రూ.100 కోట్లు ప్రకటించారని ఆరోపించారు.  కవిత దొంగ సారా దందా చేసిందని, ఆమెను అరెస్టు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన వాళ్లపై సీబీఐ, ఈడీ విచారణ జరపాల్సిందేన్నారు. దేశంలో ప్రతి గల్లీలో చైనా బజార్లు ఉన్నాయన్న కేసీఆర్​కు సిగ్గుండాలని, చైనా బజార్లను భారత్ బజార్లుగా మార్చిన ఘనత మోడీదని తెలిపారు.  జగిత్యాల మాతా శిశు కేంద్రం లో ఒక్క నెలలో ఆరుగురు బాలింతలు చనిపోయారన్నారు.  జగిత్యాలలో డబుల్ బెడ్ రూం ఇండ్లు,  ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతుబంధు, రైతు రుణమాఫీ, దళిత బంధు, దళితులకు మూడెకరాల భూమి ఎంత మందికి ఇచ్చారో కేసీఆర్ సభలో సమాధానం చెప్పలేదన్నారు. 

యాత్ర ముగింపు సభపై ఫోకస్​

బీజేపీ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను ఈనెల 15న కరీంనగర్​లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్​లో నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఈ సభ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ముగింపు సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చీఫ్​ గెస్ట్​గా హాజరవుతారు. ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండటంతో బీజేపీ కూడా అందుకనుగుణంగానే అడుగులు వేస్తున్నది.

ఈ సభకు భారీ జన సమీకరణపై పార్టీ నేతలు దృష్టిపెట్టారు. సంజయ్​ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో కనీసం లక్ష మందికి తగ్గకుండా జనాన్ని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభతో బీజేపీ క్యాడర్​లో భరోసా కల్పించాలనేదే ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పాదయాత్ర ప్రముఖ్​ గంగిడి మనోహర్​రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ బృందం సోమవారం కరీంనగర్​లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్​ను సందర్శించి ఏర్పాట్లపై లోకల్​ లీడర్లకు సూచనలు చేసింది.

ఆరో విడత యాత్ర రూట్​మ్యాప్​పై కసరత్తు

ఆరో విడత పాదయాత్రకు బీజేపీ నేతలు రూట్ మ్యాప్  రెడీ చేస్తున్నారు. ఐదో విడత యాత్ర ముగిసిన వారంలోపే ఆరో విడత యాత్ర ప్రారంభించాలని అనుకుంటున్నారు. హైదరాబాద్​లో ఈ యాత్ర నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. మొదటి, నాల్గో విడత యాత్రలు సిటీలోని పలు నియోజకవర్గాల వెంట సాగడంతో, మిగిలిన సెగ్మెంట్​లు కవర్ అయ్యేలా ఆరో విడతను ప్లాన్ చేస్తున్నారు. తర్వాత బస్సు యాత్రకు బీజేపీ సిద్ధమవుతోంది.