- పది మందికి టీచర్ జాబులు
నిర్మల్ నిర్మల్/బెల్లంపల్లి రూరల్, వెలుగు: డాక్టర్ అప్పాల కావేరి మెమోరియల్ డిజిటల్ లైబ్రరీలో ప్రిపేర్ అయిన పది మంది డీఎస్సీలో టీచర్ జాబ్‌లు సాధించారు. ఆరు నెలల నుంచి యువతీయువకులు ఈ లైబ్రరీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు డీఎస్సీకి ప్రిపేర్ అయ్యి సత్తా చాటారు. స్థానిక ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ అప్పాల చక్రధారి–శశికళ తమ కుమార్తె దివంగత కావేరి జ్ఞాపకార్ధం ఏడేండ్ల క్రితం ఈ లైబ్రరీని స్థాపించారు. గ్రూప్–1 తోపాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు ఈ లైబ్రరీలో స్టడీ మెటీరియల్, రిఫరెన్స్ బుక్స్‌ను అందుబాటులో ఉంచారు.
కంప్యూటర్స్ ద్వారా డిజిటల్ కోచింగ్ సైతం ఇక్కడ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ లైబ్రరీలో ప్రిపేరైన వారిలో 50 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. తాజాగా డీఎస్సీ ఫలితాల్లో బి.శ్రావణి, బి.రాజు, కె.గీత, లిఖితారెడ్డి, డి.ప్రసన్న, స్రవంతి, తిరుమలేశ్, ఎ.నాగజ్యోతి, బి.ప్రతిభ, బి.శ్రీకాంత్ స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. లైబ్రరీ వ్యవస్థాపకులు చక్రధారి–శశికళ వీరిని అభినందించారు.
మూడు కొలువుల సత్తాచాటిన సృజన..
నిర్మల్ పట్టణం బంగల్ పేటకు చెందిన గండ్రత్ సృజన వరుసగా సర్కారు కొలువులు సాధిస్తూ సత్తా చాటుతోంది. రిటైర్డ్ టీచర్ గండ్రత్ కిషన్ కూతురైన సృజన ఎంఎస్సీ, బీఈడీ పూర్తి చేసింది. మొదట పంచాయతీ సెక్రటరీ పరీక్షల్లో జిల్లా టాపర్ గా నిలిచింది. ఆ తర్వాత హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షల్లోనూ మెరిసి ప్రస్తుతం ఖానాపూర్ లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. విధులు నిర్వహిస్తూనే తాజాగా డీఎస్సీలో బయోలాజికల్ స్కూల్ అసిస్టెంట్ విభాగంలో జిల్లాస్థాయి రెండో ర్యాంకు సాధించింది. ఇలా వరుసగా ప్రభుత్వ కొలువులు సాధిస్తున్న సృజనను బంగల్ పేట్ ఆంజనేయ యువజన సంఘం సభ్యులు అభినందించారు..
జెండా వెంకటాపూర్ యువకుడికి ఫస్ట్ ర్యాంక్
డీఎస్సీ స్కూల్‌అసిస్టెంట్ ఇంగ్లీష్ విభాగంలో నెన్నెల మండలం జెండావెంకటాపూర్ గ్రామానికి చెందిన ఏస్కూరి ప్రదీప్ జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. అతడి తండ్రి పోశం వ్యవసాయ కూలీగా, తల్లి అమృత కాంట్రాక్ట్ పద్ధతిలో ఏఎన్ఎంగా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తితో పట్టుదలతో చదివానని, ఫస్ట్ ర్యాంక్ రావడం పట్ల ఆనందంగా ఉందని ప్రదీప్ తెలిపాడు.