ట్రిపుల్ ఆర్​కు వచ్చే నెలలో టెండర్లు

ట్రిపుల్ ఆర్​కు వచ్చే నెలలో టెండర్లు
  •     భువనగిరి, నల్గొండలో కాంగ్రెస్‌‌కు మోదీ కంటే ఎక్కువ మెజార్టీ వస్తది
  •     కేసీఆర్‌‌‌‌ చేసుకున్న ప్రాజెక్టుల ఒప్పందాలు రద్దు చేస్తాం
  •     మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : రీజనల్ రింగ్ రోడ్ కు వచ్చే నెలలో రూ. 30 వేల కోట్లతో టెండర్లు పిలుస్తామని ఆర్‌‌‌‌అండ్‌‌బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. నల్గొండ పట్టణంతో పాటు, తిప్పర్తి, కనగల్ మండలాల్లో ఆదివారం కలెక్టర్ హరిచందనతో కలిసి జీరో కరెంట్​ బిల్లులు అందజేశారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్‌‌ ఎన్నికల్లో  భువనగిరి, నల్గొండలో కాంగ్రెస్‌‌కు ప్రధాని మోదీ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందన్నారు.

కేసీఆర్ మూడేండ్లకే కూలిపోయే ప్రాజెక్టులు కట్టి రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. డబ్బుల కోసం కృష్ణా నదిని ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్‌‌కు అప్పగించి శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌‌‌ ప్రాజెక్ట్ లను ఎండబెట్టారన్నారు. కేసీఆర్ చేసిన ప్రాజెక్టుల ఒప్పందాలన్నిటినీ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ ల ను పూర్తి చేసి త్వరలోనే సాగు నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పదేండ్లలో చేసిన అప్పుల కారణంగా ఆర్థిక ఇబ్బందులు

ఎదురవుతున్నప్పటికీ హామీలు నెరవేరుస్తున్నామని, ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఒకటో తేదీనే ఇస్తున్నామన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ పేదల గురించి అలోచించలేదన్నారు. గ్యాస్, గృహజ్యోతి పథకాలతో పేదలకు కనీసం రూ. వెయ్యి మిగిల్చామన్నారు. తాము చేసే పనులను చూసైనా ప్రతిపక్షాలు నేర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దన్నారు.