- 27వ తేదీలోపు బిడ్లు దాఖలు చేయాలని టీజీఐఐసీ సర్క్యూలర్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ – నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా కేంద్రం జహీరాబాద్ స్మార్ట్ సిటీని అభివృద్ధి చేయనున్నది. అందులో భాగంగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) తాజాగా జహీరాబాద్ స్మార్ట్ సిటీ నిర్మాణం కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)ని ఆహ్వానించింది. రూ.1,206 కోట్లతో ఈ స్మార్ట్ సిటీని అభివృద్ధి చేయనున్నారు. ఈ నెల 27వ తేదీలోపు బిడ్లను దాఖలు చేయాలని సర్క్యులర్‌లో టీజీఐఐసీ పేర్కొన్నది.
ఈ నెల 6న ప్రీబిడ్ మీటింగ్‌ను నిర్వహించనున్నది. కాగా, జహీరాబాద్ స్మార్ట్ సిటీని 3,245.48 ఎకరాల్లో నిర్మించనున్నారు. అందులో ఇండస్ట్రీల కోసమే ఎక్కువ భూమి వినియోగించనున్నారు. 1939.40 ఎకరాల్లో పరిశ్రమలను అభివృద్ధి చేయనున్నారు. ట్రాన్స్పోర్ట్ కోసం 55 ఎకరాలు, గ్రీనరీ కోసం 606.82 ఎకరాలు, నివాస సముదాలు, సెటిల్మెంట్ల కోసం 12.94 ఎకరాలు, వివిధ సేవల కోసం 83.77 ఎకరాలు, రోడ్లకు 433.50 ఎకరాలు, పబ్లిక్ ప్లేసెస్‌కు 29.02 ఎకరాలు, వాణిజ్య అవసరాలకు 71.73 ఎకరాలు, చెరువు కోసం 13.30 ఎకరాలను వినియోగించనున్నారు.
