కరీంనగర్ లో కాంగ్రెస్ ఆశావహుల్లో టెన్షన్

కరీంనగర్ లో కాంగ్రెస్ ఆశావహుల్లో టెన్షన్
  • నేటి ఫస్ట్ లిస్టులో వచ్చే పేర్లపై ఉత్కంఠ
  • బేఫికర్‌‌‌‌‌‌‌‌గా రేవంత్ వర్గం లీడర్లు
  • నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారం షురూ 
  • మిగతావాళ్లంతా హైదరాబాద్‌‌‌‌లోనే మకాం

కరీంనగర్, వెలుగు : కాంగ్రెస్ ఫస్ట్ లిస్టును ఆదివారం ప్రకటించనున్న నేపథ్యంలో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సగం స్థానాల్లో అభ్యర్థులు ఎవరనే  విషయంలో క్లారిటీ ఉన్నప్పటికీ.. మిగతా స్థానాలపై సస్పెన్స్ నెలకొంది. ఫస్ట్ లిస్టులో తక్కువ పోటీ ఉండి, ఎక్కువ వివాదాల్లేని 70 స్థానాలు ప్రకటించబోతున్నారు. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సుమారు 9 స్థానాలు ఉండే అవకాశముంది. ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరఫున పోటీ  చేసేందుకు మొత్తం 85 మంది అప్లై చేసుకున్నరు.

ఇందులో అత్యధికంగా కరీంనగర్ నుంచి 15, కోరుట్ల, హుజూరాబాద్ నుంచి 13 చొప్పున దరఖాస్తులు అందాయి. జగిత్యాల నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అప్లికేషన్ ఒక్కటే రాగా.. మంథని, మానకొండూరు నుంచి 2 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. కాగా మొదటి జాబితాలోనే తమ పేరు వచ్చేలా కాంగ్రెస్ ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీమ్ గా పేరున్న  డీసీసీ అధ్యక్షుడు కె.సత్యనారాయణ, చొప్పదండి కాంగ్రెస్ ఇన్‌‌‌‌చార్జి మేడిపల్లి సత్యం, పెద్దపల్లి కాంగ్రెస్ ఇన్‌‌‌‌చార్జి విజయరమణారావు టికెట్ విషయంలో బేఫికర్‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. ఇప్పటికే తమ నియోజకవర్గాల్లో ప్రచారం కూడా షురూ చేశారు. 

ఆ నాలుగు నియోజకవర్గాలపైనే ఉత్కంఠ..  

కాంగ్రెస్ ప్రకటించే ఫస్ట్ జాబితాలో 9 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో జగిత్యాల నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంథని నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ కుమార్, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నుంచి కేకే మహేందర్ రెడ్డి, కోరుట్ల నుంచి జువ్వాడి నర్సింగారావు, పెద్దపల్లి నుంచి విజయరమణారావు, చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం, మానకొండూరు నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. పోటీ ఎక్కువగా ఉన్న కరీంనగర్‌‌‌‌‌‌‌‌, హుజూరాబాద్, హుస్నాబాద్, రామగుండం నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు రెండో జాబితాలో ప్రకటించవచ్చని సమాచారం.