కస్తూర్బా స్కూల్ గదిలో విద్యార్థులు.. బయట తల్లిదండ్రుల ఎదురు చూపులు

కస్తూర్బా స్కూల్ గదిలో విద్యార్థులు.. బయట తల్లిదండ్రుల ఎదురు చూపులు

ఇబ్రహింపట్నం కస్తూర్బా స్కూల్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. తమ బిడ్డల పరిస్థితి తెలుసుకోవడానికి, వారిని తీసుకెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులను అనుమతించలేదు. విద్యార్థులను గదిలో పెట్టి తలుపులు వేయడం వివాదాస్పదమవుతోంది. గంటల తరబడి అక్కడే కూర్చొన్నా స్కూల్ యాజమాన్యం స్పందించలేదు. పిల్లలను కలువనీయకుండా పోలీసులు వ్యవహరించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు గంటలుగా పిల్లలను కలవడానికి వారు ఎదురు చూపులు పడాల్సి వచ్చింది. చదువు లేకున్నా.. మా పిల్లలని పంపించాలంటూ వాళ్లు వేడుకున్నారు. 

అసలేం  జరిగింది ? 
ఇబ్రహీంపట్నం కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలకు తల్లిదండ్రులు వచ్చారు. విద్యార్థులను ఓ గదిలో వేసి తలుపులు మూసేశారు. పిల్లలను కలవనివ్వకుండా తల్లిదండ్రులను అప్పటికే అక్కడున్న పోలీసులు ప్రయత్నించారు. చదువు లేకున్నా సరే.. తమ పిల్లల్ని పంపించండి, వాళ్ళు బ్రతికిఉంటే చాలు అని వేడుకున్నారు. ఈ క్రమంలో..  ఓ తల్లి అస్వస్థతకు గురయింది. దీంతో అక్కడున్న వారు  నీళ్లు, బిస్కెట్ అందించారు. కనీసం మంచినీరు కూడా ఇవ్వరా అంటూ మండిపడ్డారు. హాస్టల్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించడం, మీడియాని సైతం అనుమతించలేదు. ఇబ్రహింపట్నం కస్తూర్బా స్కూల్ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులు...
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా గాందీ బాలికల విద్యాలయాల్లో ఘోరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. నాణ్యత లేని ఫుడ్, కలుషిత నీరు, అపరిశుభ్రమైన వాతావరణం ఉండడంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో తల్లిదండ్రులు కలత చెందుతున్నారు. తమ పిల్లల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.