నిర్వాసితుల మీటింగ్​లో బీఆర్ఎస్, కాంగ్రెస్​ లీడర్ల కొట్లాట

నిర్వాసితుల మీటింగ్​లో బీఆర్ఎస్,  కాంగ్రెస్​ లీడర్ల కొట్లాట

కొత్తకోట, వెలుగు: శంకరసముద్రం నిర్వాసితుల మీటింగులో బీఆర్ఎస్, కాంగ్రెస్​ లీడర్ల మధ్య కొట్లాట జరగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం శంకర సముద్రం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న కానాయపల్లి నిర్వాసితులతో ఆర్అండ్ఆర్​ వద్ద శుక్రవారం కలెక్టర్​తేజస్​లాల్​పవార్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి సమావేశమయ్యారు. సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సర్పంచ్​ సుదర్శన్​రెడ్డి సూచించడంతో ముంపు గ్రామానికి చెందిన కాంగ్రెస్​ పార్టీ మండల అధ్యక్షుడు నరోత్తంరెడ్డి మాట్లాడుతూ రిజర్వాయర్​ నిర్మించింది కాంగ్రెస్​ పార్టీ అని, నిర్వాసితులకు పరిహారం ఇచ్చేది కూడా కాంగ్రెస్ ​పార్టీయేనన్నారు.

దీంతో బీఆర్ఎస్​కు చెందిన పీఏసీఎస్​ మాజీ చైర్మన్​ రావుల సురేంద్రనాథ్​రెడ్డి నిర్వాసితుల సమావేశంలో రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నావని దబాయించారు. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో పోలీసులు నరోత్తంరెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. నిర్వాసితులు అడ్డుకోవడంతో వెనక్కి తగ్గారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్వాసితులు అంగీకరిస్తే రిజర్వాయర్​దగ్గరలో 360 మందికి ఇండ్ల స్థలాలు ఇస్తామని, గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. వామన్​ గౌడ్, గుంత మౌనిక, పొగాకు విశ్వేశ్వర్, రావుల సురేంద్రనాథ్​రెడ్డి, వడ్డే శ్రీను, గాడిల ప్రశాంత్, అమ్మపల్లి బాలకృష్ణ పాల్గొన్నారు.