నిర్వాసిత గ్రామంలో టెన్షన్ ​టెన్షన్​

నిర్వాసిత గ్రామంలో టెన్షన్ ​టెన్షన్​
  • అడుగడుగునా పికెట్లు
  • ఇండ్ల నుంచి బయట కాలు పెట్టనిస్తలేరు  
  • మంచినీళ్ల బాయిని పూడ్చేసిన్రు 
  • దీక్ష చేస్తూ స్పృహ తప్పిన సర్పంచ్ దవాఖానకు...
  • కొనసాగుతున్న మహిళల దీక్ష

హుస్నాబాద్, వెలుగు : గౌరవెల్లి ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయాలనుకుంటున్న సర్కారు పోలీసు బలగాలను రంగంలోకి దింపింది. గుడాటిపల్లి వద్ద 330 మీటర్ల కట్ట పనులు పెండింగ్ లో ఉండడంతో ఎవరూ అడ్డంకులు సృష్టించకుండా పోలీసులను మోహరించి పనులు చేయిస్తున్నది. రెండు రోజుల క్రితం పనులు ప్రారంభం కాగా, గుడాటిపల్లికి వెళ్లే రామవరం రోడ్డును పూర్తిగా మూసేసి ఐదు పికెట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఎవరూ అటు వైపు వెళ్లకుండా చూస్తున్నారు. పదుల సంఖ్యలో జేసీబీలు భారీ వెహికల్స్​తో పాటు, యాభైకి పైగా టిప్పర్లతో రాత్రి పగలు అనే తేడా లేకుండా పనులు చేస్తున్నారు. వారం రోజుల్లో పనులు కంప్లీట్​చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారు.  రామవరం రోడ్డును పూడ్చే క్రమంలో గ్రామస్తులు మంచినీళ్లు తాగే బావిని కూడా పూడ్చేశారు. వ్యవసాయ పనుల కోసం బావుల వద్దకు వెళ్లేవారిని అడ్డుకుంటున్నారు. చాలామందిని ఇండ్లలో నుంచి కాలు బయట పెట్టనియ్యడం లేదు.  దీంతో మంచినీళ్లకు, నిత్యావసరాలకు గ్రామస్తులు కష్టాలు పడాల్సి వస్తున్నది. ఆదివారం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి నిర్వాసితుల ఆందోళనకు సంఘీభావం తెలపాలని రాగా, అనుమతించకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. 

సొమ్మసిల్లి పడిపోయిన సర్పంచ్​ 

గౌరవెల్లి నిర్వాసితులకు న్యాయంగా దక్కాల్సిన పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ శనివారం రాత్రి నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగిన గుడాటిపల్లి సర్పంచ్ బద్దం రాజిరెడ్డి స్పృహ తప్పి పడిపోయారు. ఆమరణ దీక్ష విషయం తెలుసుకున్న ఎసీపీ సతీశ్, ఇతర పోలీసు అధికారులు ఆదివారం మధ్యాహ్నం గ్రామ పంచాయతీ వద్ద ఉన్న దీక్షా శిబిరానికి  వెళ్లారు. ఈ సందర్భంగా నిరశన విరమించాలని, కలెక్టర్​కు చెప్పి సమస్యలు పరిష్కారమయ్యేలా చెస్తామని చెప్పగా ఒప్పుకోలేదు. అక్కడున్న మహిళలు, గ్రామస్తులు మాట్లాడుతూ పెండ్లయిన ఆడపిల్లలకు ఆర్అండ్ఆర్​ప్యాకేజీ కింద రూ.8 లక్షలతో పాటు డబుల్​ ఇండ్లు ఇవ్వాలని,  గెజిట్​లో పేర్లు తప్పిపోయిన వారిని నమోదు చేసి న్యాయంగా రావాల్సిన పరిహారం ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్​చేస్తున్నామన్నారు. అయినా పట్టించుకోవడం లేదన్నారు. ముందు దీక్ష విరమిస్తే చూద్దామని ఏసీపీ సమాధానమివ్వగా, కలెక్టర్​లేదా మంత్రి హరీశ్​రావు డైరెక్ట్​గా వచ్చి హామీ ఇవ్వాలని గ్రామస్తులు పట్టుబట్టారు.  ఇంతలో దీక్షలో ఉన్న సర్పంచ్​రాజిరెడ్డి స్పృహ తప్పి పడిపోవడంతో పోలీసులు సిద్దిపేట జిల్లా దవాఖానకు తరలించారు.  దీంతో గుడాటిపల్లికి చెందిన 120 మంది మహిళలు దీక్షలు కొనసాగించారు.