రేషన్ కార్డుల పంపిణీలో గొడవ : జగదీశ్‌‌‌‌రెడ్డి

రేషన్ కార్డుల పంపిణీలో గొడవ : జగదీశ్‌‌‌‌రెడ్డి
  • బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పథకాల గురించి వివరించిన జగదీశ్‌‌‌‌రెడ్డి
  • ఆ పార్టీ పాలనంతా అవినీతిమయం అన్న మార్కెట్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ వేణారెడ్డి
  • ఇరు పార్టీల కార్యకర్తల పోటాపోటీ నినాదాలు, తోపులాట

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం నెమ్మికల్‌‌‌‌లో బుధవారం జరిగిన రేషన్‌‌‌‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్‌‌‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్ల నడుమ గొడవ జరిగింది. కార్యక్రమానికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌‌‌‌రెడ్డి, మార్కెట్‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌ కొప్పుల వేణారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభం కాగానే జగదీశ్‌‌‌‌రెడ్డి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తుండగా.. కాంగ్రెస్‌‌‌‌ కార్యకర్తలు అడ్డుకుని వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 అనంతరం మార్కెట్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ వేణారెడ్డి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌పై విమర్శలు చేశారు. పదేండ్ల పాలన అవినీతిమయం అయిందని, ఒక్కరికి కూడా డబుల్‌‌‌‌ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదన్నారు.  ఈ క్రమంలో కాంగ్రెస్‌‌‌‌ కార్యకర్తలు జై దామన్న అంటూ, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు జై జగదీశ్‌‌‌‌రెడ్డి అంటూ పోటాపోటీగా నినాదాలు చేస్తూ తోపులాటకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. జగదీశ్‌‌‌‌రెడ్డి, వేణారెడ్డి గొడవ పడుతుండడంతో వేదికపై ఉన్న కలెక్టర్‌‌‌‌ తేజస్‌‌‌‌ నందలాల్‌‌‌‌ పవార్‌‌‌‌ ఇద్దరి మైక్‌‌‌‌లను కట్‌‌‌‌ చేశారు. గొడవ సద్దుమణిగిన అనంతరం లబ్ధిదారులకు రేషన్‌‌‌‌ కార్డులు అందజేశారు. 

కాళేశ్వరం రిపోర్ట్‌‌‌‌ కట్టుకథ : గుంటకండ్ల జగదీశ్‌‌‌‌రెడ్డి

‘ప్రభుత్వం విడుదల చేసింది కాళేశ్వరం కమిషన్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌ కాదు.. అది కాంగ్రెస్, బీజేపీ ఆరోపణల చిట్టా’ అని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌‌‌‌రెడ్డి విమర్శించారు. అసలు నివేదికను పక్కన పెట్టి.. కాంగ్రెస్‌‌‌‌ సొంత కథనాలు అల్లుతోందని మండిపడ్డారు. నెమ్మికల్‌‌‌‌లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం తెలంగాణకు జీవ నాడి అని, కేసీఆర్‌‌‌‌ మళ్లీ అధికారంలోకి వచ్చి కాళేశ్వరం నీళ్లు అందిస్తారని చెప్పారు.

 ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు కేసీఆర్‌‌‌‌ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్‌‌‌‌ కుట్ర చేస్తోందని ఆరోపించారు. బనకచర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఈ కుట్రలపై అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ కాంగ్రెస్‌‌‌‌ ప్రజలను మోసం చేస్తోందన్నారు.