
- సూర్యాపేట జిల్లా నడిగూడెంలో ఘటన
మునగాల, వెలుగు: సూర్యాపేట జిల్లా నడిగూడెం కేజీబీవీలో టెన్త్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. డీఈవో అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండలం కలకోవా గ్రామానికి చెందిన నిమ్మ తనుషా మహాలక్ష్మి(15) ఏడవ తరగతి చదువుతోంది. సోమవారం రాత్రి 10 గంటలకు స్టడీ అవర్స్ పూర్తయ్యాక అందరితో కలిసి నిద్రపోయిన ఆమె, రాత్రి 12:30 సమయంలో నిద్రలేచి స్నేహితురాలితో తన కుటుంబ సమస్యలను చెప్పుకుంది.
ఈ విషయంలో ఒత్తిడికి లోనై మంగళవారం ఉదయం 5 గంటలకు విద్యార్థులు స్టడీ అవర్స్ కు వెళ్లిన సమయంలో తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలాన్ని సీఐ రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అజయ్ కుమార్ తెలిపారు. ఇదిలాఉంటే విద్యార్థిని మృతిపై విచారణ జరిపించాలని పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డెడ్ బాడీతో స్థానిక ఏరియా హాస్పిటల్ ఆవరణలో ధర్నా నిర్వహించారు.
బిల్డింగ్ పై నుంచి దూకిన ఇంటర్ స్టూడెంట్
గద్వాల: కేజీబీవీలో చదవుకోవడం ఇష్టం లేక జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డిలో ఇంటర్ స్టూడెంట్ స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకింది. స్టూడెంట్స్, కాలేజీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మక్తల్ మండలం భూత్పూర్ గ్రామానికి చెందిన సాయిశ్రుతి కేటిదొడ్డి కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్(బైపీసీ) చదువుతోంది. ఇంటికి వెళ్లిన ఆమె తనకు కేజీబీవీలో చదవడం ఇష్టం లేదని మారాం చేసినా, నచ్చజెప్పి ఆమెను సోమవారం తల్లి శమంతకమణి కేజీబీవీలో వదిలి వెళ్లింది.
మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో సాయిశ్రుతి బిల్డింగ్ పైకి ఎక్కి దూకేసింది. వెంటనే సిబ్బంది గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే హాస్పిటల్ కు వచ్చి ఆమెను పరామర్శించారు.