
ఇలియాన.. అనగానే తను ఇప్పటివరకూ చేసిన గ్లామర్ రోల్సే ఎక్కువగా తెలుగు ప్రేక్షకులకు గుర్తొస్తాయి. అయితే పూర్తిస్థాయి డీ గ్లామర్ రోల్‌లో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది ఇలియాన. ఆమె లీడ్ రోల్‌లో నటించిన హిందీ చిత్రం ‘తేరా క్యా హోగా లవ్లీ’. ఇదొక సోషల్ కామెడీ మూవీ. బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో ఇలియాన పాత్రను చూడగానే, మన తెలుగు ప్రేక్షకులకు ‘కార్తీక దీపం’ సీరియల్‌లో వంటలక్క గుర్తొస్తుంది. తన శరీర రంగు కారణంగా పెళ్లి సంబంధాలు తప్పిపోతుంటాయి.
కట్నం డబుల్ ఇస్తే చేసుకుంటామని ఓ కుటుంబం ముందుకొస్తుంది. కానీ అదే సమయంలో ఇంట్లో దొంగతనం జరిగి, కట్నంగా ఇవ్వాల్సిన ఖరీదైన వస్తువులు కనపడకుండా పోతాయి. ఆ కేసు దర్యాప్తు చేసే క్రమంలో పోలీస్ ఆఫీసర్ రణదీప్ హుడా ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. కామెడీ ఎంటర్‌టైనర్‌గా నవ్విస్తూనే చర్మం రంగు
వరకట్నం లాంటి సోషల్ ఇష్యూస్‌ను టచ్ చేస్తూ, ఆలోచింపజేసేలా తెరకెక్కించారు. సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బల్వీందర్ సింగ్ జంజువా దర్శకుడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.