యాదాద్రి జిల్లాకు టెక్స్ట్​​బుక్స్ వచ్చేశాయ్

యాదాద్రి జిల్లాకు టెక్స్ట్​​బుక్స్ వచ్చేశాయ్
  • జిల్లాలకు చేరిన టెక్స్ట్​, నోట్ బుక్స్
  • స్టూడెంట్స్ కు అందించేందుకు విద్యాశాఖ ప్రణాళికలు 
  • జూన్​12న విద్యార్థులకు పంపిణీ 

యాదాద్రి, సూర్యాపేట, వెలుగు : స్కూళ్లు రీ ఓపెన్​ అయ్యే నాటికి స్టూడెంట్లకు టెక్స్ట్​ బుక్స్​, నోట్​ బుక్స్​ అందించేందుకు అధికారులు ప్లాన్​ చేశారు.  యాదాద్రి జిల్లాకు 85.78 శాతం టెక్స్ట్​​బుక్స్​ రాగా, 44.02 శాతం నోట్​ బుక్స్​ వచ్చాయి. సూర్యాపేట జిల్లాకు 100 శాతం నోట్ బుక్స్, 60 శాతం టెక్స్ట్​ బుక్స్ ఇప్పటికే చేరాయి. స్కూల్స్​తెరిచే నాటికి మిగిలిన బుక్స్ జిల్లాకు చేరేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని గోదాం నుంచి స్కూల్స్ కు చేరుస్తున్నారు. 

యాదాద్రి జిల్లాలో.. 

యాదాద్రి జిల్లాలో ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక, కస్తూర్బా, మోడల్​స్కూల్స్​కలిపి 753 ఉన్నాయి. అన్ని స్కూల్స్​ కలిపి​ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే స్టూడెంట్స్​56,830 మంది ఉన్నారు.  వీరందరికీ ఏటా ప్రభుత్వం టెక్స్ట్​​బుక్స్​ అందిస్తోంది. ఈ విద్యాసంవత్సరానికి 3,08,910 టెక్స్ట్​​బుక్స్​ అవసరం కాగా, ఇప్పటివరకు 118 టైటిల్స్​కు సంబంధించిన 2,64,985 (85.78 శాతం) బుక్స్​వచ్చాయి. ఇందులో ఇప్పటికే 53,455 బుక్స్​ మండలాలకు పంపించారు. యాదాద్రి జిల్లాకు మొత్తం 2,90,049 నోట్​బుక్స్ అవసరం కాగా, ఇప్పటివరకు 1,27,700 (44.02 శాతం) బుక్స్​ వచ్చాయి.  

సూర్యాపేట జిల్లాలో.. 

సూర్యాపేట జిల్లాలో మొత్తం 1,268 స్కూల్స్ ఉన్నాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకు దాదాపు 1,39,311  మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లాకు మొత్తం 4.99 లక్షల టెక్స్ట్​ బుక్స్ అవసరమని ఆఫీసర్లు తేల్చారు. వీటిలో 2.50 లక్షల టెక్స్ట్​​ బుక్స్ చేరాయి. మరో 2.49 లక్షల బుక్స్ ఈ నెలాఖరులోపు అందనున్నాయి. వచ్చిన పుస్తకాలు సూర్యాపేట జిల్లా పరిషత్ స్కూల్ లోని గోదాంలో నిల్వ చేశారు.

 జిల్లావ్యాప్తంగా 4.90 లక్షల  నోట్ బుక్స్ అవసరమున్నట్లు అధికార యంత్రాంగం గుర్తించింది. ఆరో తరగతి వి ద్యార్థులకు ఒక సాదా, ఐదు సింగిల్‌ రోల్‌ నోటు బుక్స్​ అందిస్తారు. ఏడో తరగతి విద్యార్థులకు రెండు సాదా, నాలుగు సింగిల్‌ రోల్‌ నోట్​ బుక్స్​, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఏడు సాదా నోట్​ బుక్స్​, తొమ్మిది, పది విద్యార్థులకు 14 సాదా నోట్​ బుక్స్​ అందించనున్నారు. 

స్కూల్స్ రీ ఓపెన్ ముందే పంపిణీ.. 

జూన్ ఫస్ట్ వీక్ లో మండలాలకు బుక్స్ పంపిణీ చేయడానికి ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎం‌ఈ‌వోలకు మొదట అందించి అక్కడి నుంచి స్కూల్స్ కు చేరిన తర్వాత జూన్ 12న స్టూడెంట్స్ కు వీటిని అందించనున్నారు. విద్యార్థులకు టెక్ట్స్​బుక్స్, నోట్ బుక్స్ ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించారు. 

సకాలంలో బుక్స్​ పంపిణీ చేస్తాం 

స్కూల్స్ తెరచిన వెంటనే స్టూడెంట్స్ కు బుక్స్ అందిస్తాం. బుక్స్ కావాలని ఉన్నతాధికారులకు రిపోర్ట్ అందించాం. మొదట మండలాలకు చేరవేసి అక్కడి నుంచి స్కూళ్లకు సరఫరా చేస్తాం. 

అశోక్, సూర్యాపేట డీ‌ఈ‌వో