పుష్ప 2 ప్రీమియర్స్, సంధ్య థియేటర్ తొక్కిసలాట (డిసెంబర్ 4) ఘటనకు ఏడాది అయింది. ఈ క్రమంలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ కు అదనపు సహాయంపై నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు కీలక ప్రకటన చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ పూర్తిగా కోలుకునే వరకు అన్ని విధాలా అండగా ఉంటామని నిర్మాత దిల్ రాజు తెలిపారు.
గురువారం (డిసెంబర్ 5న) దిల్రాజును శ్రీతేజ తండ్రి కలిశారు. ప్రస్తుతం రిహాబిలిటేషన్ సెంటర్లో ఖర్చు ఎక్కువగా అవుతుందని, ఇంకా 6 నెలలు చికిత్స అందించాలని డాక్టర్లు చెప్పారన్నారు. మరికొంత ఆర్ధిక సహాయం కావాలని అడిగారు. ఇప్పటివరకు దాదాపుగా 3.25 కోట్లు (ఫిక్స్డ్ డిపాసిట్ కోటిన్నర కలుపుకొని) అల్లు అర్జున్ ఖర్చు పెట్టినట్లు తెలిపారు. కనీసం ఇలాంటి విషయాల్లో అయినా ఫ్యాన్ వార్స్ కోసం తప్పుడు సమాచారం షేర్ చేయకుండా ఉండటం మంచిదని వెల్లడించారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ పూర్తిగా కోలుకునే వరకు 6 నెలలు కాదు మరో ఏడాది అయినా సరే.. అల్లు అర్జున్, అల్లు అరవింద్‌తో మాట్లాడి అన్ని ఖర్చులూ భరిస్తామన్నారు. ఇప్పటికే రూ.2 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీని ప్రతి నెల శ్రీతేజ తండ్రి భాస్కర్‌కు అందిస్తున్నామని, హాస్పిటల్ ఖర్చులకు రూ.70 లక్షలు ఇచ్చామని తెలిపారు. ఇంత చేసిన వాళ్లం బాబు పూర్తిగా కోలుకునే వరకు చేయమా తప్పకుండా చేస్తామన్నారు’’ నిర్మాత దిల్ రాజు.
అయితే, శ్రీతేజకు సరైన విధంగా ట్రీట్‌మెంట్ అందడం లేదని, సపోర్ట్ కావాలని 15 రోజుల ముందు అల్లు అర్జున్ మేనేజర్‌కి రిక్వెస్ట్ పెట్టాం అని శ్రీతేజ తండ్రి భాస్కర్ తెలిపారు. భార్యను ఎలాగో కోల్పోయాను.. ఇప్పుడు బాబు పూర్తిస్థాయిలో కోలుకోవాలని కోరుకుంటున్నానని శ్రీతేజ తండ్రి చెప్పుకొచ్చారు. అనంతరం శ్రీ తేజని పూర్తిస్థాయిలో ఆదుకుంటాం అని నిర్మాత దిల్ రాజు భరోసా ఇచ్చారు.
