థాయ్‌‌‌‌లాండ్, కంబోడియా మధ్య ఘర్షణ తీవ్రతరం.. నిరాశ్రయులుగా మారిన వేలాది మంది ప్రజలు

థాయ్‌‌‌‌లాండ్, కంబోడియా మధ్య ఘర్షణ తీవ్రతరం.. నిరాశ్రయులుగా మారిన వేలాది మంది ప్రజలు
  • థాయ్‌‌‌‌లాండ్, కంబోడియా మధ్య ఘర్షణ తీవ్రతరం
  • సరిహద్దుల వెంట కొనసాగుతున్న దాడులు
  • 32కు చేరిన మృతుల సంఖ్య
  • నిరాశ్రయులుగా మారిన వేలాది మంది ప్రజలు

సురిన్ (థాయ్‌‌‌‌లాండ్): థాయ్‌‌‌‌లాండ్, కంబోడియా మధ్య సరిహద్దు వివాదంతో చెలరేగిన ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. ఇరుదేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. మూడు రోజులుగా సరిహద్దుల్లో పలుచోట్ల దాడులు కొనసాగుతున్నాయి. ఘర్షణలు క్రమంగా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి.  తాజాగా థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌లోని ట్రాట్ ప్రావిన్స్‌‌‌‌, కంబోడియాలోని ప్రుశాట్ ప్రావిన్స్‌‌‌‌ సరిహద్దుల్లో ఇరుదేశాలకు చెందిన బలగాలు దాడులు చేసుకున్నాయి. ఈ ఘర్షణల కారణంగా ఇప్పటివరకూ ఇరువైపులా 32 మందికిపైగా పౌరులు, సైనికులు మృతిచెందారు. వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. 4  సరిహద్దు ప్రావిన్స్​ గ్రామాలనుంచి  58వేల మందికి పైగా తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారని థాయ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తమ దేశంలోని సరిహద్దు సమీపంలో ఉన్న ప్రాంతాల నుంచి 23వేల మందికి పైగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారని కంబోడియా వెల్లడించింది. 

యూఎన్ ​భద్రతా మండలి అత్యవసర సమావేశం
మూడోరోజు సరిహద్దు వెంబడి అనేక ప్రాంతాల్లో ఘర్షణలు జరిగినట్లు థాయ్ సైన్యం వెల్లడిచింది. ముయెన్ థామ్ ఆలయం సమీపంలో దాడులు జరిగినట్టు పేర్కొన్నది. ఫిరంగులు, బీఎం21 రాకెట్​ లాంచర్లతో కంబోడియా విరుచుకుపడిందని తెలిపింది. కంబోడియా దాడిలో ఇప్పటివరకూ ఆరుగురు సైనికులు, 13 మంది సామాన్య పౌరులు మరణించారని, మొత్తం 59 మంది గాయపడ్డారని వెల్లడించింది. థాయ్‌‌‌‌లాండ్​ దాడిలో తమ దేశానికి చెందిన 8 మంది పౌరులు, ఐదుగురు సైనికులు చనిపోయినట్టు కంబోడియా వెల్లడించింది. కాగా, థాయ్‌‌‌‌లాండ్, కంబోడియా మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో యూఎన్​భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. ఇరుదేశాలు సంయమనం పాటించి.. శాంతిచర్చలు జరపాలని  సూచించింది.

ఇండియన్​ ఎంబసీ అడ్వైజరీ
థాయ్‌‌‌‌లాండ్​–కంబోడియా మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో కంబోడియాలోని ఇండియన్​ ఎంబసీ అప్రమత్తమైంది. ఈమేరకు అక్కడి భారతీయుల కోసం అడ్వైజరీ జారీ చేసింది. కంబోడియాలో నివసిస్తున్న భారత ప్రజలు సరిహద్దు ప్రాంతాలకు ప్రయాణించొద్దని, ఏదైనా అత్యవసరమైతే ఎంబసీని సంప్రదించాలని సూచించింది. +855 92881676 ఫోన్​ నంబర్‌‌‌‌లో సంప్రదించొచ్చని పేర్కొన్నది.