14 మంది సజీవ దహనం

14 మంది సజీవ దహనం

బ్యాంకాక్: థాయ్​లాండ్​లో ఘోరం జరిగింది. నైట్ క్లబ్​లో మంటలు చెలరేగి 14 మంది సజీవ దహనమయ్యారు. మరో 40 మంది గాయపడ్డారు. బ్యాంకాక్ కు 150 కిలోమీటర్ల దూరంలోని చోనుబురి ప్రావిన్స్ లో ఈ ఘటన జరిగింది. ఇక్కడి సట్టహిప్ జిల్లాలోని మౌంటెయిన్ బీ నైట్ క్లబ్​లో గురువారం అర్ధరాత్రి ఒంటిగంటకు మంటలు చెలరేగాయి. అప్పటి వరకు మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తున్న జనం.. ఒక్కసారిగా పరుగులు పెట్టారు. కొంతమంది ఎగ్జిట్ వైపు వెళ్లగా, మరికొంతమంది బాత్ రూమ్​లలో దాక్కున్నారు. కానీ పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో క్లబ్ అంతటా అంటుకున్నాయి. ఎగ్జిట్ గేటు, బాత్ రూమ్​లు, డీజే బూత్ దగ్గర ఎక్కువ డెడ్ బాడీలు దొరికాయి.

చనిపోయినోళ్లందరూ థాయ్​లాండ్ దేశస్తులేనని భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి కారణమేంటనేది తెలియలేదు. అయితే క్లబ్ గోడలను మండే స్వభావమున్న మెటీరియల్ తో డిజైన్ చేశారని, దాంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని అధికారులు చెప్పారు. ఒకప్పుడు రెస్టారెంట్​గా ఉండే దాన్ని నైట్ క్లబ్ గా మార్చి అనుమతుల్లేకుండానే నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై థాయ్ ప్రధాని ప్రయుత్ చాన్ ఓచా విచారణకు ఆదేశించారు. గతంలో కూడా థాయ్​లాండ్​లోని నైట్ క్లబ్​లలో అగ్ని ప్రమాదాలు జరిగాయి. 2009లో న్యూఇయర్ వేడుకలలో బ్యాంకాక్​లో జరిగిన ప్రమాదంలో 60 మంది చనిపోయారు. 2012లో ఫుకెట్​లో జరిగిన ప్రమాదంలో నలుగురు చనిపోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.