రాష్ట్రంలో మారనున్న 2023 ఎన్నికల సీన్

రాష్ట్రంలో మారనున్న 2023 ఎన్నికల సీన్
  • ఎవరికి లాభం..ఎవరికి నష్టం
  • 30 సీట్లలో పోటీ చేస్తమన్న పవన్​ కల్యాణ్​
  • రెండు జిల్లాలపై గురి పెట్టిన వైఎస్​ఆర్​ టీపీ
  • బహుజన నినాదంతో జనంలోకి ఆర్​ఎస్​ ప్రవీణ్​
  • తెలంగాణపై ఫోకస్​ పెంచిన కేజ్రీవాల్​ 

రాష్ట్ర రాజకీయాల్లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న పార్టీల వల్ల ఎవరికి లాభం చేకూరుతుంది.. ఎవరి ఓట్లకు గండి పడుతుంది.. అనే చర్చ జోరుగా సాగుతున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రధానంగా పోటీ టీఆర్‌‌ఎస్‌‌, కాంగ్రెస్‌‌ మధ్యే ఉండగా.. తర్వాత పరిణామాలతో బీజేపీ దూసుకొచ్చింది. ఈ మూడు పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలిచేది తామేనని గట్టిగానే చెప్తున్నాయి. తామేమీ తక్కువ కాదని కొత్తగా మరిన్ని పార్టీలు సై అంటున్నాయి. పాదయాత్రలు, సమావేశాలతో లీడర్లు నిత్యం జనంలో తిరుగుతున్నారు. కొత్తగా వచ్చే పార్టీలు 2023  అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తే.. ప్రధాన పార్టీల ఓట్​ షేర్లలో మార్పులు జరిగి, గెలుపు ఓటములను ప్రభావితం చేయొచ్చని విశ్లేషకులు అంటున్నారు. 
హైదరాబాద్​, వెలుగు:
రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల హీట్​ అప్పుడే మొదలైంది. ప్రధాన పార్టీలుగా ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్​, బీజేపీతోపాటు కొత్తగా ఆరేడు పార్టీలు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నాయి. 2014 వరకు ఇక్కడ ప్రధాన పోటీలో ఉన్న టీడీపీ, వైసీపీ.. అటు తర్వాత అదృశ్యమైనప్పటికీ.. మళ్లీ పోటీ చేసే అవకాశమూ లేకపోలేదు. ఇప్పటికే  వైఎస్సార్​ కూతురు, ఏపీ సీఎం జగన్​ సోదరి షర్మిల వైఎస్సార్​టీపీతో ఎంట్రీ ఇచ్చారు. వెయ్యి కిలోమీటర్ల  పాదయాత్ర చేసి, వరుస ఆందోళనలతో జనం దృష్టిని ఆకర్షిస్తున్నారు. 

జనసేన కూడా తెలంగాణలో 30 నుంచి 40 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ తాజాగా ప్రకటించారు. ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ బీఎస్పీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయమంటూ పాదయాత్ర చేస్తున్నారు. ఢిల్లీకి తోడుగా పంజాబ్‌ను గెలుచుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ తమ నెక్ట్స్‌ టార్గెట్‌ తెలంగాణే అని చెప్తున్నది. ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలోని టీజేఎస్‌ గత ఎన్నికల్లో మహాకూటమి నుంచి పోటీ చేసింది.

ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, తెలంగాణ ఇంటి పార్టీ తమకు పట్టున్న చోట పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. వీటికి తోడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన నేతలంతా కలిసి కొత్త పార్టీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో మరో పొలిటికల్‌ ఫోర్స్​ కూడా తెరపైకి వచ్చే ఆస్కారముంది. ఇన్ని పార్టీల్లో ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో.. వీళ్లు సాధించే ఓట్లు పరోక్షంగా ఉపయోగపడి ఎవరిని గద్దెనెక్కిస్తాయో.. ఇంకెవరి అవకాశాలకు గండికొడుతాయోననే చర్చ జరుగుతున్నది.
దూకుడుగా కొత్త పార్టీలు
రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలెప్పుడు వచ్చినా పోటీకి రెడీ అంటూ కొత్త పార్టీలు దూకుడుగా ప్రజల్లోకి వెళ్తున్నాయి.  వైఎస్సార్‌‌టీపీ నాయకురాలు షర్మిల.. రాజన్న సంక్షేమ రాజ్యం తెస్తానని చెప్తూ పాదయాత్ర, నిరుద్యోగ దీక్షలు, రైతుల పక్షాన ఆందోళనలతో జనం మధ్యనే ఉంటున్నారు. రాష్ట్రంలోని అన్ని సీట్లలో పోటీ చేస్తామని చెప్తున్నప్పటికీ.. ప్రధానంగా ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ ప్రభావం చూపనుంది.

బీఎస్పీ స్టేట్‌‌ కో ఆర్డినేటర్‌‌ ఆర్‌‌.ఎస్‌‌. ప్రవీణ్‌‌ కుమార్‌‌ పాదయాత్రతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. కేసీఆర్‌‌ను గద్దె దించి ఏనుగెక్కి ప్రగతి భవన్‌‌కు వెళ్తానని చెప్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బహుజన రాజ్య స్థాపన ఎజెండాతో రంగంలో ఉన్న బీఎస్పీ ఈసారి ఏమేరకు ప్రభావం చూపుతుంది.. ఎన్ని నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులను పోటీకి దింపుతుందనేది ఆసక్తి రేపుతున్నది. తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్య, నిరంజన్​రెడ్డిని ఏపీ నుంచి  రాజ్యసభకు ఎంపిక చేయటంతో  వైసీపీ కూడా వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేస్తుందనే ఊహాగానాలకు తెర లేచింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​ కూడా తమ పార్టీ బరిలోకి దిగుతుందని సంకేతాలు ఇస్తున్నారు. 
ప్రజలు ఎవరివైపు నిలుస్తరో
కేసీఆర్‌‌ అసెంబ్లీని ఈసారి కూడా ముందే రద్దు చేసి వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఎన్నికలకు వెళ్లే చాన్స్‌‌ ఉందని ప్రచారం జరుగుతున్నది. కానీ, షెడ్యూల్‌‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని పలు సందర్భాల్లో ఆయన చెప్పారు. అయినా కాంగ్రెస్‌‌, బీజేపీ రేపోమాపో ఎన్నికలు వస్తున్నాయన్నట్టుగా ప్రజల్లోకి దూకుడుగా వెళ్తున్నాయి. రాహుల్‌‌గాంధీ ఆధ్వర్యంలో  నిర్వహించిన ‘వరంగల్‌‌ డిక్లరేషన్‌‌’ కాంగ్రెస్‌‌లో జోష్‌‌ నింపింది. బండి సంజయ్‌‌ పాదయాత్రలో కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, గోవా సీఎం ప్రమోద్‌‌ సావంత్‌‌, ఇతర ముఖ్య నేతలు పాల్గొని ఆ పార్టీ కేడర్‌‌ను ఉత్సాహ పరిచారు.

ఎన్నికలు లేవని చెప్తున్నా టీఆర్‌‌ఎస్‌‌ ముఖ్య నేతలు మాట్లాడిన ప్రతీసారి మళ్లీ తమకే అధికారం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. ఈ మూడు పార్టీలు ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుండగా, కొత్తగా ఎంట్రీ ఇస్తున్న పార్టీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అంతే దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. టీఆర్‌‌ఎస్‌‌ ఇప్పటికే రెండు సార్లు అధికారం చేపట్టింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును కొత్తగా ఎంట్రీ ఇస్తున్న పార్టీలు తలా కొంత చీల్చితే అది టీఆర్‌‌ఎస్‌‌ కే లాభిస్తుందనే విశ్లేషణలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో, తమకుండే పాజిటివ్‌‌ ఓటుతో తామే గెలిచి తీరుతామని కాంగ్రెస్‌‌, బీజేపీ బలంగా చెప్తున్నాయి. ఈ బహుముఖ పోటీలో ప్రజలు ఎవరి వైపు నిలుస్తరో అనే దానిపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. 
టీడీపీ సహా ఇతర పార్టీల ఓట్ల శాతం అంతంతే
రాష్ట్రంలో టీడీపీ క్రమంగా కనుమరుగైంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 14.7 శాతం ఓట్లతో 15 సీట్లు సాధించింది.  2018లో 3.51 శాతం ఓట్లతో రెండు సీట్లను దక్కించుకుంది. జీహెచ్‌‌ఎంసీలో ఆ పార్టీ ఓట్లు 1.67శాతానికి పడిపోయాయి. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయి. అదే జరిగితే తెలంగాణలో జనసేన ఎంట్రీ వెనుక కూడా టీడీపీ తెరవెనుక చక్రం తిప్పుతుందనే ఊహాగానాలున్నాయి. 2014లో రాష్ట్రంలో రెండు సీట్లు గెలుచుకున్న బీఎస్పీ 2018  ఎన్నికల్లో  2.07శాతం ఓట్లు సాధించినప్పటికీ.. ఎక్కడా సీట్లు గెలవలేదు. కమ్యూనిస్టు పార్టీలు ఓట్ల షేర్​లో  అట్టడుగున ఉన్నాయి. 2014 ఎన్నికల్లో చెరో సీటును గెలుచుకున్న సీపీఐ, సీపీఎం.. 2018 ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలువలేకపోయాయి. 2018 ఎన్నికల్లో రెండు పార్టీలకు వచ్చిన ఓట్లు కేవలం 0.8 శాతం.
ప్రత్యామ్నాయం ఫలిస్తుందా?
ఏపీకే పరిమితమైన పవన్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి సిద్ధమని ప్రకటించారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పదే పదే చెప్తున్న ఆయన​ అక్కడ ప్రతిపక్షాలను ఏకం చేసే ప్రయత్నంలో ఉన్నారు. తెలంగాణలో పవన్‌‌‌‌‌‌‌‌ ఒంటరిగా పోటీ చేస్తారా, పొత్తులతో బరిలోకి దిగుతారా అన్నది తేలాల్సి ఉంది. ప్రతి నియోజకవర్గంలో పవన్​ కల్యాణ్​కు 5 వేల మందికి పైగా అభిమానులున్నారని జనసేన అంచనాలు వేసుకుంటున్నది. ఆమ్‌‌‌‌‌‌‌‌ ఆద్మీ పార్టీ తెలంగాణలో పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉంది. కోదండరాం సహా తెలంగాణ ఉద్యమకారులను తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాల్లో ఉంది. ఇక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి మరికొందరు ఉద్యమకారులను కలుపుకొని కొత్త పార్టీ, రాజకీయ వేదిక ఏర్పాటు దిశగా ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను గద్దె దించాలంటే ఉద్యమకారులంతా ఏకం కావాలని ఆయన చెప్తున్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు పోటీగా ఉద్యమ పార్టీ తెరపైకి వస్తే పొలిటిక్‌‌‌‌‌‌‌‌ సీన్‌‌‌‌‌‌‌‌ ఎలా మారుతుందో చూడాలి.
తగ్గుతున్న టీఆర్‌‌ఎస్‌‌ ఓట్‌‌ షేర్‌‌
2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్‌‌కు ప్రజలు 34.3 శాతం ఓట్లు 63 సీట్లతో అధికారం ఇచ్చారు. టీడీపీ, వైసీపీ, బీఎస్పీ, కాంగ్రెస్‌‌ నుంచి గెలిచి టీఆర్‌‌ఎస్‌‌లో చేరిన వారితో ఆ పార్టీ బలం 90 సీట్లకు చేరింది.  తొమ్మిది నెలల గడువుండగానే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే 2018లో టీఆర్​ఎస్​ 88 సీట్లలో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో టీఆర్‌‌ఎస్‌‌కు 46.87 శాతం ఓట్లు పోలయ్యాయి. 2019లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో ఆ పార్టీ బొక్కబోర్లా పడింది.  మజ్లిస్​కు హైదరాబాద్​ స్థానం వదిలి.. ‘సారు (కేసీఆర్), కారు, పదహారు’ అని ఎంత ప్రచారం చేసినా 17 లోక్​సభ స్థానాల్లో 9 సీట్లను మాత్రమే టీఆర్​ఎస్​ గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్ల శాతం 41.29కి పడిపోయింది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్​ఎస్​ ఓట్ల శాతం మరింత దిగజారింది. ఆ ఎన్నికల్లో 37.82శాతం ఓట్లకే పరిమితమైంది. ఇక జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల విషయానికొస్తే 35.77 శాతానికి పడిపోయింది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మొదటి ప్రాధాన్యం ఓట్ల ప్రకారం చూస్తే రెండు స్థానాలు కలిపి 31.7 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. హుజూరాబాద్‌‌ బైపోల్‌‌లో 40.38శాతం ఓట్లు సాధించినా టీఆర్​ఎస్​ ఓటమిపాలైంది.
బలం పుంజుకున్న బీజేపీ
2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయగా బీజేపీకి 7.1శాతం ఓట్లు వచ్చాయి.  2018 ఎన్నికల్లో సింగిల్‌‌గా పోటీ చేసిన బీజేపీకి 6.98 శాతం ఓట్లే వచ్చాయి. 2019 లోక్​సభ ఎన్నికలకు వచ్చేసరికి 19.45 శాతంతో పుంజుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది. దుబ్బాక బైపోల్‌‌లో 35.57 శాతం ఓట్లతో టీఆర్‌‌ఎస్‌‌ను ఓడగొట్టింది. ఆ వెంటనే జరిగిన జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో ఎవరూ ఊహించనంతగా బీజేపీ బలం పెంచుకుంది. ఏకంగా 35.57శాతం ఓట్లతో 48 డివిజన్లు చేజిక్కించుకుంది. గ్రాడ్యుయేట్స్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి 20.4శాతం ఓట్లు వచ్చాయి. హుజూరాబాద్‌‌ బైపోల్‌‌లో ఏకంగా 51.96 శాతం ఓట్లతో పాటు ఆ సీటును టీఆర్​ఎస్​ నుంచి గెలుచుకుంది. 
హెచ్చుతగ్గుల్లో కాంగ్రెస్‌‌ 
కాంగ్రెస్​ ఓటు బ్యాంకు ఎన్నికలకో తీరుగా మారిపోతున్నది. 2014 ఎన్నికల్లో 25.2శాతం ఓట్లతో కాంగ్రెస్‌‌ ఫర్వాలేదనిపించింది. 2018 ఎన్నికలకు వచ్చేసరికి 28.43 శాతానికి ఓట్లు పెరిగినా సీట్లు తగ్గాయి. 2019 లోక్​సభ ఎన్నికల్లో  29.48శాతంతో వన్‌‌ పర్సంటేజ్‌‌ ఓట్లను పెంచుకుంది. దుబ్బాక బై పోల్‌‌లో 13.48 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.  జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసింది. కేవలం 6.64 శాతం ఓట్లే వచ్చాయి. గ్రాడ్యుయేట్స్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. మొదటి ప్రయారిటీ ఓట్లలో 8.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. హుజూరాబాద్‌‌  బైపోల్‌‌లో మరీ అధ్వాన్నంగా 1.46 ఓట్లే సాధించి, డిపాజిట్​ను కూడా నిలుపుకోలేకపోయింది.