దుబాయ్​లో మందుపై పన్ను ఎత్తేసిన్రు

దుబాయ్​లో మందుపై పన్ను ఎత్తేసిన్రు

దుబాయ్ : గల్ఫ్ దేశాలంటేనే అక్కడి ప్రభుత్వాలు అమలు చేసే కఠినమైన ఆంక్షలు గుర్తుకొస్తాయి. అందులో దుబాయ్ ఒకటి. కానీ, ఇప్పుడు అక్కడి ప్రజలకు ప్రభుత్వం కొంత స్వేచ్ఛ ఇస్తున్నది. దీనికితోడు ఆర్థికాభివృద్ధికి పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నది. టూరిజం డెవలప్​ చేసుకునేందుకు తాజాగా లిక్కర్​పై ఉన్న 30శాతం పన్ను ఎత్తేసింది. గతంలో ఇంట్లో మందు తాగాలన్నా పర్సనల్​ లైసెన్స్ ఉండాలి. దీని కోసం కొంత డబ్బు చెల్లించాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు ఈ రూల్​ను కూడా దుబాయ్ సర్కార్ ఎత్తేసింది. మద్యం విషయంలో చట్టాలను సవరిస్తూ జనవరి 1న దుబాయ్ రాజ కుటుంబం ఈ ప్రకటన చేసింది. గతంలో రంజాన్ నెలలోనూ లిక్కర్ సేల్స్​కు పర్మిషన్ ఇచ్చింది. కరోనా టైంలో హోం డెలివరీ కూడా చేసింది. ఫారినర్లను మరింత ఆకర్షించేందుకు లిక్కర్​పై ట్యాక్స్​ తగ్గించింది. పొరుగు దేశాలతో పోటీపడుతూ టూరిజాన్ని డెవలప్ చేస్తున్నది. 

దుబాయ్​లో పెరగనున్న సేల్స్

వైడర్‌‌‌‌ ఎమిరేట్స్‌‌‌‌ గ్రూప్​కు చెందిన మేరిటైమ్‌‌‌‌ అండ్‌‌‌‌ మర్కంటైల్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ (ఎంఎంఐ), ఆఫ్రికన్ అండ్ ఈస్టర్న్​లు దుబాయ్​లో లిక్కర్ సప్లై చేస్తుంటాయి. వందేండ్ల నుంచి తాము దుబాయ్‌‌‌‌లో లిక్కర్​ బిజినెస్​ చేస్తున్నామని, అప్పట్నుంచి ఎమిరేట్స్‌‌‌‌ నిబంధనల్లో ఎన్నో మార్పులు వచ్చాయని ఎంఎంఐ ప్రతినిధి టైరాన్‌‌‌‌ రీడ్‌‌‌‌ తెలిపారు. తాజా నిర్ణయంతో దుబాయ్, యూఏఈలో మద్యం తక్కువ ధరకే లభిస్తుందని తెలిపారు. సేల్స్​ కూడా పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఆదివారం నుంచే అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు శాశ్వతంగా ఉంటాయా.. లేదా.. అనేది తెలియాల్సి ఉంది. కేవలం ఏడాది పాటు అమలు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు ట్యాక్స్ ఎత్తేయడంతో.. మద్యం విక్రయాలపై భారీగా వచ్చే ఆదాయాన్ని దుబాయ్‌‌‌‌ ప్రభుత్వం కోల్పోనుంది.

‘‘పార్టీ క్యాపిటల్’’గా దుబాయ్​కు పేరు

గల్ఫ్ ‘పార్టీ క్యాపిటల్​’ గా దుబాయ్​ను పిలుస్తుంటారు. లోకల్​గా ట్యాక్స్​ ఎక్కువ ఉండటంతో బల్క్​గా లిక్కర్​ కొనేవాళ్లు ఉమ్ అల్​క్వైన్, ఇతర ఎమిరేట్​లకు వెళ్లొచ్చేవాళ్లు. విదేశీయుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. దుబాయ్​లోని చట్టాల ప్రకారం.. లిక్కర్ తాగాలంటే నాన్​ ముస్లిం రెసిడెంట్స్ కు 21 ఏండ్లు దాటాలి. దుబాయ్​ పోలీసులు జారీ చేసే ప్లాస్టిక్​ కార్డు ఉన్నోళ్లు మాత్రమే మందు తాగొచ్చు, లిక్కర్​ను వెంట తీసుకెళ్లొచ్చు. ఇండ్లల్లో నిల్వ చేసుకోవచ్చు. మిగిలిన వాళ్లు ఈ రూల్ అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు.