యాసంగిలోనూ పత్తిని సాగు చేయించేలా అగ్రికల్చర్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ప్రయత్నాలు

యాసంగిలోనూ  పత్తిని సాగు చేయించేలా అగ్రికల్చర్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ప్రయత్నాలు
  • రైతులకు అవగాహన కల్పించాలని అగ్రికల్చర్‌‌ ఆఫీసర్లకు ఆదేశాలు
  • నీటి వసతి లేకుండా పత్తి సాగు కష్టమంటున్న అధికారులు
  • గతేడాదే విఫలమైన ప్రయోగం

యాదాద్రి, వెలుగు : వానాకాలం సీజన్‌‌లోనే ఎక్కువగా సాగయ్యే పత్తిని ఈ సారి యాసంగిలోనూ సాగు చేయించేలా అగ్రికల్చర్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పత్తి సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఆఫీసర్లకు మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. అయితే యాసంగిలో నీటి వసతి సరిగా లేకుండా పత్తిని సాగు చేయడం కష్టమని, గత సీజన్‌‌లో చేసిన ప్రయోగం విఫలం అయిందని ఫీల్డ్‌‌ లెవల్‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు.

వానాకాలంలోనే తగ్గిన పత్తి సాగు
గతంలో పత్తి రేటు పెరగడంతో సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపారు. దీంతో 2016–-17 వానాకాలం సీజన్‌‌ నుంచి 2021 వరకు పత్తి సాగు పెరుగుతూ వచ్చింది. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడం, విత్తనాలు వేసే టైంలో వానలు పడకపోవడం వల్ల రెండోసారి విత్తనాలు వేయాల్సి వచ్చింది. గత రెండు 
సీజన్లలో భారీ వర్షాలు పడడం పెట్టుబడి పెరగడంతో పాటు దిగుబడి తగ్గింది. దీంతో 2021లో 1.81 లక్షల ఎకరాల్లో సాగు చేసిన రైతులు ఈ సారి 2022 వానాకాలం సీజన్‌‌లో 1.06 లక్షల ఎకరాల్లోనే పత్తి సాగు చేశారు. వానల కారణంగా ఈ సారి ఎకరానికి 5 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది.

గులాబీ పురుగు ఆశించే ప్రమాదం
వానాకాలంలోనే పత్తి సాగు తగ్గుతుంటే యాసంగిలో సాగు చేయడం ఎలా అని ఆఫీసర్లు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ రైతులతో సాగు చేయించినా నష్టాలు తప్పవని అభిప్రాయపడుతున్నారు. వానాకాలంలో సాగు చేసిన పంట నుంచి పత్తిని తీయడం నవంబర్‌‌లో ముగుస్తుంది. కొందరు డిసెంబర్‌‌ వరకు తీస్తూనే ఉంటారు. అయితే యాసంగిలో పత్తిని సాగు చేయాలంటే డిసెంబర్‌‌ గానీ, జనవరిలో గానీ విత్తనాలు వేయాల్సి ఉంటుంది. ఇలా వెంట వెంటనే పత్తిని సాగు చేయడం వల్ల గులాబీ పురుగు ఆశించే ప్రమాదం ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు. 

నీటి వసతి లేకుండా కష్టమే...
పత్తి పంటకాలం సాధారణంగా ఆరు నెలలు ఉంటుంది. దీని వల్ల డిసెంబర్‌‌లో సాగు చేస్తే జూన్‌‌లో చేతికి  వస్తుంది. అయితే జయశంకర్‌‌ అగ్రికల్చర్‌‌ యూనివర్సిటీలో కొత్త విత్తనాలు సృష్టించారని, వీటి వల్ల పత్తి నాలుగు నెలల్లోనే చేతికి వస్తుందని అగ్రికల్చర్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు. నవంబర్‌‌ నెలాఖరులో వానాకాలం పత్తి సీజన్‌‌ ముగియగానే యాసంగి విత్తనాలు వేసినా ఏప్రిల్‌‌లో పత్తి చేతికి వస్తుంది. అయితే మార్చి నుంచే ఎండలు విపరీతంగా పెరుగుతున్నందున పత్తిని కాపాడుకోవాలంటే సీజన్‌‌లో కనీసం 15 సార్లు నీటిని పారించాలి. వర్షాధార పంట అయిన పత్తిని ఎక్కువగా నీటి వసతి లేని భూముల్లోనే సాగు చేస్తుంటారు. అలాంటిది 15 సార్లు నీటిని పారించడం ఇబ్బంది అవుతుందని జిల్లా ఆఫీసర్లు చెబుతున్నారు. మరో వైపు విత్తనాలు ఇంకా అందుబాటులోకే రాలేదు. అవి ఎప్పుడు వస్తాయో కూడా సమాచారం లేదని అగ్రికల్చర్‌‌ ఆఫీసర్లు అంటున్నారు.

కాత, పూత రాలేదు
యాసంగిలో పత్తి సాగు చేయడంపై గతేడాదే జిల్లా అగ్రికల్చర్‌‌ ఆఫీసర్లు ప్రయోగం చేశారు. రామన్నపేట మండలం ఎల్లంకిలోని రైతు బాల్‌‌రెడ్డికి చెందిన ఐదు ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. మొక్కలు ఏపుగా పెరిగినా పూత, కాత రాలేదు. దీంతో ఐదు ఎకరాల్లో మొక్కలను తొలగించినట్లు రైతుల బాల్‌‌రెడ్డి చెప్పారు. 

టార్గెట్‌‌ ఏమీ లేదు 
వానాకాలం మాదిరిగానే యాసంగిలోనూ పత్తి సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ ఎన్ని ఎకరాల్లో సాగు చేయించాలనే టార్గెట్‌‌ పెట్టలేదు. అయితే యాసంగిలో పత్తి సాగు చేయాలంటే డిసెంబర్‌‌లోనే విత్తనాలు వేయాలి. ఇప్పటివరకూ ఇంకా విత్తనాలు రాలేదు.
– అగ్రికల్చర్‌‌ ఆఫీసర్‌‌