తాజ్‌మహల్‌లో మూసి ఉన్న 22 తలుపులు తెరవాలన్న పిటిషన్ కొట్టివేత 

తాజ్‌మహల్‌లో మూసి ఉన్న 22 తలుపులు తెరవాలన్న పిటిషన్ కొట్టివేత 

తాజ్‌మహల్‌లో మూసి ఉన్న 22 గదులను తెరవాలంటూ దాఖలైన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు లఖ్ నవూ బెంచ్ కొట్టేసింది. తాజ్‌మహల్‌లోని 22 గదుల్లో హిందూ దేవతా విగ్రహాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోందని, దీనిపై నిజనిజాలు తేల్చేందుకు ఆ గదులను తెరిచేలా భారత పురావస్తు శాఖ అధికారులను ఆదేశించాలని బీజేపీ యూత్ మీడియా ఇన్ చార్జ్ డాక్టర్ రజనీష్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలని కోర్టును కోరారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియాతో దీనిపై నివేదిక ఇప్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే.. పిటిషనర్ అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. 

తాజ్‌మహల్‌పై హిందూవుల్లో జరుగుతున్న ప్రచారాన్ని పిటిషనర్ కోర్టు ముందు ఉంచారు. ప్రస్తుత తాజ్‌మహల్‌ స్మారకం ఒకప్పుడు శివాలయమంటున్న కొంతమంది వాదనలను ప్రస్తావించారు. కొందరు ఇప్పటికీ శివుడి తేజో మహాలయంగా తాజ్‌మహల్‌ను విశ్వసిస్తున్నారని కోర్టుకు వివరించారు. తాజ్‌మహల్‌లోని 22 గదులు ఎందుకు మూసి ఉన్నాయో..? ఆ గుట్టును విప్పేలా చూడాలని కోరారు. ఆ 22 గదుల్లో హిందూ దేవుళ్లు ఉన్నట్లు కొంతమంది చరిత్రకారులు, కోట్లాది మంది హిందువులు విశ్వసిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. భద్రతా కారణాల వల్లే 22 గదులను మూసినట్లు ఆగ్రాలోని పురావస్తు శాఖ ఇచ్చిన నివేదికను కూడా పిటిషనర్‌ అలహాబాద్ కోర్టుకు సమర్పించారు. ఇన్ని ప్రశ్నలు, విశ్వాసాలు, తాజ్‌మహల్‌ చుట్టూ పెన వేసుకొని ఉన్న నేపథ్యంలో వాటి గుట్టును విప్పేందుకు కోర్టు చొరవ తీసుకోవాలని పిటిషనర్‌ కోరారు. అయితే.. ఈ పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. 

ప్రజాప్రయోజన వ్యాజ్యం వ్యవస్థను అవమానపరిచేలా వ్యవహరించవద్దంటూ పిటిషనర్ పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానాల సమయం వృథా చేయొద్దంటూ బెంచ్ న్యాయమూర్తులు ఉపాధ్యాయ్, సుభాష్ విద్యార్థిలు పిటిషనర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇది కోర్టుకు సంబంధించిన వ్యవహారం కాదని, చరిత్రకారుల ద్వారా తేలాల్సిన విషయమని బెంచ్ స్పష్టం చేసింది. 

తాజ్ మహల్ స్థలం మాదే.. ఆధారాలున్నాయి

మరోవైపు.. తాజ్ మహల్ నిర్మించిన స్థలం తమ రాజ కుటుంబానికి చెందినది అంటూ రాజస్థాన్ కు చెందిన బీజేపీ ఎంపీ దియా కుమారి బుధవారం (ఈనెల 11న) కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఉన్న తాజ్ మహల్ స్థలం జైపూర్ రాజ కుటుంబానికి చెందినదని, షాజహాన్ ఆ ప్రాంతాన్ని పాలించినందున ఆ భూమిని తీసుకున్నారని చెప్పారు. అప్పట్లో భూమిని తీసుకున్నందుకు కొంత పరిహారం కూడా ఇచ్చారని, దానికి సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని, కోర్టు ఆదేశిస్తే ఆ రికార్డ్స్ ను సమర్పిస్తామని అన్నారు.

ఆగ్రాలో తాజ్ మహల్ కట్టించిన ప్రాంతం వాస్తవానికి జైపూర్ పాలకుడు జై సింగ్ కు సంబంధించినది. అందుకు సంబంధించిన ఆధారాలు తమ పూర్వీకుల రికార్డుల్లో ఉన్నాయని బీజేపీ ఎంపీ దివ్య కుమారి చెప్పారు.  ఆ కాలంలో కోర్టుకు వెళ్లే అవకాశం లేదన్న విషయం అందరికీ తెలుసని, ఒకవేళ తమ దగ్గర ఉన్న రికార్డులను పరిశీలిస్తే, అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.

అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ ను కూడా ఆమె సమర్థించారు. తాజ్ మహల్ లోని 22 గదులను తెరవాలని, అప్పుడే వాస్తవం ఏంటో అందరికీ తెలుస్తుందన్నారు. తాజ్ మహల్ కంటే ముందు అక్కడ ఏముందో తెలిసే అవకాశం ఉందన్నారు. మొఘలుల కాలానికి చెందిన తాజ్‌ మహల్‌ను ప్రస్తుతం ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా పరిరక్షిస్తోంది.

మరిన్ని వార్తల కోసం..

శ్రీలంక విడిచి వెళ్లకుండా మహింద రాజపక్సకు భారీ షాక్‌

రాజ్య సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల