ఒక్కో రైతు ఫ్యామిలీపై  రూ.లక్షన్నర అప్పు

ఒక్కో రైతు ఫ్యామిలీపై  రూ.లక్షన్నర అప్పు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో రైతులపై అప్పుల భారం పెరిగిపోతోంది.  ఒక్కో రైతు కుటుంబంపై సగటున రూ.1,52,113 అప్పు ఉంది. నెల ఆదాయం రూ.10 వేలకన్నా తక్కువగానే ఉంది. ఆ వచ్చే ఆదాయంలోనూ ఖర్చులకే 7 వేలు పోతోంది. అన్నీపోను ఒక రైతుకు సగటున మిగులుతున్నది కేవలం రూ.2,100. ఈ విషయాలు ఇటీవల నేషనల్​ శాంపిల్​ సర్వే ఆర్గనైజేషన్​ (ఎన్​ఎస్​ఎస్​వో) చేసిన సర్వేలో వెల్లడయ్యాయి. ‘ఆలిండియా డెట్​ అండ్​ ఇన్వెస్ట్​మెంట్​ సర్వే 2019’ పేరిట దేశంలోని 5,940 గ్రామాల్లో ఉన్న 69,455 కుటుంబాలు, 3,995 పట్టణాల్లో ఉన్న 47,006 కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై ఎన్​ఎస్​ఎస్​వో ఈ సర్వే నిర్వహించింది. అందులో భాగంగా మన రాష్ట్రంలో 130 గ్రామాలు, పట్టణాల్లో మొదటివిడతలో 1,270 కుటుంబాలు, రెండోవిడతలో 1,260 కుటుంబాలపై సర్వే చేశారు.  

వడ్డీ వ్యాపారుల నుంచే ఎక్కువ అప్పులు

రాష్ట్రంలోని రైతులు ఎంత దీనస్థితిలో ఉన్నారో సర్వే వివరించింది. రైతులు ఎక్కువగా వడ్డీ వ్యాపారుల నుంచే అప్పులు తీసుకుంటున్నట్టు తేల్చింది. వారి నుంచే 41.3% అప్పులను రైతులు తీసుకుంటున్నట్టు పేర్కొంది. షెడ్యూల్డ్​ కమర్షియల్​ బ్యాంకుల నుంచి 24.8%, గ్రామీణ బ్యాంకుల నుంచి 8.2%, డ్వాక్రా సంఘాల నుంచి 4.6%, కో–ఆపరేటివ్​ బ్యాంకుల నుంచి 3.2 శాతం, కో–ఆపరేటివ్​ సొసైటీల నుంచి 0.5%, ఫైనాన్స్​ సంస్థల నుంచి 1.2 శాతం, ధాన్యం వ్యాపారుల నుంచి 9.1 శాతం వరకు అప్పులు తీసుకుంటున్నారని వెల్లడైంది. బంధువులు, స్నేహితుల దగ్గర 1.4 శాతం,  ఇతర ఏజెన్సీల వద్ద 5.8 శాతం అప్పులు తీసుకున్నట్టు తేలింది. రైతు కుటుంబానికి అప్పులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ఏపీలో ఎక్కువగా ఒక్కో రైతు కుటుంబానికి రూ.2,45,554 అప్పు ఉండగా, తర్వాత కేరళలో ఒక్కో కుటుంబానికి సగటున  రూ.2,42,482 అప్పులున్నాయి. దేశంలోని సగటు రైతు కుటుంబ అప్పు రూ.74,121గా ఉండగా మన రాష్ట్ర సగటు రెట్టింపు  ఉంది. 

నెలకు రూ.10 వేలలోపే

రాష్ట్రంలో ఒక్కో రైతు కుటుంబం కూలీ ద్వారా రూ.2,961, పంట ఉత్పత్తుల ద్వారా రూ.4,937, పశుపోషణ ద్వారా రూ.689, నాన్​ఫామ్​ బిజినెస్​ ద్వారా రూ.748 ఆదాయం వస్తోందని సర్వే తేల్చింది. మొత్తంగా నెలకు ఓ వ్యవసాయ కుటుంబం రూ.9,403 సంపాదిస్తోందని వెల్లడైంది. దేశ సగటు ఆదాయం రూ.10,218తో పోలిస్తే రాష్ట్రంలోని వ్యవసాయ కుటుంబాల సగటు ఆదాయం తక్కువగా ఉండడం గమనార్హం. దేశంలోనే అత్యధికంగా మేఘాలయలో ఒక వ్యవసాయ కుటుంబానికి రూ.29,348 ఆదాయం వస్తోంది. పంజాబ్​లో రూ.26,701 రాబడి వస్తోంది. హర్యానా, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్​ సహా 18 రాష్ట్రాల్లో ఒక వ్యవసాయ కుటుంబ సగటు ఆదాయం రూ.10 వేలపైనే ఉంది. 

సాగు ఖర్చు ఎక్కువ

సాగుపై ఎక్కువగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో మన రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కౌలు, కూలీ, ఇతర ఖర్చులు కలిపి ఒక్కో రైతు కుటుంబం సగటున నెలకు రూ.7,262 ఖర్చు చేస్తున్నట్టు సర్వే తేల్చింది. ఆదాయంలో ఖర్చు పోనూ ఒక్కో కుటుంబానికి మిగులు కేవలం 2,141 రూపాయలే. గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతం మందికి, పట్టణాల్లో 83.3 శాతం మందికి అకౌంట్స్ ఉన్నాయి. అలాగే పోస్టాఫీసు అకౌంట్స్​ గ్రామీణ ప్రాంతాల్లో 5.6 శాతం మందికి ఉండగా, పట్టణాల్లో 2.8 శాతం మందికే ఉన్నాయి. ఇక, పేదోళ్లు, పెద్దోళ్ల మధ్య తేడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పట్నాల్లోని కేవలం 10 శాతం మంది దగ్గర్నే 58.7 శాతం ఆస్తులున్నాయి. ఇక, బిలో పావర్టీ లెవెల్​ (బీపీఎల్​)లోని కింది స్థాయి నుంచి సగం మంది దగ్గర కేవలం 4.1 శాతానికి మించి ఆస్తులు లేవు. అదే పల్లెల్లో అయితే టాప్​ 10 శాతం మంది దగ్గర 39.7 శాతం ఆస్తులున్నాయి.