బీహార్​లో 34 శాతం కుటుంబాల నెల ఆదాయం6 వేల లోపే

బీహార్​లో 34 శాతం కుటుంబాల నెల ఆదాయం6 వేల లోపే
  •     రాష్ట్రంలో 80 శాతం ప్రజలు అట్టడుగు వర్గాలే
  •     42 శాతం మంది కడుపేదరికాన్ని ఎదుర్కొంటున్నరు
  •     పాఠశాల విద్యను పూర్తి చేసిన ఎస్సీలు కేవలం 5 శాతమే!
  •     రాష్ట్ర అసెంబ్లీకి కులగణన రిపోర్టు సమర్పించిన నితీశ్​ సర్కారు

న్యూఢిల్లీ :  బీహార్‌ రాష్ట్రంలో మూడో వంతు కుటుంబాల ప్రజలు నెలకు రూ. 6,000 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. 42 శాతం ఎస్సీ, ఎస్టీల కుటుంబాలు అత్యంత పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్రం లోని మొత్తం ఎస్సీ జనాభాలో12వ తరగతి వరకు చదువుకున్న వారు 5 శాతం మాత్రమే. ఈ మేరకు మంగళవారం బీహార్​ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో సమర్పించిన కులగణన రెండో నివేదికలో కీలక అంశాలు బయటకొచ్చాయి. గత నెలలో రాష్ట్ర కులగణనకు సంబంధించి మొదటి సెట్ డేటా విడుదల  కాగా, మంగళవారం  రాష్ట్రంలోని దాదాపు 215 కులాలకు సంబంధించిన పూర్తి వివరాల  సెకండ్​ సెట్​డేటాను రాష్ట్ర సర్కారు అసెంబ్లీకి సమర్పించింది. 

80 శాతం అట్టడుగు వర్గాలే..

ప్రభుత్వం విడుదల చేసిన కులగణన నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో 34.13 శాతం మంది నెలకు రూ. 6 వేలు, అంతకన్నా తక్కువ సంపాదిస్తున్నారు. 29.61 శాతం మంది రూ.10 వేలు అంతకంటే తక్కువ సంపాదనతో జీవిస్తున్నారు. దాదాపు 28 శాతం మంది రూ. 10 వేల నుంచి  రూ. 50 వరకు నెలసరి సంపాదనతో జీవిస్తుండగా, 4 శాతం కంటే తక్కువ మాత్రమే నెలకు రూ.50 వేల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. రాష్ట్రంలోని 13.1 కోట్ల కంటే ఎక్కువ జనాభాలో 80 శాతానికి పైగా అట్టడుగు వర్గాల ప్రజలు ఉన్నారు.  42.93 శాతం ఎస్సీ, 42.70 శాతం ఎస్టీ, 33.16 శాతం బీసీ, 33.58 శాతం ఎంబీసీ కుటుంబాలు తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటున్నాయి.

ఇతర కులాల్లోనూ 23.72 శాతం, జనరల్​కేటగిరీ కుటుంబాల్లో 25.09 శాతం పేదలుగా ఉన్నట్లు రిపోర్టులో వెల్లడైంది. 25.32 శాతం భూమిహార్​సామాజిక వర్గానికి చెందినవారు, 25.3 శాతం బ్రాహ్మణులు, 24.89 శాతం రాజ్‌పుత్‌లు పేదలుగా ఉన్నారు. బీహార్ జనాభాలో బ్రాహ్మణులు, రాజపుత్రులు 7.11 శాతం, భూమిహార్లు 2.86 శాతం ఉంటారు. బీసీల్లో 35.87 శాతం యాదవులు, 34.32 శాతం కుష్వాహలు, 29.9 శాతం కుర్మీలు ఉన్నారు. యాదవులే ఓబీసీలో అతిపెద్ద కమ్యూనిటీగా ఉన్నారు. ఆర్థికంగా వెనకబడిన(ఈబీసీ) కుటుంబాల్లో 30 శాతానికి పైగా పేదలు ఉన్నారు. 

బీహార్‌లో అక్షరాస్యత

రాష్ట్రంలో మొత్తం అక్షరాస్యత రేటు 79.7 శాతం. లిటరసీ రేటు పురుషుల్లో ఎక్కువ ఉన్నది. ప్రతి1,000 మంది పురుషులకు, 953 మహిళలు చదువుకున్న వారు ఉన్నారు. 5వ తరగతి వరకు చదువుకున్నవారు రాష్ట్రంలో 22.67 శాతం మంది ఉన్నారు. ఎస్సీల్లో కేవలం 5.76 శాతం మంది మాత్రమే పాఠశాల విద్యను పూర్తి చేశారు. బీహార్​కులగణన చేపట్టడం..

ఆ రిపోర్టు కూడా వచ్చిన తర్వాత మిగతా రాష్ట్రాల్లోనూ ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరగనున్న చత్తీస్‌గఢ్, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో పొలిటికల్​గా హాట్​టాపిక్​గా మారింది. కులగణనపై ఇప్పటికే కాంగ్రెస్ తన వైఖరి ప్రకటించగా.. బీజేపీ మాత్రం కులగణనకు సంసిద్ధంగా లేదు.