నెల రోజులుగా గల్ఫ్​లోనే మృతదేహం

నెల రోజులుగా గల్ఫ్​లోనే మృతదేహం

జగిత్యాల, వెలుగు : ఉన్న ఉళ్లో ఉపాధి లేక.. ఇద్దరు బిడ్డలను పెంచి పోషించి లగ్గాలు చేద్దామనే ఆశతో గల్ఫ్ బాట పట్టిన ఓ వలస కార్మికుడి గుండె ఆగిపోయింది. నెల కిందటే చనిపోయినా మృతదేహాన్ని తీసుకువచ్చే వారు లేక అతడి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ‘మా బాపును చివరిసారిగా చూపియ్యుండ్రి’ అని అతడి పిల్లలు వేడుకుంటున్నారు. జగిత్యాల జిల్లా గోవిందారంకు చెందిన మోగిళ్ల శ్రీనివాస్ (46)కు భార్య భాగ్య, కూతుర్లు శృతి, ప్రియాంక ఉన్నారు. ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడంతో 2012లో అప్పు చేసి దుబాయి వెళ్లాడు. ఏజెంట్​మోసం చేయడంతో తిరిగివచ్చాడు. ఎకరం పొలం ఉండగా దాన్ని అమ్మి.. కొంత అప్పు చేసి ఊరిలో ఇల్లు కట్టుకున్నాడు. అప్పులోళ్ల వేధింపులతో ఆ ఇంటిని కూడా అమ్మి పావు గుంట స్థలంలో గుడిసె వేసుకున్నాడు. పదో తరగతి తర్వాత కూతుళ్లను చదివించే స్థోమత లేక మాన్పించారు. మూడేండ్ల కింద మళ్లీ అప్పు చేసి కంపెనీ వీసాపై సౌదీ వెళ్లాడు. సరిగ్గా జీతాలు ఇవ్వకపోవడంతో బయటకు వచ్చి దొరికిన పని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకువచ్చాడు. 

బంధువులు, ఊరోళ్లే బిడ్డ లగ్గం జేసిండ్రు

2021 లో శ్రీనివాస్ సౌదీలో ఉండే టైంలో పెద్ద బిడ్డ శృతికి మంచి సంబంధం రావడంతో గ్రామస్తులు, బంధువులు కలిసి తలా ఇంత వేసుకుని పెండ్లి చేశారు. దీనికి సుమారు రూ.6 లక్షల ఖర్చు కావడంతో ఆ డబ్బులను తల తాకట్టు పెట్టయినా ఇస్తానని శ్రీనివాస్ మాటిచ్చాడు. అన్ని అప్పులు కలిసి సుమారు రూ. 10 లక్షలకు పైగా ఉండడంతో వాటిని తిరిగి చెల్లించాలని రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ఈ క్రమంలో అప్పుల బాధ, కుటుంబ పోషణతో మానసిక ఒత్తిడికి గురై గత నెల నవంబర్15న గుండెపోటుతో పని చేసే చోటే కన్నుమూశాడు.  

మంత్రికి, ఎమ్మెల్యేకు చెప్పినా పట్టించుకోలే..

మేడిపల్లి మండలం నుంచి బీమారం మండలం విడిపోయిన సందర్భంగా మేడిపల్లిలో నవంబర్​21న ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే రమేశ్​బాబు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్​ బావమరిది వారిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. డెడ్​బాడీని తీసుకురావడానికి సాయం చేయాలని కోరారు. పక్కనే ప్లానింగ్​కమిషన్​వైస్​చైర్మన్​బోయినపల్లి వినోద్​కుమార్​ ఉన్నారు. అయితే ఇప్పటివరకు వారు చేసిందేమీ లేదు. మృతుడి పాస్​పోర్ట్ ఇంతకుముందు పని చేసిన కంపెనీ దగ్గరే ఉండడంతో  ఔట్​పాస్​పోర్ట్​ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. శ్రీనివాస్​కుటుంబం దగ్గర చిల్లి గవ్వ లేకపోవడం, మంత్రిని, ప్రజాప్రతినిధిని కలిసినా స్పందన లేకపోవడంతో ఏం చేయాలో తెలియక తల్లడిల్లుతున్నారు. కనిపించిన వారి కాళ్లపై పడుతున్నారు. ఈ మధ్యే శ్రీనివాస్​దీనగాథను తెలుసుకున్న గల్ఫ్​జేఏసీ లీడర్లు డెడ్​బాడీని తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.  టీపీసీసీ ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేశ్​రెడ్డి మాట్లాడుతూ  ప్రభుత్వం స్పందిస్తే తమ పని సులువు అవుతుందన్నారు.  

నా బిడ్డలకు ఏం చెప్పాలే..

‘నా భర్త సచ్చిపోయి నెల రోజులు దాటింది. నాకు ఇద్దరు బిడ్డలు. చిన్న గుడిసెల ఉంటున్నం. అమ్మా...నాన్న సచ్చిపోయిండట కదనే...ఒక్కసారి నాన్నను చివరిసారి సూపియ్యరాదే...అని పిల్లలు ఏడుస్తున్నరు వాళ్లకు నేనేం జెప్పాలె’ అంటూ మృతుడు శ్రీనివాస్ భార్య భాగ్య కన్నీరు పెట్టుకుంది. నాన్న లేడని తెలిసినప్పటి నుంచి దు:ఖం ఆపుకోలేకపోతున్నా..మా బాపు కావాలె’ అని మృతుడు శ్రీనివాస్ చిన్న  కూతురు ప్రియాంక ఆవేదన చెందింది. తన తండ్రి మృతదేహాన్ని తొందరగా తెప్పించాలని వేడుకుంటోంది.