దొడ్డు వడ్లు కొంటలేరు..మన్యంలో రైతులను దోచుకుంటున్న దళారులు

దొడ్డు వడ్లు కొంటలేరు..మన్యంలో రైతులను దోచుకుంటున్న దళారులు

భద్రాచలం,వెలుగు : భద్రాచలం మన్యంలో వరి పండించిన రైతులు దగా పడుతున్నారు. సర్కారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, కొన్ని చోట్ల సెంటర్లున్నా దొడ్డు వడ్లను కొనకపోవడంతో దళారులు గ్రామాల్లోకి వచ్చి తమకిష్టమొచ్చిన రేటుకు కొంటున్నారు. మిల్లర్లు దొడ్డు వడ్లను తీసుకోవడం లేదని జీసీసీ, సొసైటీలు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. కోసిన పంటను కాపాడుకోలేక ఊళ్లోకి వచ్చిన ప్రైవేటు వ్యాపారులకే ఎంతకో ఒకంతకు అమ్ముకుంటున్నారు. వారు సైతం తేమ ఎక్కువగా ఉందని అంటూ ధరలో కోత పెట్టి దగా చేస్తున్నారు. అటు గిట్టుబాటు ధర రాక, ఇటు కొనుగోలు కేంద్రాలు లేక రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.

1001 పండించిన రైతుల గోస పడ్తున్రు..

సన్న వడ్లు పండించాలంటే ఖర్చుతో కూడిన పని. సాంబ తదితర రకాలు సాగు చేస్తే తెగుళ్లు సోకి పెట్టుబడులు ఎక్కువ అవుతాయి. దీంతో మన్యంలో వాతావరణానికి అనుకూలమైన 1001 రకం వడ్లను ఎక్కువగా సాగు చేస్తారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని తాలిపేరు ప్రాజెక్టు, చెరువుల కింద ఈ పంటను ఎక్కువగా సాగు చేశారు. జిల్లాలో 1.64 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 20 వేల ఎకరాల్లో 1001 రకం వడ్లను పండించారు. అయితే ఈ ఏడాది దొడ్డు వడ్లను పండించొద్దని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. దొడ్డు వడ్లు పండించిన వారికి అమ్ముకునేందుకు కూపన్లు కూడా ఇవ్వమని వ్యవసాయశాఖ చెబుతోంది. 

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, విత్తన షాపుల్లో విత్తనాలు అమ్ముతుంటే కేసులు ఎందుకు పెట్టలేదని అంటున్నాన్నారు. కలెక్టర్​ ఆదేశాల మేరకు కొనడం లేదని కేంద్రాల్లో చెబుతుండడంతో పండించిన పంట ఎలా అమ్ముకోవాలి ? ఎవరు కొంటారని  రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే చర్ల మండలంలో నేటికీ ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు కాలేదు. జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో 10, పీఏసీఎస్​ ఆధ్వర్యంలో 114, జీసీసీ ఆధ్వర్యంలో 28 కేంద్రాల చొప్పున 152 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏ సెంటర్​లోనూ దొడ్డు వడ్లు కొనడంలేదు. 

ప్రైవేటు వ్యాపారులకు లాభాల పంట

కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు వడ్లు కొనకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు మన్యంలోని పల్లెలకు వెళ్లి కొనుగోలు కేంద్రాల నుంచి వెనక్కి వచ్చిన వడ్లను తక్కువ ధరకే కొంటున్నారు. నేరుగా ఊళ్లలోకే వెళ్లి కాంటాలు పెడుతున్నారు. కాంటాలో, ధరల్లో మోసాలకు పాల్పడి రైతులను దోపిడీ చేస్తున్నారు. మంచు కారణంగా ధాన్యం తడిగా ఉండడంతో పచ్చి ధాన్యం అంటూ క్వింటాకు రూ.1500 చెల్లిస్తున్నారు. ఎలక్ట్రానిక్​ కాంటాలు వాడకుండా రాళ్లు, ధాన్యం బస్తాలే తూనిక రాళ్లుగా వాడుతూ క్వింటాకు అదనంగా 5 కిలోల ధాన్యం 
తీసుకుంటున్నారు.

రైతులు మోస పోతున్రు..

ప్రభుత్వం సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, కేంద్రాల్లో దొడ్డు వడ్లను తీసుకోవడం లేదు. దీంతో ఇళ్లకు వచ్చిన ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే వడ్లను అమ్ముకోవాల్సి వస్తోంది. అధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టి దొడ్డు వడ్లను కూడా కొనాలి.
- యలమంచిలి వంశీకృష్ణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినం..

మన్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రైవేటు వ్యాపారులకు అమ్మొద్దు. దొడ్డు వడ్ల విషయంలో గత ఏడాదే రైతులకు చెప్పినం. ఇబ్బందులు వస్తున్నాయని, సాగు చేయొద్దని కూడా సూచించినా దొడ్డు వడ్లను పండించారు.  

- ప్రసాద్, డీసీఎస్ఓ, భద్రాద్రికొత్తగూడెం