కుంభం షాక్​తో బీఆర్ఎస్ హైకమాండ్​ అలర్ట్

కుంభం షాక్​తో బీఆర్ఎస్ హైకమాండ్​ అలర్ట్
  • ‘కుంభం’ షాక్​తో బీఆర్ఎస్​ అలర్ట్ 
  • ఉమ్మడి నల్గొండ జిల్లా బాధ్యతలు హరీశ్, కేటీఆర్​కు అప్పగింత 
  • త్వరలో జిల్లాలో మంత్రుల సుడిగాలి పర్యటనలు

నల్గొండ, వెలుగు : కాంగ్రెస్​ సీనియర్​ నేత కుంభం అనిల్​కుమార్​రెడ్డి ఇచ్చిన షాక్​తో బీఆర్ఎస్​ హైకమాండ్​ అలర్ట్​ అయింది. సీఎం కేసీఆర్​ పథకం ప్రకారం అనిల్​కుమార్​రెడ్డిని పార్టీలో చేర్చుకోగా.. దానికి కౌంటర్​గా కాంగ్రెస్ ​పెద్దలు అనిల్​ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించడం బీఆర్ఎస్​ ముఖ్యనేతలను షాక్​కు గురిచేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 స్థానా లను చాలెంజ్​గా తీసుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్​ నాయకత్వాలు పోటాపోటీగా ఆపరేషన్​ఆకర్ష్​ కార్యక్రమాలకు తెరలేపాయి. ఇందులో భాగంగా భువనగిరి ఎంపీ సెగ్మెంట్​పై ఫోకస్​ పెట్టిన కేసీఆర్​ అనిల్​కుమార్​రెడ్డిని పార్టీలోకి తీసుకోవడంలో సక్సెస్​ అయ్యారు. కానీ ఇది జరిగిన రెండు నెలల వ్యవధిలోనే మళ్లీ ఆయన​సొంత గూటికి చేరడం పార్టీ హైకమాండ్​ను డైలమాలో పడేసింది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కేటీఆర్​ను, మంత్రి హరీశ్​ రావును రంగంలోకి దించింది.

బీఆర్ఎస్​కు ఊహించని షాక్​

వచ్చే ఎన్నికల్లో నల్గొండ జిల్లాను కేసీఆర్​ కంచుకోటగా మారుస్తామని జిల్లా మంత్రి జగదీశ్​ రెడ్డి సవాల్​ చేయగా, కాంగ్రెస్ కు​పూర్వవైభవం తెస్తామని ఆ పార్టీ సీనియర్లు చాలెంజ్​ చేశారు. అయితే, కాంగ్రెస్​లో నెలకొన్న విభేదాలు, పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డితో ఉన్న భేదాభిప్రాయాలను అడ్డంపెట్టుకుని బీఆర్ఎస్​ పథకం ప్రకారం ఆ పార్టీ అసమ్మతి నేతల పైన దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే యాదాద్రి జిల్లా కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు అనిల్​కుమార్​రెడ్డిని పార్టీలోకి తీసుకోవడంతో ఆ జిల్లాలో ఇక తమకు ఎదురులేదని భావించింది. కానీ, బీఆర్ఎస్​ క్యాండిడేట్లను ప్రకటించాక సిట్టింగ్​ ఎమ్మెల్యేల వైఖరిపైన ప్రజల్లో, పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పైగా అనిల్​కుమార్​రెడ్డిని పార్టీలోకి తీసుకున్న అధిష్టానం ఆయనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనిల్ మళ్లీ సొంతగూటికి వచ్చారు. నిజానికి అనిల్​ పార్టీలో ఉండడనే సంగతి చాలా రోజుల నుంచే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అలాంటి మార్పు జరిగితే రాజకీయంగా అనిల్​కే నష్టం అన్నట్టుగా బీఆర్ఎస్​ ప్రచారం చేసింది. కానీ, అధిష్టానం ఆదేశాలతో ఏకంగా పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి రంగంలోకి దిగడం, దానికి ఉమ్మడి జిల్లా ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకరించడం బీఆర్ఎస్​ నేతలను షాక్​కు గురి చేసింది. ​ 

నల్గొండ రాజకీయాల్లో రోజుకో మలుపు

ఇంటెలిజెన్స్​ నిఘా వర్గాల రిపోర్ట్​ ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రభుత్వంపై వ్యతిరేకత రోజురోజుకూ పెరిగిపోతున్నదని తెలిసింది. 2018లో అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం వల్ల మెజార్టీ సీట్లు సాధించామన్న ఉద్దేశంతో ఇప్పుడు కూడా.. ఎమ్మెల్యేల మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని సర్వేల్లో తెలిసినప్పటికీ ఎన్నికలకు 3 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించారు. మరోవైపు, జిల్లాలో పార్టీ నేతల అసమ్మతి చల్లారకపోగా, రోజుకో మలుపు తిరుగుతోంది. దీని నుంచి గట్టెక్కేందుకు సొంత పార్టీ నేతలను పక్కకు పెట్టి కాంగ్రెస్​ అసంతృప్త నేతలకు గాలం వేసింది. కాంగ్రెస్​ క్యాండిడేట్లు అనౌన్స్​ అయ్యాక టికెట్​ రానివాళ్లకు భారీ తాయిలాలు ఇచ్చి పార్టీలోకి లాక్కోవాలని పెద్ద స్కెచ్​ వేసింది.  దీనివల్ల పార్టీకి మైలేజ్​ పెరుగుతుందని తద్వారా సొంత పార్టీలోని అసమ్మ తి నేతలు దారిలోకి వస్తారని భావించింది. కానీ ఊహించని రీతిలో కాంగ్రెస్​ నుంచి వచ్చిన నేతలు తిరిగి వెళ్లిపోతుండటం, బీఆర్ఎస్​ అసమ్మ తి నేతలు తలోదారి చూసుకునే పరిస్థితి నెలకొంది. ఇదిచాలదన్నట్టుగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుతో సహా, మరికొంతమంది సీని యర్లు కాంగ్రెస్​లోకి వచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. 

మంత్రుల పైనే ఆశలు..

అనిల్ కుమార్​ రెడ్డి ఇచ్చిన షాక్​తో అలర్ట్​ అయిన బీఆర్ఎస్​ హైకమాండ్.. ఉమ్మడి నల్గొండ జిల్లా ఎన్నికల బాధ్యతలను మంత్రి జగదీశ్​రెడ్డితోపాటు మంత్రులు కేటీఆర్, హరీశ్​ కు అప్పగించి నట్టు తెలిసింది. 12 సీట్లను గెలిపించే బాధ్యత ఈ ముగ్గురు మంత్రుల పైన పెట్టింది. త్వరలో మంత్రులు జిల్లాలో పర్యటించను న్నారు. ఈ నెలాఖరులో మంత్రి హరీశ్​నకిరేకల్, తుంగతుర్తిలో పర్యటించను న్నారు. వచ్చే నెల మొదటి వారంలో కేటీఆర్​ నల్గొండ, మిర్యాలగూడ, సూర్యా పేటలో అభి వృద్ధి కార్యక్రమాలు ప్రారం భించనున్నారు. అభివృద్ధి పైనే నమ్మకం పెట్టుకున్న ఎమ్మెల్యేలు.. అసమ్మతి గండం నుంచి గట్టెక్కేందుకు మంత్రుల పైనే భారం మోపారు. దీనికోసం నామినేటెడ్​ పోస్టులు ఇవ్వడమే కాకుండా అవసరమై తే భారీ తాయిలాలు ఇచ్చేందుకు కూడా వెనకాడట్లేదు. మంత్రులతోపాటు మరో ఎమ్మెల్యే గాదరి కిషోర్​ కుమార్​ కూడా కాంగ్రెస్​లో తనతో టచ్​లో ఉన్న యువనాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది.