
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో బీజేపీకి తప్పకుండా ఉచ్చు బిగుసుకుంటుందని, ఈ వ్యవహారంలో దోషులకు శిక్ష తప్పదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. సోమవారం టీఆర్‌ఎస్ ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్వామిజీల పేరుతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనే ప్రయత్నం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిందన్నారు. ఇందులో తమ పాత్ర లేదని చెప్తున్న ఆ పార్టీ నేతలు విచారణను అడ్డుకొనేందుకు కోర్టు గడప ఎందుకు తొక్కుతున్నారని ప్రశ్నించారు.
తాము అధికారం కోసం అడ్డదారులు తొక్కబోమని శిక్షణా శిబిరాల్లో పేర్కొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వళ్లించినట్లుందన్నారు. తాము రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం టీఆర్‌ఎస్ ఎల్పీలో విలీనమయ్యామని, బీజేపీ.. రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టడానికి ఎమ్మెల్యేలను చేర్చుకుంటుదన్నారు. టీఆర్‌ఎస్ ఎల్పీలో విలీనంపై మణిక్కం ఠాగూర్ నోటీసులకు చట్టపరంగా బదులిస్తామన్నారు.