టూరిస్టులు తప్ప.. ఎవరైనా రావొచ్చు పోవచ్చు

టూరిస్టులు తప్ప.. ఎవరైనా రావొచ్చు పోవచ్చు
  • విదేశీయులకు కేంద్రం పర్మిషన్
  • వీసాల పునరుద్ధరణకు నిర్ణయం
  • ఎలక్ట్రానిక్, టూరిస్ట్,మెడికల్ వీసాలకు మాత్రం నో

న్యూఢిల్లీకరోనా కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇచ్చింది. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ), పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (పీఐఓ) కార్డు హోల్డర్లు మన దేశానికి రావడానికి పర్మిషన్ ఇచ్చింది. వీరితో పాటు విదేశీయులు ఎవరైనా ఏదైనా పని మీద ఇండియాకు రావొచ్చని కేంద్రం తెలిపింది. అయితే టూరిస్టు వీసాపై మాత్రం వచ్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అదే విధంగా నిలిపివేసిన అన్ని రకాల వీసాలను వెంటనే పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నట్లు హోంమంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ఎలక్ట్రానిక్, టూరిస్ట్, మెడికల్ వీసాలపై మాత్రం సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించింది. ఒకవేళ వీసాల గడువు అయిపోతే, మళ్లీ అప్లై చేసుకొని వాటిని పొందొచ్చని తెలిపింది. విదేశీయులు ఎవరైనా మెడికల్ ట్రీట్ మెంట్ కోసం మన దేశానికి రావాలని అనుకుంటే కొత్తగా మెడికల్ వీసా కోసం అప్లై చేసుకోవాలని చెప్పింది.

క్వారంటైన్ రూల్స్ పాటించాల్సిందే..

మనోళ్లు విదేశాలకు వెళ్లడానికి, విదేశీయులు మన దేశానికి రావడానికి వీలుగా వీసా, ట్రావెల్ రూల్స్ లో దశలవారీగా సడలింపులు ఇవ్వాలని నిర్ణయించినట్లు హోం మినిస్ట్రీ తెలిపింది. ఇప్పుడిచ్చిన సడలింపులతో విదేశీయులు బిజినెస్, కాన్ఫరెన్స్, ఎంప్లాయ్ మెంట్, స్టడీస్, రీసెర్చ్, మెడికల్ తదితర పనుల కోసం మన దేశానికి రావడానికి వీలు ఏర్పడిందని చెప్పింది. వీరందరూ ఫ్లైట్లలో లేదా షిప్స్ లో అధికారిక ఎయిర్ పోర్టులు, సీ పోర్టుల గుండా మన దేశంలోని రావొచ్చని పేర్కొంది. ప్రయాణికులందరూ తప్పనిసరిగా క్వారంటైన్ రూల్స్ ను పాటించాలంది. కరోనా కారణంగా కేంద్రం ఫిబ్రవరిలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది.