ఆపరేషన్ అజయ్ : ఇజ్రాయేల్ నుంచి ప్రత్యేక విమానాల్లో భారతీయుల తరలింపు

ఆపరేషన్ అజయ్ : ఇజ్రాయేల్ నుంచి ప్రత్యేక విమానాల్లో భారతీయుల తరలింపు

ఇజ్రాయెల్‌ ఆర్మీ, హమాస్‌ ఉగ్రవాదుల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్న భారతీయుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారత పౌరులను మన దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. 

ఇజ్రాయిల్ నుంచి భారత్​ కు మన పౌరులను తీసుకొచ్చేందుకు  'ఆపరేషన్‌ అజయ్‌'గా కేంద్రం పేరు పెట్టింది. శ్రీలంక పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్​ ఆపరేషన్ అజయ్​ను ప్రారంభిస్తున్నట్లు ఎక్స్ (ట్విట్టర్​)​ వేదికగా ప్రకటించారు. ప్రత్యేక విమానాలతో పాటు ఇతర ఏర్పాట్లు చేశామని చెప్పారు. విదేశాల్లో ఉన్న మన భారతీయులు భద్రత, శ్రేయస్సుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.  గురువారం (అక్టోబర్​ 12న) భారతీయులతో కూడిన మొదటి విమానం మన దేశానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

జై శంకర్​ ప్రకటన తర్వాత ఇజ్రాయెల్​లోని భారత ఎంబసీ.. రిజిస్టర్​ చేసుకున్న భారతీయులకు ఈ-మెయిళ్లను పంపించింది. మిగతా వారికి ఆ తర్వాత వచ్చే విమానాల్లో తరలిస్తామని తెలిపింది. ఇజ్రాయెల్‌లో 20 వేల మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారని ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ కొబ్బి శోషని చెప్పారు.

తమ రాష్ట్రానికి చెందిన 7 వేల మంది ఇజ్రాయెల్‌లో ఉన్నారని, వారి భద్రతకు భరోసా ఇవ్వడానికి జోక్యంచేసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. తమిళనాడుకు చెందినవారు 80 మంది అక్కడ చిక్కుకుపోయారని సీఎం స్టాలిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వారిని క్షేమంగా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ నేపథ్యంలో యుద్ధ భూమిలో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీలో రౌండ్-ది-క్లాక్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్‌లో పరిస్థితిని పర్యవేక్షించడానికి, భారతీయులకు సహాయం అందించడానికి టెల్ అవీవ్, రమల్లాలో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది.

సహాయ కేంద్రాలు..

Israel Hamas War India Helpline Number : ఇజ్రాయెల్‌, పాలస్తీనాల్లో ఉన్న భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం అత్యవసర సహాయక కేంద్రాలను(హెల్ప్‌లైన్‌) ఢిల్లీ, టెల్‌అవీవ్‌, రమల్లాలో ఏర్పాటు చేసింది. ఢిల్లీ కంట్రోల్‌ రూం నంబర్లు, ఈ మెయిల్‌ చిరునామా వివరాలు.. 1800118797 (టోల్‌ఫ్రీ), +91-11-23012113, +91-11-23014104, +911123017905, +919968291988, situationroom@mea.gov.in భారత రాయబార కార్యాలయాలు టెల్‌ అవీవ్‌, రమల్లాల్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల ఫోన్‌ నంబర్లు, ఈ మెయిల్‌ వివరాలు +97235226748, +972543278392, cons1.telaviv@mea.gov.in; +970592916418 (వాట్సప్‌ కూడా), rep.ramallah@mea.gov.in